‘నామినేటెడ్‌’ ఎమ్మెల్సీలకు.. గవర్నర్‌ బ్రేక్‌!

ABN , First Publish Date - 2021-06-14T08:35:10+05:30 IST

గవర్నర్‌కు ఉండే సిసలైన అధికారమేమిటో విశ్వభూషణ్‌ హరిచందన్‌ చూపించనున్నారా? తన నామినేటెడ్‌ కోటాలో ఎమ్మెల్సీల నియామకానికి రాష్ట్రప్రభుత్వం

‘నామినేటెడ్‌’ ఎమ్మెల్సీలకు.. గవర్నర్‌ బ్రేక్‌!

  • అప్పిరెడ్డి, త్రిమూర్తులు పేర్లపై అభ్యంతరం
  • వారిపై క్రిమినల్‌ కేసులే కారణం
  • సమాచారం తెప్పించుకుని ధ్రువీకరణ
  • లిస్టు పంపి 4 రోజులైనా పెండింగ్‌లోనే
  • నేడు విశ్వభూషణ్‌తో సీఎం భేటీ


అమరావతి, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): గవర్నర్‌కు ఉండే సిసలైన అధికారమేమిటో విశ్వభూషణ్‌ హరిచందన్‌ చూపించనున్నారా? తన నామినేటెడ్‌ కోటాలో ఎమ్మెల్సీల నియామకానికి రాష్ట్రప్రభుత్వం పంపిన జాబితాను ఆయన పెండింగ్‌లో ఉంచింది అందుకేనా? అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. జాబితాలోని నలుగురిలో ఇద్దరి పేర్లపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ సోమవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ఆయన్ను కలవనున్నారు.


సీఎం స్వయంగా కలిసేందుకు వస్తుండటంతో ఈ ప్రచారానికి బలంచేకూరింది. నామినేటెడ్‌ కోటాలో గవర్నర్‌ శాసనమండలిలో నియమించే ఎమ్మెల్సీ స్థానాలు 4 ఖాళీ అయ్యాయి. వీటి భర్తీకి జగన్‌ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం 4పేర్లు.. లేళ్ల అప్పిరెడ్డి(గుంటూరు జిల్లా), తోట త్రిమూర్తులు(తూర్పుగోదావరి), మోషేన్‌ రాజు(పశ్చిమగోదావరి), రమేశ్‌ యాదవ్‌(అనంతపురం జిల్లా)తో కూడిన జాబితాను గవర్నర్‌కు పంపింది. సాధారణంగా ప్రభుత్వం నుంచివచ్చిన ఫైళ్లను ఆయన అదేరోజు ఆమోదించి పంపిస్తారు. చాలా ఫైళ్లు గంటల వ్యవధిలోనే ఆమోదంతో ప్రభుత్వానికి తిరిగి వెళ్లిపోతాయి. కానీ ఎమ్మెల్సీల నియామకం ఫైలు వెళ్లి 4రోజులైనా ఇంతవరకూ ఆమోదం పొందలేదు. ఇందులో లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులుపై క్రిమినల్‌ కేసులు న్నట్లు గవర్నర్‌కు ఫిర్యాదులు అందాయి.


గవర్నర్‌ కార్యాలయం తెప్పించుకున్న సమాచారం కూడా దీనిని ధ్రువీకరించినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. త్రిమూర్తులుపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదై ఉంది. అప్పిరెడ్డిపై పలు క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అంటున్నారు. తన కోటా కింద జరుగుతున్న నియామకాలు కావడంతో గవర్నర్‌ వీరి పేర్లను క్షుణ్ణంగా పరిశీలించారని.. నామినేటెడ్‌ కోటాలో నియమితమయ్యేవారు వివాదరహితులై ఉండాలని, నేర చరితులై ఉండకూడదని ఆయన ఆశిస్తున్నట్లు అధికార వర్గాల్లో వినవస్తోంది.


ఆచితూచి నియామకాలు..

ఇటీవలి కాలంలో తన ద్వారా జరిగే నియామకాల్లో గవర్నర్‌ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నియామకానికి ఆ మధ్య రాష్ట్రప్రభుత్వం ముగ్గురి పేర్లతో జాబితా పంపింది. అందులో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి శామ్యూల్‌పై సర్కారు మొగ్గు చూపిందని ప్రచారం జరిగింది. కానీ గవర్నర్‌ ఆ ముగ్గురి సర్వీసుకు సంబంధించిన వార్షిక కాన్ఫిడెన్షియల్‌ రికార్డులు తెప్పించుకుని పరిశీలించారు. శామ్యూల్‌తో పాటు మరొకరి విషయంలో కొన్ని వివాదాలు ఉన్నట్లు గుర్తించి.. చివరకు మాజీ సీఎస్‌ నీలం సాహ్ని పేరును ఓకే చేశారు. ఇప్పుడు నామినేటెడ్‌ ఎమ్మెల్సీల విషయంలోనూ తన అభ్యంతరాలను తెరపైకితెచ్చారు. ఆయన మనోగతం తెలియడంతో ముఖ్యమంత్రి గవర్నర్‌ను కలవాలని నిర్ణయించారు. సోమవారం సాయంత్రం 5గంటలకు సమావేశం కానున్న ట్లు అధికార వర్గాలు ధ్రువీకరించాయి.


ఆయన గవర్నర్‌కు నచ్చజెప్పి ఆమోదం పొందగలుగుతారా లేక ఆ రెండుపేర్లు తప్పించి వేరే పేర్లు ఇస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది. ఈ పరిణామం వైసీపీ వర్గాలను షాక్‌కు గురిచేసింది. అయితే ఎమ్మెల్సీల జాబితాకు గవర్నర్‌ శని/ఆదివారాల్లో ఆమోదం తెలుపుతూ ఆదేశాలు ఇవ్వబోతున్నారని మీడియాకు సమాచారం లీక్‌ చేయడం విశేషం. ఇదే విషయం ప్రసార సాధనాల్లో ప్రముఖంగా వచ్చింది. గవర్నర్‌ సంతకం పెడితే సోమవారం ఈ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం పెట్టుకోవాలని కూడా వైసీపీ వర్గాలు నిర్ణయించినట్లు పత్రికల్లో వచ్చింది. జాబితాకు ఆమోదం రాకపోవడం.. సీఎం స్వయంగా గవర్నర్‌ను కలవనుండడంతో వైసీపీ వరా ్గల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే ఇది మర్యాదపూర్వక భేటీయేనని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. తన ఢిల్లీ పర్యటన వివరాలను గవర్నర్‌కు తెలియజేయడానికే ఆయన రాజ్‌భవన్‌కు వెళ్తున్నారని చెబుతున్నాయి.

Updated Date - 2021-06-14T08:35:10+05:30 IST