ముంబైలో బీజేపీయేతర సీఎంల సదస్సు!

ABN , First Publish Date - 2022-04-18T08:51:18+05:30 IST

బీజేపీయేతర పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు త్వరలో ముంబైలో జరుగుతుందని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ తెలిపారు.

ముంబైలో బీజేపీయేతర సీఎంల సదస్సు!

రాజకీయ పరిస్థితిపై చర్చిస్తాం: సంజయ్‌ రౌత్‌

ముంబై, ఏప్రిల్‌ 17: బీజేపీయేతర పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు త్వరలో ముంబైలో జరుగుతుందని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ తెలిపారు. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితిపై చర్చించాల్సిన అవసరం ఉందంటూ బెంగాల్‌ సీఎం, టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ బీజేపీ అధికారంలోని లేని రాష్ట్రాల సీఎంలకు ఇటీవల లేఖ రాశారని ఆదివారమిక్కడ చెప్పారు. దీనిపై ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే చర్చించారని.. సీఎంల భేటీ ముంబైలో జరిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, మతకల్లోలాల సృష్టికి ప్రయత్నాలు తదితర అంశాలపై ఆ సమావేశంలో చర్చ జరుగుతుందని చెప్పారు. ఆహారం.

వస్త్రధారణ, విశ్వాసం, పండుగలు, భాషవంటివాటిని సమాజాన్ని విభజించేందుకు మోదీ ప్రభుత్వం ఉపయోగించుకుంటోందని విమర్శిస్తూ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పవార్‌, మమత, తమిళనాడు, జార్ఖండ్‌ సీఎంలు ఎంకే స్టాలిన్‌, హేమంత్‌ సోరెన్‌ తదితర ప్రతిపక్ష నేతలు ఇటీవల ఓ సంయుక్త ప్రకటన విడుదలచేసిన సంగతి తెలిసిందే. కాగా.. శ్రీరామనవమి, హనుమాన్‌ జయంతి ఊరేగింపులపై ఇటీవల జరిగిన దాడులు రాజకీయ ప్రేరితమైనవని రౌత్‌ ఆరోపించారు. కొద్ది నెలల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ప్రజలను విభజించేందుకు ఇవి జరిగాయన్నారు. మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) అధ్యక్షుడు రాజ్‌ ఠాక్రేను ‘కొత్త హిందూ ఒవైసీ’గా అభివర్ణించడాన్ని రౌత్‌ సమర్థించుకున్నారు. యూపీ ఎన్నికల్లో ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీని బీజేపీ వాడుకుందని.. ఇప్పుడు మహారాష్ట్రలో ‘హిందూ ఒవైసీ’ రాజ్‌ను ఉపయోగించుకుంటోందని ఆరోపించారు.

Updated Date - 2022-04-18T08:51:18+05:30 IST