డ్యాన్స్‌.. వ్యాయామంతో సమానం!

ABN , First Publish Date - 2020-08-02T05:35:47+05:30 IST

డ్యాన్స్‌ నంబర్స్‌లో అదరగొట్టే అమ్మాయిలకు హిందీ పరిశ్రమలో కొదవే ఉండదు. అయితే తనదైన ప్రత్యేకమైన డ్యాన్స్‌తో హీరోయున్లతో సమానమైన ఆదరణ పొందుతోంది కెనడా డ్యాన్సర్‌ నోరా ఫతేహి

డ్యాన్స్‌.. వ్యాయామంతో సమానం!

డ్యాన్స్‌ నంబర్స్‌లో అదరగొట్టే అమ్మాయిలకు హిందీ పరిశ్రమలో కొదవే ఉండదు. అయితే తనదైన ప్రత్యేకమైన డ్యాన్స్‌తో హీరోయున్లతో సమానమైన ఆదరణ పొందుతోంది కెనడా డ్యాన్సర్‌ నోరా ఫతేహి. ఈ 27 ఏళ్ల ముద్దుగుమ్మ తన ఫిట్‌నెస్‌ రహస్యాలను ఇలా వివరిస్తోంది.


డ్యాన్స్‌ నంబర్లలో నటించడం అంటే డ్యాన్స్‌ చేయడం ఒక్కటే కాదు. అంతకుమించిన అంశాలూ ఉంటాయి. వాటిలో అందంగా కనిపించడం కోసం శారీరక దారుఢ్యం తప్పనిసరిగా ఉండాలి. క్లిష్టమైన భంగిమల్లో ఒళ్లు వంచే డాన్సులూ చేయగలగాలి. కాబట్టి తీసుకునే ఆహారం మొదలు, అనుసరించే ఫిట్‌నెస్‌ వరకూ కచ్చితమైన, క్రమబద్ధమైన విధానాలు పాటించాలి. నేను ఇందుకోసం అనుసరించే మెలకువలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే.....


ఫిట్‌నెస్‌ రహస్యం!

నేను పోల్‌ డ్యాన్సింగ్‌, బెల్లీ డ్యాన్సింగ్‌, పైలేట్స్‌, ఫంక్షనల్‌ ట్రైనింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌ చేస్తాను. నేను చాలా త్వరగా బరువు తగ్గిపోతాను. కాబట్టి ప్రతి రోజూ జిమ్‌కు వెళ్లి చెమటలు కక్కాల్సిన అవసరం నాకు లేదు. శరీరం వన్నె తగ్గకుండా ఉండడం కోసం పైలేట్స్‌ చేస్తాను. బెల్లీ డ్యాన్స్‌తో పొట్ట కండరాలు గట్టిపడతాయి. వెన్ను, కాళ్లు, చేతులు కూడా చక్కని ఆకృతి సంతరించుకుంటాయి. డ్యాన్స్‌ వ్యాయామంతో సమానం. జిమ్‌కు వెళ్లి వర్కవుట్‌ చేసే సమయం లేనప్పుడు పోల్‌, బెల్లీ డ్యాన్స్‌లు చేసి ఆ ఫలితాన్ని పొందుతూ ఉంటాను. డ్యాన్స్‌తో కూడా బరువు తగ్గవచ్చు, ఫిట్‌గానూ మారవచ్చు. ప్రతి రోజూ క్రమంతప్పక బెల్లీ డ్యాన్స్‌ చేయగలిగితే ఎముకలు, కీళ్లు దృఢపడతాయి. మరీ ముఖ్యంగా మధ్య వయసులో మొదలయ్యే కీళ్ల బలహీనత సమస్యలు దరి చేరకుండా ఉంటాయి. కాబట్టి మహిళలు ఈ డ్యాన్స్‌ సాధన చేయడం ఫిట్‌నెస్‌లో భాగం చేసుకోవాలి.


పోల్‌ డ్యాన్స్‌

నడుము పైభాగం, తొడలకు అత్యధికమైన వ్యాయామాన్ని అందించే డ్యాన్స్‌ ఇది. ఈ డ్యాన్స్‌లో మీరు శరీరాన్ని పైకి లేపవలసి ఉంటుంది. ఇలా చేయడం వల్ల శరీర శక్తి పెరుగుతుంది. కండరాలు బలహీనపడటం, అలసటకు గురవడం లాంటి సమస్యలు దరి చేరకుండా ఉంటాయి. తీసుకున్న క్యాలరీలను త్వరితగతిన కరిగించాలనుకుంటే ఎంచుకోవలసిన ఉత్తమమైన వర్కవుట్‌ పోల్‌ డ్యాన్స్‌. మిగతా వర్కవుట్స్‌ అన్నిటికంటే అత్యంత అధికంగా కండరాలకు వ్యాయామాన్ని అందించే వర్కవుట్‌ ఇది ఒక్కటే. గుండె ఆరోగ్యానికి ఈ డ్యాన్స్‌ మేలు చేస్తుంది. శరీరం శక్తిని ఖర్చు చేసే వేగం ఈ డ్యాన్స్‌తో పెరుగుతుంది. ఫలితంగా బరువు పెరిగే సమస్య ఉండదు.


పైలేట్స్‌

శరీర ఆకృతి, ఫ్లెక్సిబిలిటీలకు ఈ వ్యాయామం అవసరం. పైలేట్స్‌తో పూర్తి శరీరానికి వ్యాయామం అందుతుంది. మిగతా తీవ్రమైన వ్యాయామాలతో పోల్చుకుంటే పైలేట్స్‌లో ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఊపిరి, శరీర కదలికలు ఒకదానితో ఒకటి సమన్వయపరుచుకుంటూ చేసే వ్యాయామం ఇది. కాబట్టే పైలేట్స్‌ వ్యాయామంలో మెదడుకూ శరీరం మధ్య నిరంతర సమాచార ప్రసారం జరుగుతూ ఉంటుంది.

Updated Date - 2020-08-02T05:35:47+05:30 IST