మొక్కుబడి విచారణ

ABN , First Publish Date - 2022-08-18T06:14:32+05:30 IST

మొక్కుబడి విచారణ

మొక్కుబడి విచారణ
నందివాడ మత్స్యశాఖాధికారి కార్యాలయంలో ఫిషరీస్‌ జేడీ ఎన్‌.శ్రీనివాసరావు తదితరుల మంతనాలు

పుట్టగుంటలో నామమాత్రంగా అధికారుల తనిఖీలు

హైకోర్టు ఆదేశాలు బేఖాతరు

తాళాలు వేసి ఉన్నాయని వెనుదిరిగిన అధికారులు


గుడివాడ, ఆగస్టు 17 : నందివాడ మండలం పుట్టగుంటలో అక్రమ చెరువుల తవ్వకాలు, ప్రభుత్వ భూముల కబ్జా ఆరోపణలకు సంబంధించి దాఖలైన ప్రజాప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ఉత్తర్వులను జిల్లా యంత్రాంగం బేఖాతరు చేసింది. బుధవారం విచారణను తూతూమంత్రంగానే చేసింది. పుట్టగుంట రెవెన్యూ పరిధిలోని బుడమేరు గట్టు పక్కన ఉన్న 7.75 ఎకరాల ప్రభుత్వ భూమిని కొంతమంది స్వాధీనం చేసుకుని చేపల చెరువులు తవ్వకం చేపట్టడంతో భవిష్యత్‌ భద్రతాదళం వ్యవస్థాపకుడు వైవీ మురళీకృష్ణ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లోనూ కథనాలు ప్రచురితమయ్యాయి. ప్రజాప్రయోజన వ్యాజ్యంపై స్పందించిన హైకోర్టు ఆరు వారాల్లోగా విచారణ చేసి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్‌, ఇతర అధికారులను ఆదేశించింది. ఈ క్రమంలో బుధవారం అధికారులు పుట్టగుంటలోని సదరు భూమి వద్ద విచారణ చేపట్టారు. కలెక్టర్‌ రంజిత్‌ బాషా ఆదేశాల మేరకు ఆర్డీవో పద్మావతి ఆధ్వర్యంలో జిల్లా అధికారుల బృందం చెరువులు తవ్విన ప్రదేశానికి వచ్చింది. చెరువు చుట్టూ పరదాలు కట్టేసి, గేటు పెట్టి, తాళాలు వేసి ఉండటాన్ని గమనించింది. గేటు తీయించేందుకు ప్రయత్నించగా, వివాదాస్పద భూమిలో ఉన్న ఆక్రమణదారులు లోపలికి రాకుండా అడ్డగించడంతో అధికారులు వెనుదిరిగారు. 

ఉదాశీనంగా..

హైకోర్టు ఉత్తర్వుల మేరకు జరుగుతున్న విచారణకు పక్కాగా వెళ్లాల్సిన అధికారులు ఉదాశీనంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆక్రమణదారులకు కీలక ప్రజాప్రతినిధుల అండ ఉండటంతో అధికారులు చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. కనీసం ఆక్రమణదారులను పిలిపించి వారి వద్ద ఉన్న ఆధారాలు పరిశీలించాల్సిన అధికారులు గేటుకు తాళం వేసి ఉండటంతో వెనుదిరిగి రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసు శాఖ రక్షణతో పక్కాగా విచారణ చేపట్టాల్సిన జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషా కూడా కిందిస్థాయి అధికారులను పంపి చేతులు దులుపుకోవడంపై పుట్టగుంట వాసులు మండిపడుతున్నారు. విచారణ విషయమై వివరణ ఇవ్వడానికి సైతం అధికారులు నిరాకరించారు. ఈ నేపథ్యంలో హైకోర్టుకు అధికారులు ఎలా నివేదిక సమర్పిస్తారో వేచిచూడాలి. జిల్లా మత్స్యశాఖ అధికారి (జేడీ ఫిషరీస్‌) ఎన్‌.శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ ఏడీ నిమ్మగడ్డ రమాదేవి, తహసీల్దార్‌ రవికాంత్‌, జిల్లా మైనింగ్‌ శాఖ అధికారి తదితరులు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చారు. 


Updated Date - 2022-08-18T06:14:32+05:30 IST