పత్తి రైతులకు రాయితీలు కట్‌

ABN , First Publish Date - 2020-10-01T08:45:57+05:30 IST

రాష్ట్రంలో తెల్లబంగారం పండించే రైతులకు ప్రభుత్వం మొండిచేయి చూపింది. ప్రధానంగా గులాబీ రంగు పురుగును నివారించే లింగాకర్షణ బుట్టలు (ట్రాప్‌)పై రాయితీలను రద్దు చేసింది...

పత్తి రైతులకు రాయితీలు కట్‌

  • గులాబీ రంగు పురుగును చంపే 
  • ట్రాప్‌ల సబ్సిడీ రద్దు

గుంటూరు, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో తెల్లబంగారం పండించే రైతులకు ప్రభుత్వం మొండిచేయి చూపింది. ప్రధానంగా గులాబీ రంగు పురుగును నివారించే లింగాకర్షణ బుట్టలు (ట్రాప్‌)పై రాయితీలను రద్దు చేసింది. గతంలో గులాబీ రంగు పురుగు వచ్చిన సందర్భాల్లో లింగాకర్షణ బుట్టలను 90 శాతం సబ్సిడీపై రైతులకు పంపిణీ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా పత్తిలో గులాబీరంగు పురుగువచ్చే సమయాల్లో వీటిని పంపిణీ చేస్తుంటారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం లింగాకర్షణ బుట్టలపై ఉన్న సబ్సిడీని తొలగించింది. 


ఎకరానికి పది బుట్టలు

పత్తిలో గులాబీరంగు పురుగును నివారించటానికి ఎకరానికి పది లింగాకర్షణ బుట్టలను ఉపయోగిస్తుంటారు. పురుగును నివారించే డెల్టా ట్రాప్‌ రూ.45, ఫన్నల్‌ ట్రాప్‌ను రూ.30 చొప్పున అమ్ముతున్నారు. గతంలో వీటిపై 90 శాతం సబ్సిడీ ఉంది. 


సాగుకు ప్రోత్సాహమేదీ?

రాష్ట్రంలో రైతులు, వ్యవసాయ రంగానికి ఎంతో మేలు చేస్తున్నట్టు పదేపదే ప్రకటించే ప్రభుత్వం ఉన్న రాయితీలను తొలగించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీలో పత్తి పరిశ్రమ (స్పిన్నింగ్‌, జిన్నింగ్‌ మిల్లులు) ఎక్కువగా ఉండగా, పంట విస్తీర్ణం తెలంగాణలో ఎక్కువగా ఉంది. విభజన తరువాత తెలంగాణలో పత్తి సాగుతో పాటు ఆ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలను పెంచుతోంది. ఏపీ ప్రభుత్వం మాత్రం వస్త్ర పరిశ్రమను ప్రోత్సహించకపోగా పంట సాగు దశల వారీగా తగ్గిపోయేలా వ్యవహరిస్తోంది. గతేడాది రాష్ట్రంలో 6.5 లక్షల హెక్టార్లలో పత్తి సాగుచేయగా ఈ ఏడాది 5 లక్షల హెక్టార్లలో పత్తిని సాగుచేశారు. సాగు విస్తీర్ణం తగ్గుతున్నా ప్రభుత్వం దానిపై దృష్టి సారించలేదు. ఈ ఏడాది ఏకంగా తెల్లబంగారం పండించే రైతులకు రాయితీలను తొలగించింది. దీంతో తెల్లబంగారం రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Updated Date - 2020-10-01T08:45:57+05:30 IST