ప్యాంగ్యాంగ్: ఈ ఏడాది వరుస క్షిపణి ప్రయోగాలతో దూకుడు మీదున్న ఉత్తర కొరియా మారోమారు క్షిపణి పరీక్ష జరిపింది. గురువారం అతిపెద్ద ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ఐసీబీఎం)ను పరీక్షించినట్టు తెలుస్తోంది. దీర్ఘశ్రేణి క్షిపణుల పరీక్షలపై విధించుకున్న స్వీయ నియంత్రణకు మంగళం పాడిన కిమ్ ఈ క్షిపణి పరీక్ష చేపట్టినట్టు దక్షిణ కొరియా, జపాన్ పేర్కొన్నాయి. 2017 తర్వాత నార్త్ కొరియా ఈ స్థాయి పరీక్ష జరపడం ఇదే తొలిసారి. తాజా పరీక్షతో అమెరికాలోని ప్రతి ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకునే అవకాశం నార్త్ కొరియాకు చిక్కింది. ఇది అమెరికాకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది.
ఈ ప్రయోగం ఐసీబీఎం కొత్తరకంగా కనిపించిందని జపాన్ అధికారులు తెలిపారు. ఈ క్షిపణి 6వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ప్రయాణించిందని, 71 నిమిషాలపాటు గాల్లో ఎగిరిందని పేర్కొంది. అది దాని ప్రయోగ స్థలం నుంచి 1,100 పరిధికి చేరుకున్నట్టు తెలిపారు. జపాన్ ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ జోన్ (ఈఈజీ) లోపల, అమెరి ప్రిఫెక్చర్‌కు పశ్చిమాన మధ్యాహ్నం 3.34 గంటలకు ఈ క్షిపణి ల్యాండ్ అయినట్టు కోస్ట్ గార్డ్ తెలిపింది. క్షిపణి గరిష్ట ఎత్తు 6,200 కిలోమీటర్లు, పరిధి 1,080 కిలోమీటర్లు అని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ పేర్కొన్నారు.
తాజా క్షిపణి పరీక్ష ఉత్తర కొరియా చివరి ఐసీబీఎం పరీక్ష కంటే పెద్దది కావడం గమనార్హం. అప్పట్లో హ్వాసాంగ్-15 క్షిపణిని ప్రయోగించినప్పుడు అది 53 నిమిషాలపాటు 4,475 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించి 950 కిలోమీటర్లు పరిధికి చేరుకుంది. కాగా, నార్త్ కొరియా ఈ ఏడాది చేపట్టిన 13వ ప్రయోగం ఇది.
ఇవి కూడా చదవండి