ఆగని ఇసుక అక్రమ రవాణా!

ABN , First Publish Date - 2021-05-09T06:11:28+05:30 IST

మండలంలోని జనగామ, చౌటపల్లి, గౌరవెల్లి, అక్కన్నపేట వాగుల నుంచి ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు.

ఆగని ఇసుక అక్రమ రవాణా!
చౌటపల్లి వాగులో ఎక్స్‌కవేటర్‌తో ట్రాక్టర్‌లో ఇసుకను లోడ్‌ చేస్తున్న దృశ్యం

 ఎక్స్‌కవేటర్లతో వాగులను కొల్లగొడుతున్న అక్రమార్కులు

 అభివృద్ధి  పేరిట వందలాది ట్రిప్పుల ఇసుక డంపులు

 ట్రాక్టర్‌కు రూ.6 వేల చొప్పున దండుకుంటున్న వైనం

 ఇదేంటని ప్రశ్నించినవారికి బెదిరింపులు

 పట్టించుకోని సంబంధిత శాఖల అధికారులు

అక్కన్నపేట, మే 8 మండలంలోని జనగామ, చౌటపల్లి, గౌరవెల్లి, అక్కన్నపేట వాగుల నుంచి ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. కొందరు ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనుల పేరిట గ్రామాల్లో వందలాది ట్రిప్పుల ఇసుకను అక్రమంగా డంపు చేశారు. డిమాండ్‌ ఎక్కువగా ఉండడంతో ఒక్కో ట్రిప్‌ ఇసుకకు రూ. 6వేల చొప్పున అమ్ముకుంటున్నారు. రెవెన్యూ, మైనింగ్‌, పోలీస్‌ శాఖల అధికారులు పూర్తిస్థాయిలో పట్టించుకోకపోవడంతో ఇసుకాసురులు అందినకాడికి దండుకుంటున్నారు. 


పంచాయతీ ట్రాక్టర్లతో అక్రమ రవాణా

కొందరు సర్పంచ్‌లు అయితే ఏకంగా వాగుల్లో ఎక్స్‌కవేటర్లు పెట్టి పంచాయతీ ట్రాక్టర్ల ద్వారా ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు. ఇదేంటని యువకులు నిలదీస్తే అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని బెదిరింపులకు గురి చేస్తూ వారిపై సోషల్‌ మీడియాలో ఆసత్య ప్రచారాలు చేయిస్తుస్తున్నట్టు సమాచారం. నిత్యం ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. బహిరంగ మార్కెట్‌లో ఇసుకకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని అక్రమ రవాణాదారులు అందినంత దోచుకుంటున్నారు. కొద్దినెలలుగా ఈ తతంగాన్ని కొనసాగిస్తూ  వాగులను కొల్లగొడుతున్నారు. గతంలో ట్రాక్టర్‌కు రూ.3వేలు ఉండగా, ప్రస్తుతం రూ.6 వేల నుంచి రూ,7 వేల వరకు వసూలు చేస్తున్నారు. రాత్రి వేళల్లో ఆయా గ్రామాల్లో ప్రజలు, యువజన సంఘాల సభ్యులు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకొని రెవెన్యూ అధికారులకు సమాచారం అందించినా ఫలితం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. 


అభివృద్ధి పేరిట అక్రమ దందా

ఎవరైనా అధికారులు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వాహనాలను పట్టుకుంటే అభివృద్ధి పనుల కోసం తరలిస్తున్నామని చెబుతున్నారు. ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుంటే తమకున్న రాజకీయ పలుకుబడిని ఉపయోగిస్తూ, అధికార పార్టీ నేతల ద్వారా ఫోన్‌ల ద్వారా ఒత్తిడి తెస్తున్నారు. గ్రామ, మండలస్థాయి నేతలు తమ పరిధిలో ఉన్న వాగులపై కన్నేసి ఈ దందాను  కొనసాగిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో కిందిస్థాయి సిబ్బంది సహకరించడంతో వారిని అడిగే నాథుడే కరువయ్యాడు. ఇటీవల చౌటపల్లి గ్రామంలోని వాగులో పగటి పూట కూడా ఎక్స్‌కవేటర్లను వినియోగిస్తూ ఇసుకను తవ్వి గ్రామపంచాయతీ ట్రాక్టర్‌ ద్వారా తరలించారు. గ్రామానికి చెందిన కొంత మంది యువకులు ప్రశ్నిస్తే వారిని భయభ్రాంతులకు గురి చేసినట్లు సదరు యువకులు ఆవేదన వ్యక్తం చేశారు.

 

ఇసుక డంపులను పట్టించుకోని అధికారులు

చౌట్‌పల్లి గ్రామంలో అక్రమంగా డంపు చేసిన వందలాది ట్రిప్పుల ఇసుక గురించి కూడా తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో అధికార పార్టీ నేతలు ఒత్తిడి తేవడంతో రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  ఇప్పటికైనా జిల్లా మైనింగ్‌, రెవెన్యూ, పోలీస్‌ శాఖల అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. 

Updated Date - 2021-05-09T06:11:28+05:30 IST