అమ్మ సన్నిధిలో ఆగని దోపిడీ

ABN , First Publish Date - 2020-10-20T07:23:37+05:30 IST

ఇంద్రకీలాద్రిపై అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. దేవస్థానం అధికారులు దసరా ఉత్సవాల పేరుతో అమ్మ సొమ్మును అయినవారికి కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా రూ.4

అమ్మ సన్నిధిలో ఆగని దోపిడీ

 (ఆంధ్రజ్యోతి, విజయవాడ)

ఇంద్రకీలాద్రిపై అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. దేవస్థానం అధికారులు దసరా ఉత్సవాల పేరుతో అమ్మ సొమ్మును అయినవారికి కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా రూ.4 కోట్ల విలువైన శానిటేషన్‌ కాంట్రాక్టులో దేవస్థానం చైర్మన్‌ పైలా సోమినాయుడు, ఈవో సురేశ్‌బాబు కుమ్మక్కయి, టెండర్లను పక్కదారి పట్టించేందుకు చేస్తున్న ప్రయత్నమే ఇందుకు నిదర్శనం.

శరన్నవరాత్రుల సందర్భంగా భక్తులకు అవసరమైన మౌలిక సౌకర్యాలపై దృష్టి పెట్టకుండా కాసులు వచ్చే వాటిపైనే దేవస్థానం అధికారులు ఎక్కువగా దృష్టి సారించారు. దర్శనానికి పది వేల మందికే అనుమతి ఇస్తామని ప్రకటించిన అధికారులు ఏర్పాట్లు లక్ష మందికి చేశారు. ప్రతియేటా ఖర్చు చేసినట్లే ఈ ఏడాది కూడా ఉత్సవాలకు రూ.5 కోట్లు ఖర్చు చూపుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు కాగా, సందట్లో సడేమియాలా రూ.4 కోట్ల విలువైన శానిటేషన్‌ కాంట్రాక్టులో దేవస్థానం చైర్మన్‌ పైలా సోమినాయుడు, ఈవో సురేశ్‌బాబు కుమ్మక్కయి, నిబంధనలను తుంగలో తొక్కి దేవస్థానం ఖజానాకు భారీగా గండికొట్టేందుకు సిద్ధమయ్యారు.


దేవదాయ శాఖ కమిషనర్‌ కాదంటున్నా, ఆయన ఉత్తర్వులు లేకుండానే నామినేషన్‌ పద్ధతిపై రూ.4 కోట్ల విలువైన శానిటేషన్‌ కాంట్రాక్టును దొంగ అగ్రిమెంట్‌ ద్వారా కేఎల్‌ టెక్నికల్‌ సర్వీసెస్‌కు సురేశ్‌బాబు అప్పగించేయడం గమనార్హం. వీరి చర్యల వల్ల దేవస్థానం ప్రతిష్ఠ నానాటికీ దిగజారిపోతోందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

దుర్గగుడిపై ఏడాది కాలంగా శానిటేషన్‌ కాంట్రాక్టును కేఎల్‌ టెక్నికల్‌ సర్వీసెస్‌ నిర్వహిస్తోంది. ఓ మంత్రి బినామీ సంస్థగా ఆరోపణలు ఉన్న ఈ సంస్థకు గత ఏడాది కూడా కాంట్రాక్టును అక్రమ మార్గంలో కట్టబెట్టారు. నాటి టెండర్లలో ఎల్‌ 3గా ఉన్న ఈ సంస్థకు దొంగ మార్గంలో కాంట్రాక్టును కట్టబెట్టారు. ఈ ఏడాది కరోనాను సాకుగా చూపుతూ, కేఎల్‌ టెక్నికల్‌ సర్వీసెస్‌కే మరో ఏడాది గడువు పొడిగించాలని ఈవో ఉన్నతాధికారులకు లేఖ రాశారు.


ఎండోమెంట్‌ కమిషనర్‌ ఈవో ప్రతిపాదనను తిరస్కరించి తిరిగి టెండర్లు నిర్వహించాలని ఆదేశించారు. దీంతో శానిటేషన్‌ నిర్వహణ కోసం టెండర్లు ఆహ్వానిస్తూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. కానీ అడ్డదారిలో కేఎల్‌ టెక్నికల్‌ సర్వీసెస్‌కే శానిటేషన్‌ కాంట్రాక్టును అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా కాంట్రాక్టు సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించేలా దేవస్థానం అధికారులే ప్రోత్సహించారన్న విమర్శలు ఉన్నాయి.  


Updated Date - 2020-10-20T07:23:37+05:30 IST