నత్తేనయం!

ABN , First Publish Date - 2022-05-26T05:20:34+05:30 IST

జిల్లాలో వరి కోతలు ఊపందుకున్నాయి.

నత్తేనయం!
తిమ్మిది రేకుల గ్రామంలో ధాన్యం రాశులపై కవర్‌ కప్పుతున్న రైతులు

  • ముందుకు సాగని ధాన్యం సేకరణ
  • జిల్లాలో ఊపందుకున్న వరి కోతలు
  • పూర్తిస్థాయిలో తెరుచుకోని కొనుగోలు కేంద్రాలు
  • ధాన్యం అమ్మకానికి ప్రైవేట్‌ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు
  • క్వింటాలుకు రూ.200 నష్టం వస్తున్నా విక్రయం
  • గతేడాది సకాలంలో డబ్బులు ఇవ్వకపోవడమే కారణం


రంగారెడ్డి అర్బన్‌, మే 25 : జిల్లాలో వరి కోతలు ఊపందుకున్నాయి. కానీ కొనుగోలు కేంద్రాలు మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు. 42 కొనుగోలు కేంద్రాలు తెరుచుకోవాల్సి ఉండగా, ప్రస్తుతం 35 కేంద్రాలను ప్రారం భించారు. జిల్లాలో ధాన్యం సేకరణ నత్త నడక కొనసాగు తుంది. రైతులు పండించిన ధాన్యాన్ని అమ్ముకు నేందుకు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావు. గతేడాది ఎదురైన పరిస్థితి ఈసారి కావొద్దని కొంతమంది రైతులు ప్రైవేట్‌ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. గత సంవత్సరం గన్నీ బ్యాగుల కొరత, తేమ శాతం కొర్రీలు, తరుగు పేరిట దోపిడీ వంటి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అలాగే ధాన్యం అమ్మినా సకాలంలో డబ్బులు రాకపోవడం.. పంట పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించారు. ఈసారి అలాంటి ఇబ్బందులకు దూరంగా ఉండాలనుకున్న రైతులు ప్రైవేట్‌ వ్యాపా రులను ఆశ్రయిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో డబ్బులు చెల్లిస్తుండటంతో రైతులు ప్రైవేట్‌ వ్యాపారులకు ధాన్యం అమ్ముకు నేందుకు మొగ్గు చూపుతున్నారు. క్వింటాకు రూ.200 నష్టం వస్తున్నా ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. ప్రైవేట్‌ వ్యాపారులు క్వింటా ధాన్యానికి రూ.1700 చెల్లిస్తున్నారు. కొంతమంది వ్యాపారులు నేరుగా కళ్లాల వద్దకే వెళ్లి ధాన్యం కొంటున్నారు. ప్రభుత్వం గ్రేడ్‌-ఏ రకం క్వింటా ధాన్యానికి రూ. 1,960, సాధారణ రకానికి రూ.1,940 మద్దతు ధర చెల్లిస్తుంది. కానీ.. రైతులు మద్దతు ధరను కోల్పోతున్నారు. చిన్న చిన్న రైతులు ప్రైవేట్‌ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. పెద్ద రైతులు కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. గన్నీ బ్యాగుల కొరతతో పెద్ద రైతులు కేంద్రాల వద్ద ఇబ్బందులు పడుతున్నారు. 


తరుగు పేరిట దోపిడీ

రైతుల కష్టాలు వర్ణణాతీతం.. ఆరుగాలం కష్టించి పంట పండించినవారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో దగా పడుతూనే ఉన్నారు. తరుగు పేరిట రైతులకు శఠగోపం పెడుతున్నారు. ధాన్యంలో తాలు, తేమశాతం, నాణ్యత సాకు చూపుతూ క్వింటాల్‌కు 4 నుంచి 6 కిలోల వరకు తరుగు తీస్తున్నారు. దాన్ని వ్యతిరేకించే రైతులను తిరిగి పంపిస్తామని బెదిరిస్తున్నారు. రైస్‌ మిల్లర్ల యజమానులతో కేంద్రాల నిర్వాహకులు కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నట్లు తెలుస్తోంది. 


లక్ష్యం కొండంత.. సేకరించింది గోరంత

గత ఏడాది యాసంగిలో 46,555 ఎకరాల్లో వరి సాగవుతుందని అధికారులు ప్రణాళిక తయారు చేయగా.. 35,550 ఎకరాలు సాగైంది. ఈసారి 41,016 ఎకరాలు సాగు అంచనా వేయగా 47,232 ఎకరాలు సాగు చేశారు. అంచనాకు మించి రైతులు వరి సాగు చేశారు. ఇందుకు తగ్గట్టుగా 41,215 రైతుల నుంచి 1.18 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశారు. కానీ ఇప్పటి వరకు 6013.360 మెట్రిక్‌ టన్నులు ధాన్యాన్ని 1,462 రైతుల నుంచి సేకరించారు. 


నష్ట పోయాం..

ఈసారి కూడా యాసంగిలో రెండెకరాల వరి పంట సాగు చేశాం. పెట్టుబడి లక్ష రూపా యల వరకు వచ్చింది. పంట కోసేందుకు కూలీలు రాకపో వడంతో మిషన్‌తో కోయించాం. వరి కోసేందుకు మిషన్‌కు గంటకు రూ.3 వేలు ఇచ్చాం. 80 సంచుల వరి ధాన్యం దిగుబడి వచ్చింది. ధాన్యాన్ని సమీపంలోని మిల్లర్‌ వద్దకు తీసుకెళ్లాము. ట్రాక్టర్‌ కిరాయి రూ.1500 తీసుకున్నారు. వరి ఆరలేదని, ఆరబెట్టాకే తూకం వేస్తామని మిల్లర్‌ చెప్పడంతో వారం రోజులు ధాన్యాన్ని మిల్లింగ్‌ వద్ద ఆరబెట్టాము. ఉరుములు మెరుపులతో కూడిన గాలి వర్షం రావడంతో.. ధాన్యాన్ని కాపాడుకునేందుకు చాలా ఇబ్బంది పడ్డాం. రాశులుగా పోసిన ధాన్యం తడవకుండా టార్పాలిన్‌ కవర్లు కూడా లేవు. లారీలపై కప్పే కవర్లు.. ఒక కవర్‌కు రోజుకు రూ.50 చొప్పున కిరాయికి తీసుకుని ధాన్యంపై కప్పాం. చివరకు మోసమే జరిగింది. క్వింటాల్‌ ధాన్యంకు మద్దతు ధర రూ. 1,960 ఉంటే.. రూ.1,600కు తీసుకున్నారు. క్వింటాల్‌ వద్ద రూ.300 నష్టపోయామ్‌. ఈ పరిస్థితి చాలామంది రైతులకు ఎదురవుతుంది. దుక్కులు దున్నినప్పటి నుంచి పంట చేతికొచ్చి.. అమ్ముకునేంత వరకు పంటకు గ్యారంటీ లేకుండా పోయింది.

- కిష్టమ్మ, తొమ్మిడి రేకుల గ్రామం 


ప్రైవేట్‌ వ్యాపారికి అమ్ముకున్నా..

గత ఏడాది రెండెకరాలు విస్తీర్ణంలో వరి పంట సాగుచేను. పంట అమ్మేందుకు నానా ఇబ్బందులు పడ్డాను. గన్నీ బ్యాగులు కూడా ఇవ్వలేదు. గత ఏడాది వరి ధాన్యం డబ్బులు మూడు నెలలు గడిచినా డబ్బులు రాలేవు. పంట పెట్టుబడి కోసం ప్రైవేట్‌గా అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ సారి యాసంగిలో ఒక్క ఎకర పది గుంటల్లో వరి సాగుచేశాను. 30 క్వింటాళ్లు పంట దిగుబడి వచ్చింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో డబ్బులు ఆలస్యంగా వస్తున్నాయని.. ఈ సారి ప్రైవేట్‌ వ్యాపారికి అమ్మేశాను. తేమశాతం, తరుగు వంటికి ఏమి చూడకుండానే క్వింటాలుకు రూ.1,700 చెల్లించాడు. మూడు రోజుల్లో డబ్బులు వచ్చేశాయి. క్వింటాలు వద్ద 200 నష్టపోయినా.. డబ్బులు త్వరగా వస్తున్నాయని ప్రైవేట్‌ వ్యాపారికి అమ్ముకున్నాను. 

- కొట్టం నరేందర్‌రెడ్డి, మంగళగూడ గ్రామం, కేశంపేట మండలం


కొనుగోలు వివరాలు

వరి ధాన్యం కేంద్రాలు : 42

ఒపెన్‌ చేసిన కేంద్రాలు : 35

కొనుగోలు చేసిన మొత్తం ధాన్యం : 6013.360 మెట్రిక్‌ టన్నులు 

(గ్రేడ్‌-ఎ : 5933.400 మెట్రిక్‌ టన్నులు, సాధారణ రకం : 79.960 మెట్రిక్‌ టన్నులు)

సేకరించిన ధాన్యం విలువ : రూ.11786185.60

ధాన్యం అమ్మిన రైతులు : 1,462

=========================

మద్దతు ధర (క్వింటాకు)

రకం 2021-22

గ్రేడ్‌-ఎ రకం రూ. 1,960

సాధారణ రకం రూ. 1,940

===========================

యాసంగి సాగు వివరాలు (ఎకరాల్లో)

సంవత్సరం సాధారణ సాగు సాగైంది

2020-21 46,555 35,550

2021-22 41,016 47,232

============================

గత ఏడాది యాసంగిలో సేకవరించిన వరి ధాన్యం వివరాలు (మెట్రిక్‌ టన్నుల్లో)

సీజన్‌ సంవత్సరం ధాన్యం సేకరణ సేకరించిన 

అంచనా వరి ధాన్యం

యాసంగి 2020-21 2,20,831 74,278.240

యాసంగి 2021-22 1,18,078 --



Updated Date - 2022-05-26T05:20:34+05:30 IST