బీజేపీని ఓడించేందుకు ఏకమవుదాం: పవార్

ABN , First Publish Date - 2021-10-14T01:18:02+05:30 IST

వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని..

బీజేపీని ఓడించేందుకు ఏకమవుదాం: పవార్

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) చీఫ్ శరద్ పవార్ బుధవారంనాడు పిలుపునిచ్చారు. ఓట్ల చీలకను సాధ్యమైనంత కనిష్ట స్థాయికి తీసుకు రావడం చాలా కీలకమని పేర్కొన్నారు. ఇందుకోసం బీజేపీయేతర పార్టీలన్నీ కలిసిరావాలని అన్నారు. 2002 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్  యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీతో తాము పొత్తు పెట్టుకుంటామని ఎన్‌సీపీ ఇప్పటికే ప్రకటించింది.


అజయ్ మిశ్రా రాజీనామా చేయాలి

లఖింపూర్ ఖేరి ఘటనపై పవార్ మాట్లాడుతూ, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని అన్నారు. ''లఖింపూర్‌లో రైతులపై కారు ఎక్కించి చంపారు. ఘటనా స్థలిలో మంత్రి కుమారుడు ఉన్నాడని రైతులు చెబుతున్నారు. సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసిన తర్వాతే అతన్ని అరెస్టు చేశారు. యోగిని తప్పించాలా, కేంద్రం మంత్రిని తప్పించాలో తేల్చుకోవాలి. కేంద్ర మంత్రి తక్షణం రాజీనామా చేయాలి'' అని పవార్ అన్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కుప్పకూల్చడంలో విఫలమైన బీజేపీ ఇప్పుడు తమ పార్టీ నాయకుల బంధువులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపిస్తోందని, సీబీఐ, ఈడీ, ఐటీ, ఎన్‌సీబీ వంటి దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందంటూ పవార్ విమర్శలు గుప్పించారు.

Updated Date - 2021-10-14T01:18:02+05:30 IST