‘ఈశాన్య’ వర్షాల ఆగమనం

ABN , First Publish Date - 2021-10-25T17:08:31+05:30 IST

దక్షిణ భారతదేశంలోకి రాగల 48 గంటల్లో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని చెన్నై వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఆదివారం వారు ఒక ప్రకటన విడుదల చేస్తూ వచ్చే 48 గంటల్లో ఈశాన్య

‘ఈశాన్య’ వర్షాల ఆగమనం

నేడు డెల్టా జిల్లాల్లో...

చెన్నై/అడయార్‌: దక్షిణ భారతదేశంలోకి రాగల 48 గంటల్లో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని చెన్నై వాతావరణ కేంద్రం  అధికారులు తెలిపారు.  ఆదివారం వారు ఒక ప్రకటన విడుదల చేస్తూ వచ్చే 48 గంటల్లో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశంచేందుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు నెలకొనివున్నాయని పేర్కొన్నారు.. ఉత్తర కోస్తా తమిళనాడులో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడివుందని, దీని ప్రభావం కారణంగా ఆదివారం వేలూరు, కృష్ణగిరి, రాణిపేట, తిరుపత్తూరు, కళ్లకుర్చి, తిరువణ్ణామలై, మదురై, పుదుకోట జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల పిడుగులు, మెరుపులతో వర్షం కురిసిందని, కోస్తాతీర జిల్లాలతో పాటు పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసిందని, సోమవారం పుదుకోటతో పాటు డెల్టా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వారు తెలిపారు. ముఖ్యంగా రామనాథపురం, తూత్తుకుడి, విరుదునగర్‌, మదురై, తిరుచ్చి, విలుపురం, కడలూరు, చెంగల్పట్టు జిల్లాలతో పాటు పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతాల్లో ఒకటి రెండు ప్రాంతాల్లో తేలికపాటు వర్షపు జల్లులు పడే అవకాశం ఉందని, 26వ తేదీన శివగంగై, పుదుకోట, రామనాథపురం జిల్లాల్లోని ఒకటి రెండు ప్రాంతాలతో పాటు తేలికపాటి జల్లులు, తిరునెల్వేలి, తూత్తుకుడి, కన్నియకుమారి, తెన్‌కాశి జిల్లాల్లో ఒకటి రెండు ప్రాంతాల్లో పిడుగులు, ఉరుమురులతో కూడిన భారీ వర్షం పడొచ్చని తెలిపారు, అదేవిధంగా 27, 28 తేదీల్లో డెల్లా జిల్లాలతో పాటు కోయంబత్తూరు, సేలం, మదురై, పుదుకోట, రామనాథపురం, తూత్తుక్కుడి, కన్నియకుమారి జిల్లాల్లో ఒకటి రెండు ప్రాంతాల్లో పిడుగులు, మెరుపులతో కూడిన వర్షం పడే సూచనలున్నాయని వారు వివరించారు.


రేపు జిల్లా కలెక్టర్లతో సీఎం సమీక్ష

 రాష్ట్రంలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఈ ముందస్తు చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కూడా ఈనెల 26వ తేదీన జిల్లా కలెక్టర్లతో ఒక సమీక్షాసమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. సాధారణంగా ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాక రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. దీంతో అనేక లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిపోతుం టాయి. ఇలాంటి ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టేందుకు వీలుగా ప్రభుత్వం అనేక రకాలైన చర్యలు చేపడుతుంది. ఇందుకోసం అన్ని జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి, సర్వం సిద్ధంగా ఉండేలా చర్యలు చేపడుతుంది. ఈ క్రమంలో ఈ నెల 26వ తేదీన జిల్లా కలెక్టర్లతో సీఎం సమావేశం కావాలని నిర్ణయించారు. ఇందులో ముందస్తు ఏర్పాట్లపై ఆయన విస్తృతంగా చర్చించి, తగిన సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. ఈ సమీక్షలో అన్ని శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు పాల్గొనున్నారు.

Updated Date - 2021-10-25T17:08:31+05:30 IST