పంచుకుందాం రా..!

ABN , First Publish Date - 2022-05-18T14:39:29+05:30 IST

నామినేషన్ల ప్రాతిపదికన పనులు అప్పగించవద్దన్న ఉన్నతస్థాయి ఆదేశాలు జీహెచ్‌ఎంసీలో అమలు కావడం లేదు

పంచుకుందాం రా..!

ప్రభుత్వ విభాగాల్లో నామినేషన్‌ దందా

అధికారులు, కాంట్రాక్టర్ల కుమ్మక్కు   

అత్యవసర పనుల పేరిట అడ్డదారులు  

రూ.లక్షల ప్రజాధనం వృథా


సర్కారీ శాఖల్లో నామినేషన్‌పై పనులు అప్పగించే దందా జోరుగా సాగుతోంది. అత్యవసరం పేరిట అయిన వారికి ఆర్థిక ప్రయోజనం చేకూర్చేలా అధికార యంత్రాంగం వ్యవహరిస్తోంది. నిబంధనల్లోని లొసుగులును సాకుగా చూపి అనుకున్న వారికి పనులు అప్పగిస్తోంది. నామినేషన్‌ పేరిట బిడ్‌లు ఆహ్వానిస్తోన్న అధికారులు.. అనుకూలంగా ఉండే వారికి టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ సమాచారాన్ని ముందే చెబుతున్నారు. జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డు, ఎన్‌హెచ్‌ఏఐలోని ఆర్‌అండ్‌బీ తదితర విభాగాల్లో నామినేషన్లపై పనులు అప్పగించి ప్రజాధనాన్ని పంచుకుంటున్నారు. 


హైదరాబాద్‌ సిటీ: నామినేషన్ల ప్రాతిపదికన పనులు అప్పగించవద్దన్న ఉన్నతస్థాయి ఆదేశాలు జీహెచ్‌ఎంసీలో అమలు కావడం లేదు. అత్యవసర పనుల పేరిట రూ.లక్షలోపు పనులను నామినేషన్‌ పద్ధతిన కాంట్ర్టార్లకు అప్పగిస్తున్నారు. వరద నీటి డ్రెయిన్లపై మూతల ఏర్పాటు, మరమ్మతు, సంస్థ కార్యాలయ భవనాల్లోని మరమ్మతు పనులను నామినేషన్‌ ప్రాతిపదికన చేయిస్తున్నారు. సికింద్రాబాద్‌, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి జోన్ల పరిధిలో ఇలాంటి పనులు ఎక్కువగా జరుగుతున్నాయని ఆడిట్‌ విభాగం గతంలో గుర్తించింది. దీనికి సంబంధించి ఉన్నతాధికారులకూ ఫిర్యాదులు అందాయి. చార్మినార్‌ జోన్‌లోనూ మెజార్టీ పనులు నామినేషన్‌ ప్రాతిపదికన అప్పగించి, పూర్తి చేసినట్టు చూపుతుండడం గమనార్హం. ఇందులో కొన్ని పనులకు సంబంధించి పూర్తి వివరాలు కూడా లేకపోవడం గమనార్హం. 


విపత్తులు, ఇతరత్రా సందర్భాల్లో త్వరితగతిన పనులు చేపట్టేందుకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొందరు ఇంజనీరింగ్‌ అధికారులు దుర్వినియోగం చేస్తున్నారు. రూ.లక్షకు పైన రూ.5 లక్షల్లోపు అంచనా వ్యయంతో కూడిన అత్యవర పనులను ఒక రోజు టెండర్‌ ద్వారా అప్పగిస్తున్నారు. రూ.20 లక్షల పనులనూ నాలుగు భాగాలుగా విభజించి చేయిస్తున్నారు. నచ్చిన కాంట్రాక్టర్లకు నోటిఫికేషన్‌ జారీకి ముందే సమాచారం ఇస్తున్నారు. ఒక రోజు టెండర్‌కు సంబంధించి మెజార్టీ పనులకు ఒకటి, రెండు కంటే ఎక్కువ బిడ్‌లు దాఖలు కావడం లేదు. కాంట్రాక్టర్లకు మేలు చేసే క్రమంలో తమకూ లబ్ధి జరిగేలా కొందరు ఇంజనీర్లు వ్యవహరి స్తున్నా, ఉన్నతాధికారులు పట్టించుకోక పోవడం అనుమానాలకు తావిస్తోంది.


ఒకే పని రెండు భాగాలుగా..

వాటర్‌బోర్డు పరిధిలోని ఆపరేషన్‌ మెయింటనెన్స్‌ డివిజన్లలో జరిగే పనులన్నీ నామినేషన్‌ ప్రాతిపదికన చేపడుతున్నారు. ఎండీ దృష్టికి వచ్చిన పనులన్నీ టెండర్‌ ప్రక్రియ ద్వారా చేపడుతుండగా, కింది స్థాయిలో మాత్రం నామినేషన్‌పై పనులు అప్పగించేందుకు కొందరు అధికారులు ఆసక్తి చూపుతున్నారు. అయితే లక్ష వ్యయం దాటిన పనులకు టెండర్లు పిలవాల్సి వస్తుందని చాలా మంది అధికారులు నామినేషన్‌కు మొగ్గు చూపుతున్నారు. అత్యవసర పనుల పేరుతో నామినేషన్‌పై అందిస్తున్నారు. వ్యయం లక్ష దాటనీయకుండా కొంతమంది జీఎంలు, మరికొందరు సీజీఎంలు ఒకే పనిని రెండు, మూడు భాగాలుగా విభజించి నామినేషన్‌ ప్రాతిపదికన అప్పగిస్తున్నట్లు తెలిసింది. ఇలా ఒకటి, రెండు పనులు కాదు.. చాలా వరకు ఇదే తంతు కొనసాగుతోంది. వాటర్‌బోర్డు ఆపరేషన్‌ మెయింటనెన్స్‌ డివిజన్ల పరిధిలో నిర్వహించే చాలా వరకు పను లు రూ.95 వేల నుంచి రూ.99,999 మధ్య ఉంటున్నాయి. ఈ విభాగంపై పర్యవేక్షణ కొరవడటంతో సమస్యలు తలెత్తుతున్నాయి. 


కాంట్రాక్టర్ల సిండికేట్‌

ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి మే పదో తేదీ వరకు రూ.10.73 కోట్ల విలువైన 4,603 విలువైన అత్యవసర పనులను నామినేషన్‌ ప్రాతిపదికన వాటర్‌బోర్డు చేపట్టినట్లు తెలిసింది. ఇదే సమయంలో 2631 బడ్జెట్‌ పనులకు రూ.178.14 కోట్లకు మంజూరు చేయగా, ఇందులో అత్యధికంగా 1500 పనులు నామినేషన్‌ ప్రతిపాదికన అందజేసిన్నట్లు సమాచారం. అయితే వాటర్‌బోర్డు డివిజన్లలో స్థానికంగా కాంట్రాక్టర్‌ వ్యవస్థ ఉంది. చాలా వరకు సిండికేట్‌గా మారి పనులు పంచుకుంటున్నారు. అందినకాడికి దండుకుంటున్నారు. డివిజన్‌ స్థాయిలో జీఎంలను, డీజీఎంలను గుప్పిట్లో పెట్టుకుని పనుల పందేరం సాగిస్తున్నారు. తమ దారికి రాని జీఎంలను, డీజీఎంలను తమ పలుకుబడితో ఒత్తిడికి లోను చేస్తున్నారు. లేకుంటే ఏదైనా కేసుల్లో ఇరికిస్తున్నట్లు తెలుస్తోంది. 


ఆర్‌అండ్‌బీలో ఒకరిద్దరికే..

ఆర్‌అండ్‌బీ శాఖలో నిబంధనలు ఉల్లంఘించి నామినేషన్‌ ప్రాతిపదికన పనులు అప్పగిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.వంద కోట్ల పనులు నామినేషన్‌ పద్ధతిలో చేయించినట్లు తెలిసింది. అత్యవసర పనులు, లక్ష లోపు వ్యయం కలిగిన పనులు మాత్రమే నామినేషన్‌పై అందజేయాలని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నాయి. కానీ ఆర్‌అండ్‌బీలో మాత్రం కోట్ల రూపాయల పనులు కూడా నామినేషన్‌ ప్రాతిపదికన తమ అనుయాయులకు అప్పగిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ నివాసం ప్రగతిభవన్‌ మొదలుకొని రాజ్‌భవన్‌, న్యాయమూర్తులు, మంత్రులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు నివాసముండే క్వార్టర్లలో చేపట్టే వివిధ రకాల పనులు కూడా నామినేషన్‌ ప్రాతిపదికన చేస్తున్నారు. ఈ పనులు ఒకరిద్దరు కాంట్రాక్టర్లు మాత్రమే చేపడుతుండడం విమర్శలకు తావిస్తోంది. జూబ్లీదర్బార్‌ హాల్‌లో చిన్న చిన్న మరమ్మతుల పేరుతో రూ.6.60 లక్షల పనులను నామినేషన్‌ ప్రాతిపదికన ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించారు. నామినేషన్‌ పనుల్లో పెద్దఎత్తున అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, కొందరు అధికారులు, కాం ట్రాక్టర్లు కుమ్మక్కై పనులు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 


ఆర్‌అండ్‌బీలో ఇలా..

 2014-15లో బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌-12లో మినిస్టర్‌ క్వార్టర్స్‌ 12లో సివిల్‌ వర్క్‌ పేరిట రూ.8లక్షల పనులు నామినేషన్‌పై అప్పగించారు. క్వార్టర్‌ నెంబర్‌-2లో పెయింటింగ్‌, సివిల్‌, శానిటరీ వర్క్స్‌ పేరిట రూ.8లక్షల పనులు అప్పగించారు.

 2015-16లో కుందన్‌బాగ్‌లో మినిస్టర్‌ బంగ్లా-2లో ప్రత్యేక మరమ్మతుల పేరిట రూ.6.70లక్షల పనులు ఇచ్చారు.

 2018-19లో సీఎం క్యాంప్‌ ఆఫీసులో స్పెషల్‌ పనులతో పేరుతో రూ.9.35 లక్షల పనులు నామినేషన్‌పై చేశారు. అదేఏడాది మినిస్టర్‌ క్వార్టర్‌లో క్వార్టర్‌ నెంబర్‌ 12కు మెయిన్‌ గేట్‌ రెయిలింగ్‌ కోసం రూ.8లక్షలు పనులు నామినేషన్‌పై ఇచ్చారు.

 2019-20లో జియాగూడలోని అషీర్‌ఖానా రిన్నోవేషన్‌ కోసం రూ.10లక్షల పనులు నామినేషన్‌పై ఇవ్వగా, అదే ఏడాది మంత్రుల నివాసంలో క్వార్టర్‌ నెంబర్‌ 21లో సెక్యూరిటీ రూమ్‌ కోసం రూ.8లక్షలు, పాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని మెయిన్‌ బ్లాక్‌ లో వాటర్‌ ప్రూపింగ్‌ కోసం రూ.9.98 లక్షలు, అక్కడే నిర్మాణ పనుల పేరిట రూ.8.35లక్షల పనులు నామినేషన్‌పై అప్పగించారు. అదేవిధంగా ఎమ్మెల్యే క్వార్టర్‌లో రెక్టిఫికేషన్‌ పనుల పేరిట రూ.9.90లక్షలు, బీఆర్‌కే భవన్‌లో సీ, డీ బ్లాక్‌లో కలరింగ్‌, పెయింటింగ్‌ కోసం రూ.7.50లక్షలు నామినేషన్‌పై ఇచ్చారు.

 2020-21లో మంత్రుల నివాసంలోని క్వార్టర్‌ నెంబర్‌ 4లో ఫర్నిచర్‌ సరఫరా కోసం రూ.12.10లక్షలు, ప్రగతీ భవన్‌ గేటుకు వైర్‌ ఫెన్సింగ్‌ కోసం రూ.6.35లక్షల పనులు నామినేషన్‌పై అప్పగించారు.

Updated Date - 2022-05-18T14:39:29+05:30 IST