క్లాప్‌.. అట్టర్‌ ప్లాప్‌

ABN , First Publish Date - 2022-05-26T07:17:34+05:30 IST

కడప కార్పొరేషన్‌ పరిధిలో 50 డివిజన్లు ఉండగా 3,82,831 మంది నివాసం ఉంటున్నారు. ప్రభుత్వం క్లాప్‌ కార్యక్రమం ద్వారా లక్షల విలువ చేసే మూడు రకాల చెత్తబుట్టలు అందించింది. వీటిని ప్రజలకు అందించి ఏ రంగుబుట్టలో ఏయే చెత్త వేయాలో

క్లాప్‌.. అట్టర్‌ ప్లాప్‌
పాత బస్టాండ్‌లో పేరుకుపోయిన చెత్త

ఇంటింటా చెత్త సేకరణ ఏదీ

చెత్త వాహనాల ఇష్టారాజ్యం 

పట్టించుకోని పాలకులు, అధికారులు

 

నగరంలో తడి.. పొడి చెత్త సేకరణకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్లాప్‌ (క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌) పథకం అట్టర్‌ప్లాప్‌ అయిందని చెప్పాలి. రోడ్ల పక్కన ఎక్కడ కూడా చెత్త కనబడకుండా ఉండాలన్నదే క్లాప్‌ ముఖ్య ఉద్దేశ్యం. అయితే ఆ స్థాయిలో నగరంలో శుభ్రత కనిపించడం లేదని నగరవాసులు వాపోతున్నారు. మధ్యాహ్నానికే చెత్తకుప్పలు రోడ్ల మీద దర్శనమిస్తున్నాయంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్లాప్‌ పేరుతో అందించిన మూడు రంగుల చెత్త బుట్టలు గదులకే పరిమితం అయ్యాయి. అవి కూడా కొన్ని డివిజన్లకు మాత్రమే సరఫరా చేశారు. 


కడప(ఎర్రముక్కపల్లి), మే 25 : కడప కార్పొరేషన్‌ పరిధిలో 50 డివిజన్లు ఉండగా 3,82,831 మంది నివాసం ఉంటున్నారు. ప్రభుత్వం క్లాప్‌ కార్యక్రమం ద్వారా లక్షల విలువ చేసే మూడు రకాల చెత్తబుట్టలు అందించింది. వీటిని ప్రజలకు అందించి ఏ రంగుబుట్టలో ఏయే చెత్త వేయాలో అవగాహన కల్పించారు. అయితే ఈ కార్యక్రమాన్ని మొక్కుబడిగా ప్రారంభించి, నామమాత్రంగా అవగాహన కల్పించినట్లు విమర్శలు ఉన్నాయి. చెత్తబుట్టలను ఇంతవరకు పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేదు. పేదల కాలనీలు మినహా అన్నింటిలో చెత్త పన్నులు కూడా వసూలు చేస్తున్నారు. అయితే పేదల కాలనీల్లో వాహనాలు చెత్తను సేకరించడం లేదని అంటున్నారు. నగరంలో ఇళ్ల నుంచి తడి, పొడి చెత్త సేకరణకు కడప నగరపాలక సంస్థకు 90 వాహనాలు మంజూరయ్యాయి. నెలకు ఒక్కో వాహనానికి కాంట్రాక్టర్‌కు రూ.64 వేలు చెల్లించేలా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.


మధ్యాహ్నానికే పేరుకుపోతున్న చెత్త

నగరంలో చాలా ప్రాంతాల్లో మధ్యాహ్నానికే చెత్తకుప్పలతో పరిసరాలు అపరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. ఉదయం ఇళ్లు, వాణిజ్య సముదాయాల నుంచి చెత్త సేకరణ జరిగితే మధ్యాహ్నం అయ్యేసరికి చెత్త ఎలా ఉత్పత్తి అవుతుందన్న ప్రశ్న తలెత్తుతోంది. నగరంలోని ముఖ్యమైన కూడళ్లు, రహదారులు మినహా పాత మార్కెట్‌, రైతు బజార్‌తో పాటు విలీన పంచాయతీల్లో చెత్తకుప్పలు పేరుకుపోతున్నాయి. విపరీతమైన దుర్వాసన వెదజల్లుతూ పాదచారులతో పాటు, వాహన చోదకులు ఇబ్బందులకు గురవుతున్నారు.


పాలకుల తీర్మానం బేఖాతరు

క్లాప్‌ కార్యక్రమానికి సంబంధించి ప్రతి ఇంటినుంచి సిటీ ప్రాంతంలో రూ.90, స్లమ్‌ ఏరియాలో రూ.40 చెత్త సేకరణ కోసం వసూలు చేయాలని కార్పొరేషన్‌ సర్వసభ్య సమావేశంలో సాక్షాత్తు ఉప ముఖ్యమంంత్రి అంజాద్‌బాషా సమక్షంలో మేయర్‌ సురేశ్‌బాబు అధ్యక్షతన తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని సైతం కొందరు సచివాలయ కార్యదర్శులు పట్టించుకోవడం లేదు. వారి ఇష్టానుసారంగా చెత్తపన్ను వసూలు చేస్తున్నారు. సిటీ ప్రాంతంలో రూ.90కి బదులు రూ.100 వసూలు చేస్తున్నారు. దానికి రశీదు కూడా ఇవ్వడం గమనార్హం.


ఇవీ లోపాలు

కడప కార్పొరేషన్‌లో శాశ్వత ప్రాతిపదికకన 169 మంది, అవుట్‌ సోర్సింగ్‌లో 663 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో చాలామంది విఽధులకు రారని తెలుస్తోంది. వీరి పేరుమీద వేరేవారు వస్తున్నారని వారు కూడా సక్రమంగా పనిచేయడం లేదని అంటున్నారు. రోజూ 20 శాతం మంది అనధికారికంగా గైర్హాజరవుతున్నారని... ఉదయాన్నే హాజరు వేసుకొని వెళ్లిపోతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో శానిటరీ ఇన్‌స్పెక్టర్ల చేతివాటం ఉందంటున్నారు. మధ్యాహ్నం తిరిగి విధులకు హాజరు కావాల్సి ఉన్నా, 30 శాతం మంది మాత్రమే హజరవుతున్నారు. దీనిపై అధికారులు దృష్టి సారిస్తే కొంత సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది. 


చెత్తపన్ను చెల్లించం

కడప నగరంలో చెత్త పన్ను చెల్లించమంటూ పలు డివిజన్లలో స్థానిక మహిళలు చెబుతున్నారు. మూడు రోజులకు ఒక రోజు చెత్త బండి వస్తుంటే ఎలా చెల్లించాలంటూ ప్రశ్నిస్తున్నారు.


చర్యలు తీసుకుంటాం

- రమణారెడ్డి, కమిషనర్‌, కడప మున్సిపల్‌ కార్పొరేషన్‌

కడప కార్పొరేషన్‌కు 90 వాహనాలు అవసరం ఉంది. అయితే 56 మాత్రమే వచ్చాయి. దీంతోరోజూ డోర్‌ టూ డోర్‌ తిరిగి చెత్త సేకరించడం కొంత ఇబ్బందికరంగా ఉంది. ఇంటి నుంచి చెత్త పన్ను రూ.100 వసూలు చేయకూడదు. ఎక్కడైనా అవకతవకలు జరిగినట్టు తెలిస్తే చర్యలు తీసుకుంటాం.


‘క్లీన్‌ ఆంధ్ర’ ఇలాగేనా..?

టెండర్లయినా ప్రారంభంకాని జీటీఎస్‌ పనులు

అనువైన స్థలాల ఎంపికలో అధికారుల వైఫల్యం

డంపింగ్‌ యార్డులో పేరుకుపోతున్న చెత్తనిల్వలు

ప్రొద్దుటూరు (అర్బన్‌), మే 25: రాష్ట్ర ప్రభుత్వం క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌)లో భాగంగా మున్సిపాలిటీల్లో పోగయ్యే చెత్తను ఎక్కడికక్కడ నిర్మూలించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా పట్టణాల్లో గార్బెజ్‌ ట్రాన్స్‌మిషన్‌ స్టేషన్లు (జీటీఎస్‌) ఏర్పాటు చేసింది. ఇక్కడే తడి పొడి ప్రమాదకర చెత్తను వేరుచేసి వాటిని ఎప్పటికప్పుడు విక్రయాలు జరిపి సంపద కేంద్రాలుగా మార్చాలని తలచింది. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో నాలుగు ప్రాంతాల్లో జీటీఎస్‌ల నిర్మాణం చేయదలచింది. ఇందుకోసం స్థలాలను గుర్తించింది. ఇళ్లనుంచి సేకరించిన చెత్తను జీటీఎస్‌ కేంద్రాలకు తరలించేందుకు ప్రతి వార్డుకు ఒక క్లీన్‌ ఆంధ్ర చెత్త వాహనాన్ని అందించింది. అందులో భాగంగా మూడు బుట్టలను కూడా ప్రజలకు ఉచితంగా అందించారు. ప్రజల్లో కొంత అవగాహన పెరిగి తడిపొడి చెత్తను వేరుచేసి మున్సిపల్‌ వాహనాలకు ఇస్తున్నా వాటిని వేరు చేసే ప్రక్రియ ఇంకా ప్రారంభం కాకపోవడంతో చెత్తనంతా డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. డంపింగ్‌ యార్డు నిండిపోయి కార్మికులు చెత్తను తరలించాలంటేదినదిన గండంగా మారింది. యార్డులో అంతర్గత రోడ్లు సైతం నిండిపోయి లోనికి వెళ్లలేని స్థితి ఏర్పడింది.


టెండర్లయినా ప్రారంభంకాని జీటీఎస్‌ పనులు

చెత్తను వార్డు స్థాయిలో నిర్మూలించే లక్ష్యంతో ఏర్పాటు చేయదలిచిన జీటీఎస్‌ నిర్మాణ పనులు ప్రారంభానికి నోచుకోలేదు. 15వ ఆర్థిక సంఘం నిధులతో ఒక్కొక్క జీటీఎస్‌ కేంద్రాన్ని రూ.80.90 లక్షలతో నిర్మించాలని 2021 ఏప్రిల్లో జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో తీర్మానించారు. వీటిని బొల్లవరం మడూర కాలువ పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో, మోడంపల్లె బరియల్‌ గ్రౌండ్‌, క్రిమిటోరియం దగ్గర, థర్డ్‌కాలనీ పార్కు దగ్గర మున్సిపాలిటీ స్థలాల్లో వీటిని నిర్మించదలిచారు. వీటికి గత ఏడాది జూన్‌ 22న టెండర్లు పిలిచారు. రూ.73.75 లక్షల అంచనాతో టెండరు ఖరారుచేసి కాంట్రాక్టరుకు 27 డిసెంబరు 2021 న వర్కు ఆర్డర్‌ ఇచ్చి అగ్రిమెంటు చేసుకున్నారు. వీటిని 6 నెలల్లో పూర్తి చేయాలని గడువు విధించారు. అధికారులు అనువైన స్థలాలు ఎంపిక చేయకపోవడంతో వీటి పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదని తెలుస్తోంది. బొల్లవరం మడూరుకాలువ పక్కన ఉన్న ఖాళీ స్థలం ఒక్కటి జీటీఎస్‌ కేంద్రానికి అనువైనదైనా స్థానికులు అభ్యంతర పెడుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.


అనువైనస్థలాలు లేక జీటీఎస్‌ పనులు నిలిచిపోయాయి

- రమణయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రొద్దుటూరు 

గతంలో జీటీఎస్‌ కేంద్రాల కోసమని ఎంపిక చేసిన స్థలాలు అనువైనవి కావు. అంతేకాక వేరే ప్రదేశాల్లో ఏర్పాటు చేయడానికి మున్సిపాలిటీ పరిధిలో స్థలాల కొరత ఉంది. బొల్లవరం మడూరు కాలువ వద్ద మాత్రం అనువైన స్ధలం ఉన్నా అక్కడ ప్రజలు జీటీఎస్‌ కేంద్రం వద్దని అఽభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో టెండర్లయినా పనులు ప్రారంభం కాని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత పరిస్థితిపై ఉన్నతాధికారులకు నివేదించాం.

Updated Date - 2022-05-26T07:17:34+05:30 IST