ఆగని క్రికెట్‌ బెట్టింగ్‌

ABN , First Publish Date - 2021-04-12T05:20:32+05:30 IST

రాయలసీమలోనే వర్తక వాణిజ్య రంగంగా ప్రొద్దుటూరుకు ఎంతో ఖ్యాతి ఉంది. అలాంటి ప్రొద్దుటూరు నేడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది.

ఆగని క్రికెట్‌ బెట్టింగ్‌

ఐపీఎల్‌ పోరులో బెట్టింగ్‌ జోరు

రోజూ రూ.అరకోటిపైనే పందెలు

పోలీసులకు సవాల్‌గా మారిన క్రికెట్‌ బెట్టింగ్‌

ప్రొద్దుటూరు క్రైం, ఏప్రిల్‌ 11: రాయలసీమలోనే వర్తక వాణిజ్య రంగంగా ప్రొద్దుటూరుకు ఎంతో ఖ్యాతి ఉంది. అలాంటి ప్రొద్దుటూరు నేడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. రాష్ట్రంలోనే క్రికెట్‌ బెట్టింగ్‌కు కేంద్ర బిందువైంది. కరోనా పుణ్యాన కనుమరుగైందనుకున్న క్రికెట్‌ బెట్టింగ్‌ ఐపీఎల్‌-14 సీజన్‌తో మళ్లీ విజృంభిస్తోంది. ఐపీఎల్‌ టోర్నమెంట్‌ ఈనెల 9వ తేదీ శుక్రవారం నుంచి ప్రారంభమైంది. మే నెలాఖరు వరకు మ్యాచలు జరగనున్నాయి. ప్రతి మ్యాచ్‌లోను రూ.అరకోటికి పైగానే పందెలు నిర్వహించేలా బుకీలు సమాయత్తమైనట్లు సమాచారం. గతంలో రాజకీయ అండదండలతో బెట్టింగ్‌రాయుళ్లు బెట్టింగ్‌ కార్యకలాపాలు సాగిస్తూ వచ్చారు. ఇపుడు కొందరు బడా బుకీలు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టడం, ఈ పరిస్థితిలో క్రికెట్‌ బెట్టింగ్‌కు చెక్‌ పెట్టడం పోలీసులకు పెను సవాలుగా మారిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 


రెచ్చిపోతున్న బుకీలు

క్రికెట్‌ మ్యాచ్‌ల ప్రారంభానికి వారం రోజుల ముందే ఊరు వదిలి నగరాలకు వెళ్లి అక్కడ సురక్షితమైన ప్రాంతాల్లో మకాం వేసి తమ అనుచరగణంతో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహించేవారు. ఇపుడు బుకీల తీరు అందుకు భిన్నంగా ఉందని పోలీసు వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. స్థానికంగానే ఉండి పెద్దఎత్తున బెట్టింగ్‌ లావాదేవీలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఒకటవ, రెండవ పట్టణ పోలీస్‌స్టేషన్ల పరిధిలోనే క్రికెట్‌ బెట్టింగ్‌ ఎక్కువగా జరుగుతోందని, మూడవ, రూరల్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో దీనికి కొద్దిగా తక్కువగా బెట్టింగ్‌ జూదం సాగుతోందని బుకీల సంఖ్యను బట్టి ఆర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నివాసం లేరన్న సాకుతో వారిపై పోలీసులు దృష్టి పెట్టకపోవడంతో ఆ బుకీలు మరింత పేట్రేగిపోతున్నట్లుగా ప్రజల్లో వాదన ఉంది. అయితే కొన్ని నెలల క్రితం బడా బుకీల పట్టివేతతో వారి బెట్టింగ్‌ వ్యవహారాలు, విలాసవంతమైన జీవితం, తదితరాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. 


రూ.అరకోటిపైనే పందెలు

ఐపీఎల్‌ టోర్నీ శుక్రవారం ప్రారంభమైంది. ఈ టోర్నీ మే 30 వరకు అంటే దాదాపు 50 రోజుల పాటు ప్రతిరోజూ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ లెక్కన ఐపీఎల్‌ టోర్నీ మొత్తంగా ఏ రేంజ్‌లో బెట్టింగ్‌ జరగనుందో ఆర్థం చేసుకోవచ్చు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్న బుకీలు తమదైన శైలిలో భారీ ఎత్తున పందెలు నిర్వహించేలా వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగా బడాబుకీలు లోకల్‌గానే కార్యాలయాలు ఏర్పాటు చేసి సపరేట్‌గా నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం పోలీసుల దృష్టికి కూడా వెళ్లినట్లు సమాచారం.


మాటల్లోనే చేతల్లో చూపని పోలీసులు

ఐపీఎల్‌ టోర్నీమెంట్‌కు ముందే క్రికెట్‌ బెట్టింగ్‌కు చెక్‌ పెడతాం, బెట్టింగ్‌ పాల్పడితే ఖబద్దార్‌ అంటూ హెచ్చరికలు చేసిన పోలీసులు ఆ చర్యలు చేతల్లో చూపడం లేదని పలువురు పోలీసులపై విమర్శలు చేస్తున్నారు. ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరిగే ప్రతిరోజూ బుకీలను స్టేషన్‌లో ఉంచేలా చేసి బెట్టింగ్‌కు పాల్పడకుండా చేస్తామనడమే కానీ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే కొందరు బడా బుకీలు తమ కార్యకలాపాలు సాగించేందుకు ఆఫీసులను కూడా తెరిచినట్లు, కొందరు పోలీసు అధికారులతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నట్లు పోలీసు వర్గాల్లోనే గుసగుసలు విన్పిస్తున్నాయి. 

Updated Date - 2021-04-12T05:20:32+05:30 IST