జకీర్ నాయక్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

ABN , First Publish Date - 2020-09-24T20:44:31+05:30 IST

వివాదాస్పద ఇస్లామిక్ బోధకుడు జకీర్ నాయక్‌ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఆయన నేతృత్వంలోని పీస్ టీవీ ఛానల్,

జకీర్ నాయక్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

న్యూఢిల్లీ : వివాదాస్పద ఇస్లామిక్ బోధకుడు జకీర్ నాయక్‌ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఆయన నేతృత్వంలోని పీస్ టీవీ ఛానల్, మొబైల్ యాప్, యూట్యూబ్ చానళ్లపై నిషేధం విధించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 


జకీర్ నాయక్ ప్రస్తుతం మలేసియాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పీస్ టీవీ, మొబైల్ యాప్, యూట్యూబ్ చానళ్లు మతపరమైన ఛాందసవాదాన్ని రెచ్చగొడుతూ, పర మతాలపై విద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో వీటిని నిషేధించేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు గురువారం వెలువడిన జాతీయ మీడియా కథనాలు చెప్తున్నాయి. 


ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు అందజేసిన నివేదికలో జకీర్ నాయక్ నేతృత్వంలోని పీస్ టీవీ, మొబైల్ యాప్, యూట్యూబ్ చానళ్లు విద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నాయని, వీటికి జీహాదీ గ్రూపులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నట్లు సమాచారం. భారత దేశంలో జీహాదీ ప్రచారం కోసం అరబ్ దేశాల నుంచి నిరంతరం నిధులు అందుతున్నట్లు పేర్కొన్నట్లు తెలుస్తోంది. 


మరోవైపు ఇటీవల ఐబీ, ఎన్ఐఏ, ఇతర ఇంటెలిజెన్స్ సంస్థల ఉన్నతాధికారుల సమావేశంలో జకీర్ నాయక్ సంస్థలు మతపరమైన సామరస్యానికి విఘాతం కలిగే విధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు, దీనికి సంబంధించిన వీడియోలపై చర్చించినట్లు తెలుస్తోంది. 


జకీర్ నాయక్ ఇటీవల విడుదల చేసిన వీడియోలో భారత దేశంలో హిందువులు 60 శాతం మంది మాత్రమే ఉన్నారని, ముస్లింలు ఐకమత్యంగా ఉంటూ, తమ నేతలను ఎన్నుకోవాలని, ఈ లక్ష్యానికి మద్దతిచ్చే పార్టీలకు మాత్రమే ఓట్లు వేయాలని ముస్లింలను కోరినట్లు తెలుస్తోంది. ఈ వీడియోపై కూడా ఉన్నతాధికారులు చర్చించినట్లు చెప్తున్నారు. 


Updated Date - 2020-09-24T20:44:31+05:30 IST