ఆస్ట్రాజెనెకా కొవిడ్ వ్యాక్సిన్‌పై ఉత్తరకొరియా హ్యాకర్ల దాడి!

ABN , First Publish Date - 2020-11-28T02:16:44+05:30 IST

బ్రిటిష్ డ్రగ్ మేకర్ ఆస్ట్రాజెనెకా వ్యవస్థలోకి నార్త్ కొరియాకు చెందిన అనుమానిత హ్యాకర్లు ప్రవేశించేందుకు చేసిన ప్రయత్నం

ఆస్ట్రాజెనెకా కొవిడ్ వ్యాక్సిన్‌పై ఉత్తరకొరియా హ్యాకర్ల దాడి!

న్యూఢిల్లీ: బ్రిటిష్ డ్రగ్ మేకర్ ఆస్ట్రాజెనెకా వ్యవస్థలోకి నార్త్ కొరియాకు చెందిన అనుమానిత హ్యాకర్లు ప్రవేశించేందుకు చేసిన ప్రయత్నం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. కొవిడ్-19 వ్యాక్సిన్ రేసులో ఉన్న ఆస్ట్రాజెనెకాలో హ్యాకర్ల విషయం కలకలం రేపింది. నెట్‌వర్కింగ్ సైట్ లింక్‌డిన్, వాట్సాప్‌లలో రిక్రూటర్ల అవతారమెత్తిన హ్యాకర్లు నకిలీ జాబ్ ఆఫర్లతో ఆస్ట్రాజెనెకాను సంప్రదించారు. అనంతరం హానికారక కోడ్‌తో డిజైన్ చేసిన ఉద్యోగ పత్రాలను పంపి, వారి కంప్యూటర్లలోకి చొరబడేందుకు ప్రయత్నించినట్టు ఈ విషయం తెలిసిన ఇద్దరు వ్యక్తులు తమకు చెప్పినట్టు ‘రాయిటర్స్’ పేర్కొంది.


కొవిడ్ పరిశోధనలో పాలుపంచుకుంటున్న సిబ్బందిని వారు లక్ష్యంగా చేసుకున్నారని, అయితే, ఈ విషయంలో వారు విజయవంతం కాలేకపోయారని ఆ వర్గాలు తెలిపాయి. కొవిడ్ టీకా అభివృద్ధిలో ఉన్న టాప్-3 కంపెనీల్లో ఆస్ట్రాజెనెకా కూడా ఒకటి. కాగా, హ్యాకర్ల దాడిపై స్పందించేందుకు కంపెనీ నిరాకరించింది.


ఆస్ట్రాజెనెకా వ్యవస్థలోకి ప్రవేశించేందుకు ఉపయోగించిన సాధనాలు, పద్ధతులను బట్టి హ్యాకర్లు ఉత్తరకొరియాకు చెందినవారేనని అమెరికా, సైబర్ సెక్యూరిటీ అధికారులు పేర్కొన్నారు. గతంలో వీరు రక్షణ సంస్థలు, మీడియా సంస్థలపై దృష్టిసారించారని, గత కొన్ని వారాలుగా కొవిడ్ సంబంధిత అంశాలపై గురిపెట్టినట్టు దాడులపై దర్యాప్తు చేస్తున్న ముగ్గురు వ్యక్తులు తెలిపారు. 


కొవిడ్ పరిశోధనకు సంబంధించి తాజా వివరాలను సొంతం చేసుకునేందుకు ఇటీవల ఆరోగ్య సంస్థలు, టీకా శాస్త్రవేత్తలు, డ్రగ్ మేకర్స్ వంటివారిపై సైబర్ దాడులు విపరీతంగా పెరిగాయి. ఇలా దొంగిలించిన సమాచారాన్ని విక్రయించవచ్చని, బాధితులను దోచుకోవడానికి ఉపయోగించవచ్చని, లేదంటే విదేశీ ప్రభుత్వాలకు విలువైన వ్యూహాత్మక ప్రయోజనాన్ని కూడా ఇవ్వొచ్చని అన్నారు. ఉత్తరకొరియాకు చెందిన హ్యాకింగ్ గ్రూపులు వివిధ దేశాల్లోని వ్యాక్సిన్ డెవలపర్లను టార్గెట్ చేసినట్టు తాము గుర్తించామని ఇటీవల మైక్రోసాఫ్ట్ తెలిపింది. తమ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కూడా హ్యాకర్ల గుట్టును రట్టు చేసినట్టు దక్షిణ కొరియా చట్టసభ ప్రతినిధులు శుక్రవారం తెలిపారు.  

Updated Date - 2020-11-28T02:16:44+05:30 IST