ఆగని అక్రమ దందా

ABN , First Publish Date - 2022-08-09T05:01:38+05:30 IST

జిల్లాలో రేషన్‌బియ్యం అక్రమ దందాకు అడ్డుకట్ట పడడం లేదు. అక్రమార్కులు య థేచ్ఛగా మహారాష్ట్ర కు తరలిస్తూ.. సొమ్ము చేసుకుంటున్నా రు. కొందరు వ్యాపారులు ఇదేపనిగా గ్రామాల్లో తమ ప్రతినిధుల ద్వారా రేషన్‌ బియ్యాన్ని సేకరించి పెద్దమొత్తంలో సరిహద్దులు దాటిస్తున్నారు.

ఆగని అక్రమ దందా
జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్న అధికారులు(ఫైల్‌)

జిల్లాలో సరిహద్దులు దాటుతున్నరేషన్‌ బియ్యం

తనిఖీల్లో తరచూ పెద్దమొత్తంలో పట్టుబడుతున్న వైనం

త్వరలో డీబీటీ విధానం అమలు !!

సరిహద్దు చెక్‌ పోస్టుల వద్ద కొరవడిన నిఘా

పత్తాలేని సివిల్‌ సప్లయ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు

ఆదిలాబాద్‌, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రేషన్‌బియ్యం అక్రమ దందాకు అడ్డుకట్ట పడడం లేదు. అక్రమార్కులు య థేచ్ఛగా మహారాష్ట్ర కు తరలిస్తూ.. సొమ్ము చేసుకుంటున్నా రు. కొందరు వ్యాపారులు ఇదేపనిగా గ్రామాల్లో తమ ప్రతినిధుల ద్వారా రేషన్‌ బియ్యాన్ని సేకరించి పెద్దమొత్తంలో సరిహద్దులు దాటిస్తున్నారు. గడిచిన ఏడు నెలల్లో జిల్లావ్యాప్తంగా 600క్వింటాళ్లకుపైగా పోలీసుల తనిఖీల్లో రేషన్‌ బియ్యం పట్టుబడడం చూస్తుంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తూనే ఉంది. కొందరు లబ్ధిదారులు రేషన్‌ బియ్యాన్ని తినేందుకు ఇష్టపడడం లేదని తెలుస్తుంది. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న రాయితీ బియ్యాన్ని తీసుకోవడం, దళారులకు అమ్మేసుకోవడం పరిపాటిగా మారింది. జిల్లాలో సేకరించిన రేషన్‌ బియ్యాన్ని సరిహద్దు మండలాలైనా తలమడుగు, బోథ్‌, తాంసి, బేల, జైనథ్‌, నార్నూర్‌ మండ లాల మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్నారు. మహారాష్ట్రలోని బోరి, కిన్వ ట్‌, నాగ్‌పూర్‌, పాండ్రకవడ, ఇతర ప్రాంతాలకు తరలిస్తూ అమ్మేసుకుంటున్నారు. దొరికితే దొంగ.. లేక పోతె దొర అన్న చందంగా జిల్లాలో రేషన్‌ బియ్యం అక్రమదందా కొనసాగుతోంది. ఇటీవల జిల్లా కేంద్రంలోని ఆదర్శ్‌నగర్‌ కాలానికి చెందిన రెహమాన్‌ అనే నిందితుడు మహారాష్ట్రకు రేషన్‌ బియ్యాన్ని తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. అలాగే జిల్లా కేంద్రం నుంచి మహారాష్ట్రలోని బోరి గ్రామానికి మూడు ఆటోల్లో రేషన్‌ బియ్యాన్ని తరలిస్తుం డగా పోలీసులు పట్టుకుని సీజ్‌ చేశారు. ఇలా జిల్లాలో ఏదో ఒకచోట రేషన్‌ బియ్యం నిల్వలు పట్టుబడుతున్నా.. సివిల్‌ సప్లయ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పత్తా లేకుండానే పోతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు పోలీసుల తనిఖీల్లోనే గుట్టలకొద్ది రేషన్‌ బియ్యం పట్టుబడుతున్నా.. సంబంధిత శాఖ అధికారులకు ఏమాత్రం పట్టింపే లేకపోవడం గమనార్హం. 

నేరుగా లబ్ధిదారులకు నగదు?

రేషన్‌బియ్యం అక్రమదందాకు అడ్డుకట్ట పడకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం డీబీటీ (డైరెక్ట్‌ బెనిఫిట్‌ స్కీమ్‌) విధానాన్ని అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. డీబీటీ పథకం అమలుతో రేషన్‌ బియ్యం అక్రమదందాకు అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ విధానం ద్వారా రేషన్‌ బియ్యాన్ని తినేందుకు ఇష్టపడని లబ్ధిదారులను గుర్తించి నేరుగా వారి అకౌంట్లలో నగదును జమ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ విధానం పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతోందని అధికారులు పేర్కొంటున్నా రు. డీబీటీ విధానంతో అక్రమ బియ్యం సరఫరా అరికట్టవచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కొందరు లబ్ధిదారులు రేషన్‌ బియ్యాన్ని కిరాణాషాపుల్లో విక్రయిస్తూ నిత్యావసర వస్తువులను తీసుకుంటున్న ట్లు అధికారులు గుర్తించారు. కిరాణా దుకాణందారులు టోకుగా దళారులకు అమ్మేసుకోవడంతో అక్రమదందా యథేచ్ఛగా సాగుతోంది.  

మహారాష్ట్రలో డిమాండ్‌

జిల్లాలో దళారులు సేకరిస్తున్న రేషన్‌బియ్యానికి మహారాష్ట్రలో భారీ గా డిమాండ్‌ ఉన్నట్లు తెలుస్తుంది. పరిస్థితిని బట్టి ఇక్కడ కిలో బియ్యం రూ.10 నుంచి రూ.12 పెట్టి సేకరిస్తున్న వ్యాపారులు.. పెద్ద మొత్తంలో మహారాష్ట్రకు తరలిస్తూ కిలో రూ.14 నుంచి రూ.16 వరకు అమ్మేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇలా కిలో బియ్యం వెంట రూ.2-రూ.3 వరకు లాభం వస్తున్నట్లు తెలుస్తుంది. అంటే క్వింటాలు బియ్యానికి రూ.200 నుంచి రూ.400 వరకు సంపాదిస్తున్నారు. కొందరు దీనినే పనిగా పెట్టుకోవడంతో పోలీసుల తనిఖీల్లో పదేపదే పట్టుబడుతున్నారు. మహారాష్ట్ర దళారులతో కుమ్మకై దందా కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. రేషన్‌ బి య్యంతో పాటు అడ్డదారుల్లో పత్తి, పప్పు దినుసులు, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, అలాగే గంజాయి, తదితర వస్తువుల రవాణా యథేచ్ఛగా జరుగుతోంది. మహారాష్ట్ర నుంచి దేశీదారు మద్యం, గుట్కాను దిగుమతి చేసుకుంటూ జిల్లా నుంచి రేషన్‌ బియ్యం, గంజాయిని సరఫరా చేస్తూ.. పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్నారు. అక్రమదందాలను అడ్డుపెట్టుకుని కొందరు అధికారులు మాముళ్ల వసూళ్లకు ఎగబడుతున్నట్లు విమర్శ లు వస్తున్నాయి. అధికారులకు అన్ని తెలిసినా.. చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారనే విమర్శలు లేకపోలేదు.

నామమాత్రంగానే తనిఖీలు

జిల్లా సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద నామమాత్రంగానే తనిఖీలు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. అక్రమదందాలకు అడ్డుకట్ట వేసేందుకే జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినా.. ఫలితం కనిపించడం లేదు. ఇక్కడి సిబ్బంది చేతివాటానికి పాల్పడడంతో అక్రమదందాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఏళ్ల తరబడి చెక్‌పోస్టు సిబ్బంది ఒకే చోట విధులు నిర్వహించడంతో స్మగ్లర్లతో సత్సంబంధాలు ఏర్పడుతున్నా యి. బేల మండలంలో సాంగిడి, కంగార్‌పూర్‌, మార్గుడ్‌, కొబ్బాయి గ్రా మాల నుంచి మహరాష్ట్రకు రాకపోకలు కొనసాగుతున్నాయి. కానీ ఈ మండల పరిధిలో ఎక్కడా తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో అక్రమదందా యథేచ్ఛగా సాగుతోంది. అలాగే తాంసి మండలంలో కరంజి(టి) గ్రామం నుంచి మహారాష్ట్రకు రాకపోకలు సాగుతున్నా.. ఇక్కడ కూడా చెక్‌ పోస్టును ఏర్పాటు చేయలేదు. బోథ్‌ మండలంలో ఘన్‌ పూర్‌ గ్రామం వద్ద ఎక్సైజ్‌, వ్యవసాయ, మార్కెటింగ్‌, వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసినా.. నామమాత్రం గానే తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. చెక్‌పోస్టులకు చెల్లించే మా మూళ్ల భారం పెరిగిపోవడంతో కొందరు వ్యాపారులు తెలివిగా అడ్డదారుల్లో దందాను కొనసాగిస్తున్నారు. రాత్రికి రాత్రే కాలినడకన సరిహద్దు లు దాటిస్తూ అమ్మేసుకుంటున్నారు. తలమడుగు మండలంలో లక్ష్మీపూర్‌ గ్రామం వద్ద తనిఖీ కేంద్రం ఉన్నా.. ఇక్కడంతా ప్రైవేటు సిబ్బందే పెత్త నం. జిల్లాలో సరిపడా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విజిలెన్స్‌ అధికారులున్నా.. తనిఖీలకు మాత్రం వెనుకడుగు వేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

అన్ని రకాల కట్టడి చర్యలు తీసుకుంటున్నాం

: సుదర్శన్‌, జిల్లా సివిల్‌ సప్లయ్‌ అధికారి, ఆదిలాబాద్‌

జిల్లాలో జరుగుతున్న అక్రమ రేషన్‌ బియ్యం దం దాను అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల తని ఖీల్లో పట్టుబడిన రేషన్‌ బియ్యాన్ని తిరిగి లబ్ధిదారులకే సరఫరా చేస్తు న్నాం. మహారాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద నిఘాను సారిస్తున్నాం. రేషన్‌ బియ్యం సరఫరాలో కొన్ని మార్పులు చేర్పులు చేపట్టే అవకాశం ఉంది. లబ్ధిదారులు రేషన్‌ బియ్యాన్ని విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే రేషన్‌కార్డును రద్దు చేసే అవకాశం ఉంది.

20 క్వింటాళ్ల ప్రభుత్వ రాయితీ బియ్యం స్వాధీనం

ఆదిలాబాద్‌ టౌన్‌: ఆదిలాబాద్‌ గ్రామీణ పోలీసు స్టేషన్‌ పరిధి లోని రాంపూర్‌  ఫ్లైఓవర్‌ బ్రిడ్జి వద్ద జాతీయ రహదారిపై ఆదిలాబాద్‌ నుంచి మహారాష్ట్రకు బోలెరో మ్యాక్స్‌ వాహనంలో ప్రబుత్వ రాయితీ బియ్యాన్ని తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేర కు తనిఖీ చేయగా.. 20 క్వింటాళ్ల ప్రభుత్వ రాయితీ బియ్యం లభించిందని తెలిపా రు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని, ఆదిలాబాద్‌ పట్ట ణం ఆదర్శనగర్‌ కాలనికి చెంది న నిందితుడు రెహమాన్‌ను అరెస్టు చేసి ఆదిలాబాద్‌ గ్రామీణ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ ఆపరేషన్‌లో సీసీఎస్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-09T05:01:38+05:30 IST