నామినేటెడ్‌ పోస్టుల సందడి

ABN , First Publish Date - 2020-08-08T10:02:26+05:30 IST

వెనుకబడిన కులాల(బీసీ) కార్పొరేషన్ల పదవుల భర్తీకి రంగం సిద్ధమవుతోంది.

నామినేటెడ్‌ పోస్టుల సందడి

బీసీ కార్పొరేషన్‌ పదవుల భర్తీకి కసరత్తు

సిద్ధమవుతున్న జాబితా

రెండు రోజుల్లో ఎమ్మెల్యేలతో సమావేశం


నెల్లూరు,ఆగస్ట్‌ 7(ఆంధ్రజ్యోతి): వెనుకబడిన కులాల(బీసీ) కార్పొరేషన్ల పదవుల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. ఈ అంశంపై రెండు రోజుల్లో జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు అమరావతిలో సమావేశం కానున్నారు. వైసీపీ జిల్లా ఇన్‌చార్జి సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో జిల్లా నేతల నుంచి బీసీ కార్పొరేషన్‌ పదవుల ఆశావహుల జాబితాను సిద్ధం చేయనున్నారు. 


వెనుకబడిన కులాల కార్పొరేషన్ల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మూడు నాలుగు రోజుల్లో దీనికి సంబంధించిన జీవో విడుదల కానుంది. కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. సుమారు 54 బీసీ కులాలకు వేర్వేరుగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి కార్పొరేషన్‌కు చైర్మన్‌, 12 మంది డైరెక్టర్లు ఉంటారు. చైర్మన్‌కు జడ్పీ చైర్మన్‌ హోదా కల్పిస్తారు. ఈ నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి సంబంధించి ఆశావహుల జాబితాను సిద్ధం చేయడం కోసం అధికార పార్టీ జిల్లాల వారీగా ఎంపీలు, ఎమ్మెల్యేలతో  సమావేశాలు నిర్వహిస్తోంది. 


 అమరావతిలో  సమావేశం

ఇందులో భాగంగా ఆది, సోమ వారాల్లో జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలతో అమరావతిలో సమావేశం జరగనుంది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి బాలినేని ఆరోగ్య కారణాల రీత్యా ఈ సమావేశానికి హాజరు కావడం లేదని తెలిసింది. వైసీపీ జిల్లా ఇన్‌చార్జి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. చైర్మన్‌, డైరెక్టర్ల పోస్టులకు శాసన సభ్యుల నుంచి ప్రతిపాదనలు తీసుకుంటారు.


ఎంపీలు, ఎమ్మెల్యేలు,  సిఫార్సు చేసిన వారికి డైరెక్టర్‌ పోస్టులు అందే సూచనలు కనిపిస్తుండగా చైర్మన్ల నియామకాలు మాత్రం సీఎం అభీష్టం మేరకే జరుగనున్నాయి. జిల్లా శాసన సభ్యులంతా ఏకభిప్రాయానికి వచ్చి పట్టుపడితే ఏదైనా ఒకటి..రెండు కార్పొరేషన్లకు సంబంధించి చైర్మన్‌ పదవి జిల్లాకు దక్కే అవకాశం ఉంది. నామినేటెడ్‌ పదవుల పందేరానికి రంగం సిద్దం కావడంతో బీసీ వర్గాలకు చెందిన అధికార పార్టీ ద్వితీయ శ్రేణి నాయకుల్లో సందడి కనిపిస్తోంది. 

Updated Date - 2020-08-08T10:02:26+05:30 IST