సందిగ్ధం!

ABN , First Publish Date - 2020-10-29T06:25:13+05:30 IST

2017లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనలో జరిగిన తప్పిదాలకు, ఇప్పుడు కొందరు భూ యజమానులు ఆవేదన చెందుతున్నారు

సందిగ్ధం!

ఆన్‌లైన్‌ కాని భూములపై తర్జన భర్జన

రెవెన్యూ తప్పిదాలతో భూ యజమానుల క్షోభ

భూ రికార్డుల ప్రక్షాళనతోనే సమస్య మొదలైందని ఆందోళన

స్పెషల్‌ డ్రైవ్‌, పొజిషన్‌ సర్వే చేపట్టాలని విన్నపం

నేటి నుంచి ధరణి పోర్టల్‌ ప్రారంభం

తహసీల్‌ కార్యాలయాలను సిద్ధం చేసిన యంత్రాంగం


ధరణి పోర్టల్‌ ద్వారా గురువారం నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూముల క్రయవిక్రయాలు మొదలు కానున్నాయి.. ఇందు కోసం రెవెన్యూ కార్యాలయాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.. అయితే, ఆన్‌లైన్‌లో నమోదు కాని, పార్ట్‌-బీలో ఉండి పరిష్కారం కాని భూముల యజమానుల్లో ఆందోళన నెలకొన్నది.. భూములున్నా, ఆన్‌లైన్‌ కాని వారి భూముల వివరాలు ధరణిలో లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదాలకు తాము బలైతే, ఇప్పుడు ప్రభుత్వం ఆ సమస్యను తప్పించుకోవాలని చూడడం సరైంది కాదని అంటున్నారు.. ఈ సమస్యల పరిష్కారానికి స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని, పొజిషన్‌ సర్వే నిర్వహించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు..


మహబూబ్‌నగర్‌, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : 2017లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనలో జరిగిన తప్పిదాలకు, ఇప్పుడు కొందరు భూ యజమానులు ఆవేదన చెందుతున్నారు. వారసత్వ భూముల భాగ పంపిణీలను సక్రమంగా నమోదు చేయకపోవడం, క్రయవిక్రయాల సమయాల్లో పూర్వపు రికార్డులను పరిశీలించకుండా మ్యుటేషన్లు చేయడంతో, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ సమస్యలు తెరమీదకు వచ్చాయి. ఈ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులతో ఆ భూములన్నింటినీ పార్ట్‌-బీలో పెట్టి, ఎలాంటి పరిష్కారం లేకుండా వదిలేశారు. దీంతో ఈ కేటగిరీలో ఉన్న రైతులు భూ యాజమాన్య హక్కులు పొందలేక, రైతుబంధు సాయం దక్కక ఇబ్బంది పడుతున్నారు. ఈ రికార్డులు ఆన్‌లైన్‌ కోసం సంబంధిత భూ యజమానులు వీఆర్వోలు మొదలుకొని తహసీల్దార్లు, ఆర్డీవోలు, కలెక్టర్ల చుట్టూ తరిగి పిటిషన్లు సమర్పించినా, వాటిని పరిష్కరించకపోవడం ఇప్పుడు పెద్దసమస్యగా మారింది. మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడ్‌, నవాబుపేట, నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు తదితర మండలాల్లో పరిస్థితిని పరిశీలిస్తే, ఈ తప్పిదాలతో భూ యజమానులనుభవిస్తున్న క్షోభ అర్థమవుతుంది.


భూమి ఉన్నా పట్టాలు పొందలేని దుస్థితి

నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం రంగాపురం రెవెన్యూ గ్రామంలో ఒక కుటుండానికి చెందిన భాగ పంపిణీ సక్రమంగా అమలు కాలేదు. సకాలంలో విరాసత్‌ చేయకపోవడంతో ఇప్పుడు ఆ కుటుంబానికి చెందిన ఒక భాగస్వామి వారసులు భూమి ఉన్నా పట్టాలు, రైతుబంధు పొందలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ రెవెన్యూ గ్రామ పరిధిలోని కొనాపురానికి చెందిన ఎం.జగన్నాథాచార్యులకు సర్వే నంబర్లు 135,138, 140, ఉల్పర శివారులోని సర్వే నంబర్‌ 75లో మొత్తం 146.18 ఎకరాల భూమి ఉంది. ఈయనకు నలుగురు సంతానం కాగా, నలుగురూ గ్రామ పెద్దల సమక్షంలో భూమిని విభజించుకొని హద్దులు నిర్ణయించుకొని వ్యవసాయం చేసుకున్నారు.


ఈ భాగ పంపిణీ ప్రకారం ఒక్కో వారసుడికి 33.29 ఎకరాల మెట్ట, 2.36 ఎకరాల తరి భూమి వచ్చింది. తర్వాత ఖాస్రా, సేత్వార్‌ ఆ తర్వాత వచ్చిన రెండు ఆర్వోఆర్‌లలో కూడా ఈ వివరాలు నమోదయ్యాయి. ఈ నలుగురు వారసులలో ఒకరైన రామచంద్రాచారికి 33.29 ఎకరాల మెట్టతో పాటు, 2.36 ఎకరాల తరి భూమి వచ్చింది. మిగిలిని ముగ్గురు సోదరులు, వారి వారసులు వారి వాటా భూములను కాలక్రమంలో అమ్ముకుంటూ వచ్చారు. రామచంద్రాచారి సైతం తన వాటాలో 16 ఎకరాల భూమిని విక్రయించారు. 2001లో రామచంద్రాచార్యులు చనిపోయిన తర్వాత ఆయన వాటాలో విక్రయించగా మిగిలిన 17.29 ఎకరాల మెట్టభూమితో పాటు, 2.36 ఎకరాల తరి భూమిని తమకు విరాసత్‌ చేయాలని ఆయన వారసులు నలుగురు అప్పటి నుంచి ఇప్పటి వరకు వందలసార్లు వంగూరు రెవెన్యూ కార్యాలయానికి, ఆర్డీవో, కలెక్టర్‌ కార్యాలయాలకు విన్నవిస్తూ వచ్చారు. వీరి వినతులను పట్టించుకోని అధికారులు, ఆ భూ సమస్యను అలాగే వదిలేశారు.


తాజాగా 2017లో జరిగిన రెవన్యూ భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో కూడా ఈ వారసులు విరాసత్‌ కోసం దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోలేదు. పైగా ఆన్‌లైన్‌లో రంగాచార్యుల వాటాకు చెందిన భూమి వివరాలు నమోదు చేయలేదు. ఇటీవల కాలంలో కూడా ఈ వారసులు నలుగురూ తమ కుటుంబానికి చెందిన భూముల వివరాలు పేర్కొంటూ, తమకు న్యాయంగా భాగ పంపిణీలో దక్కాల్సిన భూమిని తమకు విరాసత్‌ చేసి పట్టాలు ఇప్పించాలని లేఖలు రాశారు. సీఎం కేసీఆర్‌, సీసీఎల్‌ఏ, కలెక్టర్‌, ఆర్డీవో, తహసీల్దార్లకు ఈ లేఖలు పంపారు. వీరితో పాటు సర్పంచ్‌ సహా గ్రామపెద్దలు, ఈ భూముల్లో అనుభవంలో ఉన్న రైతులు సైతం ఈ సమస్యను పరిష్కరించమని, సర్వే జరిపి, న్యాయంగా ఆ కుటుంబానికి దక్కాల్సిన భూమిని ఇవ్వమని వినతి పత్రాలు అందజేయడం మరో విశేషం. అయితే, రెవెన్యూ యంత్రాంగం మాత్రం ధరణి వచ్చాక పరిశీలిస్తామనే ముక్తసరి సమాధానంతో సరిపెట్టడం బాధితులను ఆవేదనకు లోను చేస్తోంది. ఇకనైనా ఆన్‌లైన్‌ నమోదు కాకుండా ఉన్న ఇలాంటి భూముల సమస్యలను వేగంగా పరిష్కరించి బాధితులకు ఉపశమనం కలిగించాలనే డిమాండ్‌ రైతుల నుంచి వస్తోంది.


భూముల రిజిస్ట్రేషన్లకు సర్వం సిద్ధం(గద్వాల-ఆంధ్రజ్యోతి)

జోగుళాంబ గద్వాల జిల్లాలోని 12 మండలాల రెవెన్యూ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల క్రయ విక్రయాలు ధరణి పోర్టల్‌ ద్వారా గురువారం నుంచి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు తహసీల్దార్లకు, టెక్నికల్‌ సిబ్బందికికి రెండు రోజుల కిందట రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ శిక్షణ ఇచ్చారు. ప్రతి తహసీల్దార్‌, డిప్యూటీ తహసీల్దార్‌  20 చొప్పున డమ్మి రిజిస్ట్రేషన్లు చేశారు. ఇదే తీరులో కంప్యూటర్‌ సిబ్బందికి కూడా శిక్షణ ఇచ్చారు. అయితే, పార్ట్‌-బీలో జిల్లాలో 2,250 మేర భూముల ఖాతాలు ఉండగా, ఇందులో దాదాపు 35 వేల ఎకరాల భూములు ఉన్నాయి. ఈ భూములకు సంబధించి క్రమవిక్రయాలకు ఇంకా మార్గదర్శకాలు జారీ కాలేదు.


జిల్లాలో 5.16 లక్షల భూమి(వనపర్తి-ఆంధ్రజ్యోతి)

వనపర్తి జిల్లాలో 14 మండలాలు ఉండగా, 224 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వీటి పరిధిలో 1,76,512 ఖాతాలు ఉండగా, 5,16,964.16 ఎకరాల విస్తీర్ణంలో భూములు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ, పట్టా, ఎండోమెంట్‌కు సంబంధించిన అన్ని రకాల భూములు ఉన్నాయి. అయితే, డిజిటల్‌ సైన్‌ అయిన ఖాతాలు మాత్రమే ప్రస్తుతం ధరణి పోర్టల్‌ ద్వారా క్రయావిక్రయాలు చేసుకునే వెసులుబాటు ఉంది. జిల్లాలో 1,69,278 ఖాతాలు డిజిటల్‌ సైన్‌ అయ్యాయి. సదరు ఖాతాల్లో 3,69,700 ఎకరాల భూమి ఉంది. ఇక ప్రస్తుతం వ్యవసాయ రిజిస్ర్టేషన్లు ధరణి ద్వారా ప్రారంభవుతుండగా, వ్యవసాయ భూములు జిల్లాలో 1,52,221 ఖాతాలకుగాను 3,64,481 ఎకరాల భూమి ఉంది. వీటికి సంబంధించిన క్రయావిక్రయాలు పోర్టల్‌ ద్వారా మంగళవారం నుంచి చేసుకోవచ్చు. ఇంకా జిల్లాలో 5,366 ఖాతాలకు సంబంధించి డిజిటల్‌ సైన్‌ పూర్తి కావాల్సి ఉంది. పార్ట్‌-బిలో 2,299 ఖాతాలకు సంబంధించి 10,857 ఎకరాల ఉన్న వివాదాస్పద భూములను వదిలేసి, మిగతా ఖాతాలకు సంబంధించి యధావిధిగా సేవలు కొనసాగుతాయి.

Updated Date - 2020-10-29T06:25:13+05:30 IST