Abn logo
Jun 3 2020 @ 02:54AM

అహింస... శౌచము

అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం.. వీటిని అష్టాంగయోగంలో మొదటి అంగంగా పరిగణిస్తారు. ఈ ఐదింటినీ యమములంటారు. ఏ ప్రాణినైనా మనోవాక్కాయ కర్మల ద్వారా ఏ విధంగానూ హింసించకుండా ఉండడం అహింస. అదే విధంగా మనోవాక్కాయ కర్మలందు ఒకే తీరుగా ఉండడం సత్యం. దీనినే త్రికరణ శుద్ధి అంటారు. దొంగతనం చేయకుండా ఉండడం అస్తేయం. బ్రహ్మము గురించి చింతనచేయడం బ్రహ్మచర్యం. జీవికకు అవసరమైనవి తప్ప ఇతరత్రా ఏవీ లేకుండా ఉండడం, స్వీకరించకుండా ఉండడం అపరిగ్రహం. పతంజలి మహర్షి ఈ విధులన్నింటినీ మహావ్రతాలన్నాడు.  వ్రతం అంటే అర్చన కాదు. ఆచరణ. ఆచరించవలసినవి వ్రతాలు. మన సనాతన ధర్మంలో అహింస, సత్యం ముఖ్యమైనవి. ‘అహింసాపరమో ధర్మః’ అహింసయే పరమ ధర్మము.


ఇక అష్టాంగ యోగంలో రెండో అంగము.. శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వరప్రణిధానం. ఇవి నియమాలు. శౌచం రెండు విధాలు. బాహ్యశౌచం అంటే శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం. అంతశ్శౌచం అంటే అంతరంగం నిర్మలంగా ఉండడం. యోగానికి రెండూ అవసరమే. ఉన్నదానితో తృప్తిచెంది, దయాగుణం కలిగి ఉండడమే సంతోషం. శీతోష్ణాది ద్వంద్వాలను సహించడం, హితమైన ఆహారాన్ని మితంగా తీసుకోవడం మొదలైనవి తపస్సు. జపం, శాస్త్ర పఠనం స్వాధ్యాయం. ఫలాపేక్ష లేకుండా కర్మలు చేస్తూ పరమాత్మునికే అర్పించడం ఈశ్వరప్రణిధానం. రెండవ అంగములో మొదటి నియమమైన శౌచం ఇవాళ ప్రపంచ మానవాళి అంతా తప్పకుండా ఆచరించవలసిన అవసరం కలిగింది. అందుకే మనమంతా వ్యక్తిగత శుభ్రతను పాటిస్తున్నాం. మొదటి అంగములో మొదటిదైన అహింసను ఆచరించాలన్న అవగాహన కూడా పెరిగింది. ‘అహింస అంటే ప్రాణులను చంపకుండా ఉండటం మాత్రమే కాదు. జీవులకు ఏ విధమైన కష్టాన్నీ కలిగించకపోవడమే అహింస’ అని శ్రీశంకర భగవత్పాదుల నిర్వచనం (అహింసా అపీడా ప్రాణినాం’). ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న విపత్తుకు కారణం.. వన్యప్రాణులపై చేస్తున్న హింస, మనిషి స్వార్థం, అత్యాశ తదితరాలే. ఈ  పరిస్థితులు మారాలంటే మనం మారాలి. మనుషుల్లో మానసిక పరివర్తన రావాలి. మార్పు వ్యక్తుల నుండి మొదలు కావాలి. 


అహింసా ప్రతిష్ఠాయాం తత్సన్నిధౌ వైరత్యాగః

అహింసా ధర్మంలో సుస్థిరంగా ఉండేవాని సాన్నిధ్యంలో పరస్పర విరోధ స్వభావం కలిగిన జంతువులు కూడా హింసను వదిలిపెడతాయి. అతని చెంత సింహం, ఏనుగు శాంతంగా వర్తిస్తాయి. పులి, మేకపిల్ల ఆటలాడుకొంటాయి. ఈ స్థితిలో స్థిరమైనవాడే యోగి. ఇదే అహింస యొక్క పరమావధి. కాబట్టి.. శౌచాన్ని (బాహ్యాభ్యంతర) పాటిస్తూ సాధ్యమైనంత వరకు అహింసను ఆచరించగలిగితే చాలా కష్టాలు రాకుండా నివారించగలుగుతాం.

- జక్కని వేంకటరాజం, 9440021734

Advertisement
Advertisement
Advertisement