ఆగని కరోనా వైరస్‌ వ్యాప్తి

ABN , First Publish Date - 2021-04-10T05:51:41+05:30 IST

జిల్లాలో కరోనావ్యాప్తి తగ్గడం లేదు. ప్రతీరోజు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. వైరస్‌ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని టెస్టులు పెంచిన రీతిలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఆర్టీపీసీఆర్‌తో పాటు ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహించడంతో ఈ కేసులు బయటపడుతున్నాయి. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో బ

ఆగని కరోనా వైరస్‌ వ్యాప్తి
జిల్లాకేంద్రంలో వాక్సినేషన్‌ సెంటర్‌కు తరలివచ్చిన జనం

జిల్లాలో చాప కింద నీరులా వ్యాపిస్తున్న వైరస్‌ 

ప్రతీరోజు పరీక్షలతో పెరుగుతున్న కేసుల సంఖ్య

అయినా.. కొవిడ్‌ నిబంధనలు గాలికి

వందలాది మందికి పాజిటివ్‌ నిర్ధారణ

నగరంతో పాటు ఆయా మున్సిపాలిటీల పరిధిలో మహమ్మారి ఉధృతి

జిల్లావ్యాప్తంగా పెంచిన వ్యాక్సినేషన్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో కరోనావ్యాప్తి తగ్గడం లేదు. ప్రతీరోజు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. వైరస్‌ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని టెస్టులు పెంచిన రీతిలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఆర్టీపీసీఆర్‌తో పాటు ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహించడంతో ఈ కేసులు బయటపడుతున్నాయి. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌లు, ప్రభుత్వ కార్యాలయాలు రద్దీగా ఉండే ప్రదేశాల్లో మొబైల్‌ బృందాలను ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్‌ వచ్చినవారిని హోం ఐసోలేషన్‌లో ఉండాలని కోరుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే విసిటర్స్‌ని తగ్గించి ఫోన్‌ ద్వారా సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. సరిహద్దులను మూసివేసి మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాలను సైతం తనిఖీ చేసి పంపిస్తున్నారు.

భారీగా పెరుగుతున్న కేసుల సంఖ్య

 ప్రస్తుతం జిల్లాలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నిత్యం వందకు పైగా కేసులు బయటపడుతున్నాయి. జిల్లాలో శుక్రవారం కూడా వందల సంఖ్యలో కేసులు వెలుగుచూశాయి. గ్రామీణ, పట్టణ అనే తేడా లేకుండా ఈ కేసులు వస్తున్నాయి. మొత్తం 5,345 పరీక్షలు నిర్వహించగా 136 కేసులు బయటపడ్డాయి. అధికారులు ఈ లెక్కలు ప్రకటించినా.. మండలాల్లో వస్తున్న లెక్కలు మాత్రం వేరేగా ఉన్నాయి. కొన్ని మండలాల నుంచి అందిన సమాచారం ప్రకారం 400పైగా కేసులు నమోదయ్యాయి. ఆయా పీహెచ్‌సీల పరిధిలో నిర్వహిస్తున్న ర్యాపిడ్‌ టెస్టుల ద్వారా ఈ కేసులు వస్తున్నాయి. జిల్లాలో మున్సిపాలిటీలు, నిజామాబాద్‌ నగరం పరిధిలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న రెంజల్‌, కోటగిరి, వర్ని మండలాల్లో కూడా కేసుల సంఖ్య  తగ్గడం లేదు. ఇతర మండలాల్లో కూడా కేసులు పెరుగుతున్నాయి. జిల్లాలో శుక్రవారం నిజామాబాద్‌లోని గౌతంనగర్‌ పీహెచ్‌సీలో 76 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఆర్మూర్‌ మున్సిపాలిటీ పరిధిలో 80 కేసులు నమోదయ్యాయి. రెంజల్‌లో 57, నవీపేటలో 59, మాక్లూర్‌లో 27, డిచ్‌పల్లిలో 19, భీంగల్‌లో 16, జక్రాన్‌పల్లిలో 9, వర్నిలో 15, కోటగిరిలో 19, ఇందల్‌వాయిలో 20, కమ్మర్‌పల్లిలో 7, మోర్తాడ్‌లో 15 కేసులు, బాల్కొండలో 13 కేసులు నమోదయ్యాయి. ఇవేకాకుండా ఇతర మండలాల పరిధిలో కూడా కేసులు పెరిగాయి. జిల్లావ్యాప్తంగా ప్రతీరోజు పరీక్షలు నిర్వహిస్తుండడంతో ఎక్కువ కేసులు బయటపడుతున్నాయి. సెకండ్‌ వేవ్‌ వ్యాప్తి కూడా ఎక్కువగానే ఉంది.

కొవిడ్‌ నిబంధనలు గాలికి..

బయటకి వచ్చేవారు నిబంధనలు పాటించకపోవడం, మాస్కులు ధరించకపోవడం వల్ల ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. పోలీస్‌, మున్సిపల్‌ శాఖల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మాస్కులు లేకుండా బయటకి రావద్దని కోరుతున్నారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో మాస్కు లేనివారికి ఫైన్‌లను విధిస్తున్నారు. జనం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అధికారు లు వెళ్లి పరీక్షలు చేస్తున్నారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో కూడా పనుల కోసం వచ్చేవారిని ఆన్‌లైన్‌లో వివరాలు పంపించాలని కోరుతున్నారు. కలెక్టరేట్‌ పోలీస్‌ అవుట్‌పోస్ట్‌ బాక్సులో ఫిర్యాదులను వేయాలని కోరుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అభివృద్ధి పనుల వద్ద కూడా నిబంధనలు పాటించేలా చర్యలు చేపడుతున్నారు. ధాన్యం సేకరణతో పాటు ఉపాధి హామీ పనుల వద్ద నిబంధనలు  అమలు చేయాలని జిల్లా అధికారులు కోరారు. కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆధ్వర్యం లో పలు దఫాలు సమీక్షించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద మాస్కులు తప్పనిసరి ధరించడంతో పాటు శానిటైజర్‌ను వినియోగించే విధంగా అందుబాటులో ఉంచాలని ఆదేశాలు ఇచ్చారు. ఉపాధి పని జరిగే ప్రదేశాల్లోనూ ఈ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని కోరారు. బస్టాండ్‌లో ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు మహారాష్ట్ర నుంచి వచ్చే సర్వీసులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో ఉంచుతున్నారు. అలాగే, కరోనా కేసులు ఎక్కువవుతుండడం వల్ల వ్యాక్సినేషన్‌పైన అధికారులు దృష్టి పెట్టారు. జిల్లావ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాలను పెంచారు. శుక్రవారం 22 పీహెచ్‌సీల పరిధిలో 2,250 మందికి వ్యాక్సిన్‌ వేశారు. జిల్లాలో ఒక్క బోధన్‌, వర్ని మినహా అన్ని ప్రాంతాల్లో కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను వేస్తున్నారు. కొవ్యాక్సిన్‌ సరఫరా లేకపోవడంతో కొవిషీల్డ్‌ వేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా కేసులు పెరుగుతుండడం వల్ల ప్రజలు అప్రమత్తంగా  ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ బాల్‌నరేంద్ర కోరారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకిరావద్దన్నారు. మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని కోరారు. ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటిస్తే తప్ప కరోనా వ్యాప్తి  తగ్గదని ఆయన స్పష్టం చేశారు.

ప్రజలకు అవగాహన కల్పించాలి : మంత్రి

కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌, వాక్సినేషన్‌ ప్రక్రియపై కలెక్టర్‌తో పాటు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో శుక్రవారం మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. జిల్లాలోని బోధన్‌, ఆర్మూర్‌ ఏరియా హాస్పిటల్స్‌లో సరిపడా సదుపాయాలు ఏర్పాటు చేయాలని  కలెక్టరు నారాయణరెడ్డిని మంత్రి ఆదేశించారు. ముఖ్యంగా పేషెంట్‌కి అవసరమయ్యే చికిత్సను బట్టి ముందు ఏరియా హాస్పిటల్‌లో చూడాలని, అత్యవసరం అయితే జిల్లా హాస్పిటల్‌లో చికిత్స అందించాలని సూచించారు. నిజామాబాద్‌లో జనరల్‌ ఓపీని తగ్గించి, కొవిడ్‌ పేషెంట్స్‌ చికిత్సకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అలాగే, కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని, అదేవిధంగా సమాంతరంగా వ్యాక్సినేషన్‌ జరిగేలా చూడాలని ఆదేశించారు. అంతేకాకుండా ప్రజలు కూడా విధిగా స్పీయ నియంత్రణ పాటిస్తూ.. మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలని కోరారు.

Updated Date - 2021-04-10T05:51:41+05:30 IST