అహింసా సమరదీప్తి ‘హింద్‌ స్వరాజ్‌’

ABN , First Publish Date - 2022-01-05T07:45:19+05:30 IST

ప్రత్యక్ష యుద్ధం సృష్టించే హింసా, దౌర్జన్య, రక్తపాత ప్రతీకార కార్యాచరణను గాంధీజీ ఎన్నడూ ఆమోదించలేదు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా దేశభక్తి ప్రపూరితులైన యువ విప్లవకారులు...

అహింసా సమరదీప్తి ‘హింద్‌ స్వరాజ్‌’

ప్రత్యక్ష యుద్ధం సృష్టించే హింసా, దౌర్జన్య, రక్తపాత ప్రతీకార కార్యాచరణను గాంధీజీ ఎన్నడూ ఆమోదించలేదు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా దేశభక్తి ప్రపూరితులైన యువ విప్లవకారులు ‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’ నినాదంతో ఉరికంబాలు ఎక్కడాన్ని గాంధీ ఎన్నడూ సమర్థించలేదు. దాదాపు మూడు దశాబ్దాల స్వాతంత్య్ర సమర చరిత్రలో అహింసను ప్రగాఢంగా విశ్వసించిన గాంధీజీ బ్రిటిష్‌ పౌరులను, అధికార యంత్రాంగాన్ని, బ్రిటిష్‌ పోలీస్‌ వ్యవస్థను ఎన్నడూ ద్వేషించలేదు. గాంధీజీ తన జీవిత కాలంలో, అహింసా ప్రవక్తగా ఎన్నో నిందలు, ఎంతో అప్రతిష్ఠ, అపకీర్తి, అప్రియ, అభాండాలు మూటకట్టుకోవలసి వచ్చింది. అయినా ఆయన చలించలేదు.


1909 అక్టోబర్‌ 24న లండన్‌లో దసరా వేడుకల సందర్భంలో మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధీ హిందూ రాష్ట్ర నిర్మాణ ఉద్యమసారథి వినాయక దామోదర్‌ వీర సావార్కర్‌ను కలుసుకున్నారు. ఆయన పోరాటపంథాపై గాంధీ విభేదించటం, స్వాతంత్ర సమర చరిత్రలో కీలకమైన విషయం. 1909 నవంబరు 13 నుంచి 22 వరకు గాంధీజీ దక్షిణాఫ్రికా నేటాల్‌ తిరిగి వెళ్లే ‘కిల్డోనన్‌ కేజిల్‌’ ఓడ ప్రయాణం పది రోజులలో, ఆయన రాజకీయ నైతిక సిద్ధాంత రచన ‘హింద్‌ స్వరాజ్‌’ ఉద్భవించింది. హిందూ మత పవిత్ర గ్రంథం భగవద్గీత, సమున్నత ఆధ్యాత్మిక విలువలతో వెలసిన ఆ సిద్ధాంత రచన, తొలుత గుజరాతీలో వెలువడింది. 1910లో ‘ఇండియన్‌ ఓపీనియన్‌’ పత్రికలో దక్షిణాఫ్రికా నుంచి ప్రచురించబడి, ఆంగ్లంలో చిన్న పుస్తకంగా వచ్చింది. బ్రిటిష్‌ ప్రభుత్వం 1910 మార్చి 24న ఆ చిరుపొత్తాన్ని నిషేధించింది. లండన్‌లో మాతృదేశ దాస్య విముక్తి లక్ష్యంతో హింస, అరాచకత్వానికి పాల్పడుతున్న సాయుధ విప్లవకారులకు సమాధానంగా హింద్‌ స్వరాజ్‌ గాంధీజీ రాజకీయ, ఆర్థిక, నైతిక ఆలోచనలను ప్రవేశపెట్టింది.


భారత స్వాతంత్ర పోరాటంలో స్వదేశంలో గాంధీజీ ‘హింద్‌ స్వరాజ్‌’లో పేర్కొన్న లక్ష్యాల కార్యాచరణతో దాదాపు మూడు దశాబ్దాలు స్వరాజ్య సమరాన్ని నడిపించారు. ఒక దశలో 1922 ఫిబ్రవరి 5న ఉత్తరప్రదేశ్‌ గోరఖ్‌పూర్‌ సమీపంలోని చౌరీచౌరాలో బ్రిటిష్‌ ప్రభుత్వ నిరంకుశ అణచివేతలను సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా ఎదుర్కొంటున్న ఉద్యమకారుల సమూహంపై బ్రిటిష్‌ పోలీసులు ఘాతుక చర్యగా కాల్పులు జరపడంతో ఆగ్రహోద్యమకారులు చౌరీచౌరా పోలీస్‌స్టేషన్‌పై చేసిన దాడి, దహనకాండగా పరిణమించి ప్రతీకారాగ్నికి దహనమైంది. ఈ సంఘటనలో 22 మంది పోలీసులు ఆహుతికావటం గాంధీజీని నాడు విచలితుడిని చేసింది. గాంధీజీ నాయకత్వంలో సహాయ నిరాకరణోద్యమం ఉవ్వెత్తున సాగుతున్న రోజులవి. యావద్భారతావనిలో సమరయోధులు గాంధీజీ ఆదేశానుసారం ప్రతిఘటన, శాంతియుత పోరాట ఉద్యమాలతో బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని వణికిస్తున్న సమయం అది. చౌరీచౌరా హింసాత్మక ప్రజ్వలనానికి చలించిన గాంధీజీ, అహింసా ఉద్యమ సారధ్యనేతగా, అకస్మాత్తుగా స్పందించి బ్రిటిష్‌ ప్రభుత్వంపై కొనసాగుతున్న సహాయ నిరాకరణోద్యమం తక్షణం నిలుపుదల చేయవలసిందిగా యావద్భారతానికి పిలుపు ఇచ్చారు.


గాంధేయ అహింసా పోరాట ఆశయదీప్తిని యావత్ప్రపంచంలో హింద్‌ స్వరాజ్‌ వెలుగు రేఖలుగా ప్రసరింపజేసింది. కాని అణ్వాయుధ ప్రజ్వలనంతో 21వ శతాబ్దంలో ప్రస్తుతం భారత స్వాతంత్య్ర అమృతోత్సవ సంరంభంలో జాతిపిత గాంధీజీ కలలుగన్న సత్యం, అహింస వంటి సైద్ధాంతిక విలువలు మసకబారుతున్నాయో లేదో కాలమే నిర్ణయిస్తుంది. హింద్‌ స్వరాజ్‌ మహాత్ముని ఆశయదీప్తిని ఆచరణాత్మకంగా అహింసా వెలుగును ప్రసరింపజేసిన మహోన్నత సిద్ధాంత చరిత్రగా గుర్తింపు పొందింది.

జయసూర్య‌ (జర్నలిస్ట్‌)

Updated Date - 2022-01-05T07:45:19+05:30 IST