Abn logo
Apr 12 2021 @ 16:22PM

ఒక్క గోర్ఖాను కూడా ఎన్ఆర్‌సీ నుంచి తొలగించం: అమిత్‌షా

కలింపాంగ్: ఎన్ఆర్‌సీ అమల్లోకి వస్తే ఒక్క గోర్ఖాను కూడా జాబితా నుంచి తొలగించకుండా చూస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా భరోసా ఇచ్చారు. పశ్చిమ బెంగాల్‌లోని కలింపాంగ్‌లో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ఎన్‌ఆర్‌సీ వస్తే గోర్ఖాలను జాబితా నుంచి తొలగించేస్తారంటూ తప్పుడు సమాచారం ప్రచారం జరుగుతోందన్నారు. ఎన్ఆర్‌సీని ఇప్పటి వరకూ తీసుకు రాలేదని, ఒకవేళ తీసుకువచ్చినా ఒక్క గోర్ఖాను కూడా జాబితా నుంచి తొలగించేది లేదని చెప్పారు. ఒక్కరు కూడా ఎన్ఆర్‌సీ వల్ల బాధితులు కారని ఆయన హామీ ఇచ్చారు.

'కలింపాంగ్ ఎళ్ల తరబడి బాధలు పడుతూనే ఉంది. 1986లో ఇక్కడి ప్రజలను సీపీఎం అణిచివేసింది. 1,200 మందికి పైగా గోర్ఖాలు ప్రాణాలు కోల్పాయారు. మీకు న్యాయం జరగలేదు. దీదీ వచ్చి పలువురు గోర్ఖాల ఉసురు తీసుకున్నారు. అప్పుడూ మీకు న్యాయం జరగలేదు. కమలాన్ని (బీజేపీ) ఎన్నుకోండి. "సిట్" ఏర్పాటు చేస్తాం, వాళ్లను కటకటాల వెనక్కి పంపుతాం' అని అమిత్‌షా అన్నారు.

దీనికి ముందు, కలింపాంగ్‌లో అమిత్‌షా రోడ్‌షో నిర్వహించారు. వేలాది మంది కార్యకర్తలు పార్టీ జెండాలతో ర్యాలీలో పాల్గొన్నారు. నార్త్ బెంగాల్ సంస్కృతికి అనుగుణంగా అమిత్‌షా సాంప్రదాయ గోర్ఖా టోపీ, మఫ్లర్ ధరించి రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈనెల 17న జరుగనున్న 5వ విడత పోలింగ్‌లో కలింపాంగ్ నియోజకవర్గం కూడా ఉంది. 

Advertisement
Advertisement