‘ఇంటర్‌’మథనం!

ABN , First Publish Date - 2020-07-12T11:32:30+05:30 IST

ఇంటర్మీడియట్‌ కళాశాలల్లో ప్రవేశాలపై ఇంతవరకు స్పష్టత రాలేదు. పదోతరగతి పరీక్షలు లేకుండా విద్యార్థులందరిన్నీ ప్రభుత్వం పాస్‌

‘ఇంటర్‌’మథనం!

ప్రారంభం కాని ఇంటర్మీడియట్‌ ప్రవేశాలు


(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ కళాశాలల్లో ప్రవేశాలపై ఇంతవరకు స్పష్టత రాలేదు. పదోతరగతి పరీక్షలు లేకుండా విద్యార్థులందరిన్నీ ప్రభుత్వం పాస్‌ చేయించింది. కానీ, గ్రేడింగ్‌పై స్పష్టత లేకపోవడంతో ఇంటర్‌ ప్రవేశాలపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఎయిడెడ్‌ కళాశాలలు ఇంటర్‌ బోర్డు ఆదేశాల మేరకు కళాశాలలు ప్రారంభించేందుకు వేచి చూస్తున్నాయి. కానీ, ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ కళాశాలలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇష్టానుసారం  వ్యవహరించుకుండా ప్రైవేటు కళాశాలలను నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. నిబంధనల ప్రకారం కళాశాలల్లో వసతులు లేవని, అలాగే అపరిమితంగా విద్యార్థులను చేర్చేసుకోవడం... తదితర వాటిపై ఎప్పటినుంచో తల్లితండ్రుల నుంచి కళాశాలల యాజమాన్యాలపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో అడ్మిషన్ల విషయంలో చాలా సంస్కరణలు చేపట్టింది. అందులో ముఖ్యమైంది ఆన్‌లైన్‌ అడ్మిషన్లు. ఆ తర్వాత ఫీజుల నియంత్రణ, విద్యార్థుల ప్రవేశాల సంఖ్యపై పరిమితి విధింపు. పూర్తిస్థాయి వసతులుంటేనే ప్రవేశాలకు అనుమతి... ఇలా ఇవన్నీ అమల్లోకి రానున్నాయి. 


ఆర్ట్స్‌ గ్రూపులకు రెండు సెక్షన్లే... సైన్స్‌ గ్రూపులకు ఏడు సెక్షన్లు.... .

అన్‌ఎయిడెడ్‌ కళాశాలలకు ప్రత్యేక నిబంధనలను, సూచనలను ఇంటర్మీడియట్‌ బోర్డు ఇటీవలే ప్రవేశ పెట్టింది. ఆర్ట్స్‌ గ్రూపులకు రెండు సెక్షన్ల వరకే అవకాశం కల్పించారు. ఒక్కో సెక్షన్‌కు 40 మంది విద్యార్థులు మాత్రమే ఉండాలి. ఆర్ట్స్‌ గ్రూపుల్లో ఖాళీలను.. సైన్స్‌ విద్యార్థులతో నింపేందుకు వీలు లేదు. అలాగే ఒక్కో కళాశాలకు సైన్స్‌ గ్రూపులకు ఏడు సెక్షన్లకు అనుమతి ఇస్తారు. . గతంలో ఒక్కో సెక్షన్‌కు 88 మందిని చేర్చుకునేందుకు అనుమతి ఉండేది.


తగిన రుసుం చెల్లించి ఎన్ని సెక్షన్లయినా కొనసాగించేవారు. ఇప్పుడు ప్రభుత్వ, ఎయిడెడ్‌ కళాశాలలకు పాత విధానమే అమల్లో ఉండగా.. అన్‌ ఎయిడెడ్‌ కళాశాలలకు మాత్రం కొత్త నిబంధనలు వచ్చి చేరాయి. ఇవి అమలు చేస్తేనే ఈ దఫా ఆన్‌లైన్‌ అడ్మిషన్లకు అనుమతి లభిస్తుంది. ఫైర్‌సేఫ్టీ నుంచి ఎన్‌ఓసీ, అలాగే వసతుల్లో భాగంగా ఏర్పాటు చేసిన గదులు, సిబ్బంది, పొల్యూషన్‌ బోర్డు నుంచి ధ్రువపత్రం, గదులు ప్లాన్‌.. ఆర్సీపీ బిల్డింగ్‌, సిబ్బంది ఇలా అన్ని వివరాలను జియోట్యాగ్‌చేస్తారు. వీటిని పరిశీలించిన తర్వాతే  ఆన్‌లైన్‌లో సంబంధిత కళాశాల పేరుమీద ‘అడ్మిషన్ల’కు అవకాశం కలుగుతుంది. జూన్‌ నెలాఖరు వరకు దరఖాస్తులు గడువు ఉండేది. కానీ స్పందన లేకపోవడంతో ఈ నెలాఖరు వరకు గడువు పెంచింది. అయినా ఇంతవరకూ జిల్లా నుంచి ఒక్కరూ దరఖాస్తు పంపలేదు. అంతా కొవిడ్‌మయం కావడం... ఇతరత్రా కార్యకలాపాలకు అవకాశం లేకపోవడం కూడా ఒక కారణమని తెలుస్తోంది.  


 ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించరాదు :  రుక్మంగథరరావు, ఆర్‌ఐఓ  

కళాశాలల్లో అడ్మిషన్లు పునఃప్రారంభ విషయమై ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడలేదు. అయితే ఈలోగా ఆన్‌లైన్‌ అడ్మిషన్లకు అవకాశం కలుగుతోందని చెబుతున్నారు. కానీ మా వరకు ఏ సమాచారంలేదు. ఎక్కడా ప్రైవేట్‌ కళాశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహించకూడదని ఇప్పటికే సర్క్యులర్‌ జారీచేశాం. జిల్లాలో  ప్రభుత్వ, అన్‌ ఎయిడెడ్‌ కళాశాలలు ... మొత్తం 197 ఉన్నాయి. అలాగే ప్రతి ఏడాది సుమారు 30 వేల మంది విద్యార్థులు చేరుతున్నారు. ఈ సారి పక్కా నిబంధనలతో పరిమితిని మించి విద్యార్థులను చేర్పించేందుకు అవకాశంలేదు. కొత్తగా మరో 18 కళాశాలలు మంజూరయ్యాయి. 

 

Updated Date - 2020-07-12T11:32:30+05:30 IST