భారత ఫుట్‌బాల్‌ సమాఖ్యపై వేటు

ABN , First Publish Date - 2022-08-17T10:03:38+05:30 IST

అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎ్‌ఫఎ్‌ఫ)కు ఇది పిడుగులాంటి వార్తే. కొంతకాలంగా ఎన్నికలు జరగక, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ లేకుండా ఉన్న సమాఖ్యలో బయటి..

భారత ఫుట్‌బాల్‌ సమాఖ్యపై వేటు

ఫిఫా నిర్ణయం.. నిషేధం తక్షణమే అమల్లోకి.. ఇతరుల జోక్యమే కారణం

అండర్‌-17 మహిళల  ప్రపంచకప్‌ ఆతిథ్యం రద్దు

న్యూఢిల్లీ: అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎ్‌ఫఎ్‌ఫ)కు ఇది పిడుగులాంటి వార్తే. కొంతకాలంగా ఎన్నికలు జరగక, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ లేకుండా ఉన్న సమాఖ్యలో బయటి వ్యక్తుల (థర్డ్‌పార్టీ) ప్రమేయం ఎక్కువయ్యిందనే ఆరోపణలతో ఏఐఎ్‌ఫఎఫ్‌పై అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సంఘం (ఫిఫా) సస్పెన్షన్‌ విధించింది. ఈ నిషేధం నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని కూడా ప్రకటించింది. 85 ఏళ్ల ఏఐఎఫ్‌ఎఫ్‌ చరిత్రలో ఇలాంటి పరిస్థితి రావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ‘భారత ఫుట్‌బాల్‌ సమాఖ్యపై నిషేధం విధించాలని ఫిఫా కౌన్సిల్‌ బ్యూరో ఏకగ్రీవంగా తీర్మానించింది.


ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుంది. సమాఖ్య కార్యకలాపాల్లో బయటి వ్యక్తుల మితిమీరిన జోక్యం ఎక్కువయ్యింది. ఇది ఫిఫా నిబంధనలకు పూర్తి వ్యతిరేకం. అందుకే ఇలాంటి తీవ్ర చర్య తీసుకోవాల్సి వచ్చింది’ అని ఫిఫా ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ప్రస్తుత   కార్యనిర్వాహక కమిటీ (సీఓఏ)ని రద్దు చేయడంతో పాటు, రోజువారీ కార్యకలాపాలపై ఏఐఎ్‌ఫఎఫ్‌ తిరిగి పూర్తి నియంత్రణ పొందితేనే సస్పెన్షన్‌ నుంచి వెనక్కి తగ్గే అవకాశముందని ఫిఫా పేర్కొంది. ప్రస్తుత పరిణామాలపై అత్యవసర విచారణ కోసం కేంద్రం.. సుప్రీం కోర్టుకు వెళ్లింది. దీనిపై కోర్టు బుధవారం విచారించనుంది. వాస్తవానికి ఫిఫాకు చెందిన నలుగురు సభ్యుల బృందం, క్రీడాశాఖ సీనియర్‌ అధికారుల మధ్య గత శుక్రవారం, సోమవారం చర్చలు కూడా జరిగాయి. సానుకూల ఒప్పందం దిశగానే భేటీ సాగినట్టనిపించినా హఠాత్తుగా ఫిఫా తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్‌కు గురిచేసింది.


భారత జట్టుపై తీవ్ర ప్రభావం

ఫిఫా చర్య ప్రకారం తదుపరి నోటీసు వచ్చేవరకు ఏఐఎ్‌ఫఎఫ్‌ అన్ని సభ్యత్వ హక్కులను కోల్పోతుంది. ముందుగా ఈ సంచలన నిర్ణయం అండర్‌-17 మహిళల వరల్డ్‌క్‌పపై పడింది. భారత్‌లోనే ఈ ఏడాది అక్టోబరు 11 నుంచి 30 వరకు జరగాల్సిన ఈ మెగా టోర్నీ నిర్వహణ సాధ్యం కాదని ఫిఫా తేల్చింది. టోర్నీ ఎప్పుడు, ఎక్కడ జరపాలనే నిర్ణయం త్వరలోనే తీసుకుంటామంది.  అంతేకాకుండా సస్పెన్షన్‌ ఎత్తేసే వరకు భారత ఫుట్‌బాల్‌ క్లబ్బులు, ప్రతినిధులు, ఆటగాళ్లు, రెఫరీలు, అధికారులు ఇకపై అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనడానికి వీల్లేదు. దీంతో వచ్చే నెలలో జరిగే వియత్నాం, సింగపూర్‌తో భారత జట్టు ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లు, ఏఎ్‌ఫసీ కప్‌ ఇంటర్‌ జోనల్‌ సెమీఫైనల్స్‌లో  మోహన్‌ బగాన్‌ మ్యాచ్‌ కూడా రద్దు కాక తప్పదు.


ఎందుకీ వివాదం..

ఏ దేశంలోనైనా ఫుట్‌బాల్‌ కార్యక్రమాలను ఆయా సమాఖ్యలు స్వతంత్రంగా నిర్వహించుకోవాలని ఫిఫా కోరుకుంటుంది. అది ప్రభుత్వమైనా, కోర్టులైనా తృతీయ పక్షం జోక్యాన్ని అస్సలు సహించదు. కానీ ఫిఫా నిబంధనల గురించి స్పష్టంగా తెలిసినప్పటికీ భారత సమాఖ్య నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తూ వచ్చింది. 2020 డిసెంబరులోనే అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉన్నా కార్యరూపం దాల్చలేదు. అప్పటికే మూడు పర్యాయాలు అధ్యక్ష పీఠంపై కూర్చున్న ప్రఫుల్‌ పటేల్‌..  జాతీయ క్రీడాబిల్లు నిబంఽధన ప్రకారం ఇక ఆ  పదవిలో కొనసాగేందుకు ఎంతమాత్రం వీల్లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈ ఏడాది మే 18న ఏఐఎ్‌ఫఎఫ్‌ అధ్యక్షుడు ప్రఫుల్‌, అతడి కార్యవర్గంపై నిషేధం విధించిన సుప్రీం.. సమాఖ్య వ్యవహారాల  పర్యవేక్షణకు జస్టిస్‌ దవే నేతృత్వంలో త్రిసభ్య కార్యనిర్వాహక కమిటీ (సీఓఏ)ని ఏర్పాటు చేసింది.


ఈ పరిణామాలను గమనిస్తున్న ఫిఫా కొంతకాలంగా ఆగ్రహంతోనే ఉంది. పరిస్థితులు మారకపోవడంతో వేటు వేయక తప్పలేదు. అయితే సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈనెల 28న జరగాల్సిన ఏఐఎఫ్‌ఎఫ్‌ ఎన్నికలపై సందేహం నెలకొంది. ఏదిఏమైనా భారత ఫుట్‌బాల్‌ సమాఖ్యపై నిషేధం తొలగాలంటే పూర్తి స్థాయిలో ఏఐఎ్‌ఫఎఫ్‌ కార్యవర్గం  ఎన్నికై, సీఓఏ బాధ్యతల నుంచి తప్పుకొంటే తప్ప వీలు కాదు.


ఫిఫా నిర్ణయం దురదృష్టకరం

 కొద్దిరోజులుగా ఫిఫా ప్రతినిధులతో ఏఐఎ్‌ఫఎఫ్‌ అధికారులు, క్రీడా మంత్రిత్వ శాఖ చర్చిస్తూనే ఉన్నాం. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సమాఖ్యకు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాం. అయినా కూడా ఫిఫా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యంగానూ షాకింగ్‌గా ఉంది.

- త్రిసభ్య కార్యనిర్వాహక కమిటీ (సీఓఏ)


దురదృష్టకర నిర్ణయం. ఇది చాలా కఠినమైన శిక్ష. అయినప్పటికీ, ఏఐఎ్‌ఫఎ్‌ఫలో సమర్ధవంతమైన మార్పులు వచ్చేందుకు ఇది మంచి అవకాశంగా భావించాలి

- బైచుంగ్‌ భూటియా, భారత మాజీ కెప్టెన్‌


ఫిఫా నిర్ణయంపై జట్టు ఆటగాళ్లు అతిగా ఆలోచించరాదు. ఇలాంటి క్లిష్ట సమయంలో మనం పూర్తిగా ఆటపై దృష్టి సారించాల్సిన అవసరముంది.

- సునీల్‌ ఛెత్రి, భారత సాకర్‌ కెప్టెన్‌

పాక్‌పై పోరాడి ఓడిన నెదర్లాండ్స్‌ 

రోటర్‌డామ్‌: పాకిస్థాన్‌తో మంగళవారం జరిగిన తొలి వన్డేలో పసికూన నెదర్లాండ్స్‌ జట్టు పోరాడి ఓడింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ 50 ఓవర్లలో 6 వికెట్లకు 314 పరుగులు చేసింది. సెంచరీ హీరో ఫఖర్‌ జమాన్‌ (109)తో పాటు బాబర్‌ ఆజమ్‌ (74) రాణించాడు. ఛేదనలో నెదర్లాండ్స్‌ 50 ఓవర్లలో 298/8 స్కోరు చేసి 16 పరుగులతో ఓడింది. 62/3 స్కోరుతో ఇబ్బందిపడినా ఎడ్వర్డ్‌ (71), టామ్‌ కూపర్‌ (65), విక్రమ్‌జిత్‌ (65) పోరాడారు.

Updated Date - 2022-08-17T10:03:38+05:30 IST