రైతులకు తీపి కబురు

ABN , First Publish Date - 2021-04-17T08:52:53+05:30 IST

ఈ ఏడాది జూన్‌-సెప్టెంబరు మధ్య నైరుతి రుతుపవనాలతో దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతమే నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ

రైతులకు తీపి కబురు

నైరుతిలో సాధారణ వర్షపాతమే!

దీర్ఘకాలిక సగటులో 5 శాతం తగ్గే అవకాశం: ఐఎండీ


నైరుతి రుతుపవనాల సీజన్‌లో దేశంలో 

వర్షపాతం అంచనా తెలిపే మ్యాప్‌ ఇది. 

సాధారణానికి మించి (నీలి రంగు), 

సాధారణ వర్షపాతం (ఆకుపచ్చ), 

సాధారణం కంటే తక్కువ (పసుపు, ఎరుపు) 


అమరావతి/ విశాఖపట్నం, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది జూన్‌-సెప్టెంబరు మధ్య నైరుతి రుతుపవనాలతో దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతమే నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. దీర్ఘకాలిక వ్యవధి సగటు(ఎల్‌పీఏ)లో 96 శాతం నుంచి 104 శాతం నమోదయ్యే అవకాశం ఉంది. పరిమాణాత్మకంగా రుతుపవనాల వర్షపాతం దీర్ఘకాల వ్యవధి సగటులో 5 శాతం తగ్గే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. గ్లోబల్‌ మోడల్‌ సూచనల ప్రకారం నైరుతి రుతుపవనాల కాలంలో పసిఫిక్‌, హిందూ మహాసముద్రంలో తటస్థ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది.


అయితే పసిఫిక్‌, హిందూ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు భారత దేశ రుతుపవనాలపై బలమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. కాగా రుతుపవనాల ప్రభావంపై నవీకరించిన సూచనలను, అలాగే నాలుగు ప్రాంతాలకు వర్షపాతం, జూన్‌ నెలకు సూచనలను మే నెల చివరి వారంలో ఐఎండీ జారీ చేస్తుందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా శుక్రవారం తెలిపారు. ఇదిలావుండగా నైరుతి సీజన్‌లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్‌ రెండు రోజుల క్రితమే తొలి అంచనా నివేదిక విడుదల చేసింది. 


ఉత్తర, మధ్య కోస్తాలో సాధారణ వర్షపాతం

నైరుతి సీజన్‌ నాలుగు నెలల్లో దేశంలో ఎక్కడెక్కడా ఎంతెంత వర్షపాతం నమోదవుతుందన్న వివరాలపై ఐఎండీ అంచనా వేసింది. దాని ప్రకారం రాష్ట్రంలో... ఉత్తర, మధ్య కోస్తా జిల్లాల్లో సాధారణం, అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. అదే దక్షిణ కోస్తాలోని ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, రాయలసీమల్లో సాధారణం, లేదా అంతకంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది. తెలంగాణతో పాటు మధ్య భారతంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. కాగా ఒడిశా, బిహార్‌, జార్ఖండ్‌, పశ్చిమ బెంగాలతోపాటు కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో తక్కువ వర్షపాతం నమోదవుతుంది.


బలహీనపడిన ద్రోణి

కేరళ తీరప్రాంతానికి దగ్గరలో ఆగ్నేయ అరేబియా సముద్రం నుంచి ఉత్తర మధ్య కర్ణాటక వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడింది. అయితే దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో శుక్రవారం అక్కడక్కడ ఈదురుగాలులతో తేలికపాటి వర్షాలు పడ్డాయి. అయితే దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో 36-40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలు జిల్లా బ్రాహ్మణకొట్కూరు 41.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. కాగా శని, ఆదివారాల్లోనూ ఉత్తరకోస్తాలో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని, దక్షిణకోస్తా, రాయలసీమలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. 

Updated Date - 2021-04-17T08:52:53+05:30 IST