శూన్యం తాలుకు శబ్దం

ABN , First Publish Date - 2021-08-23T08:36:01+05:30 IST

పూవులు రాల్చుకొని రాల్చుకొని గాలి ముసల్ది అయ్యింది కూడబెట్టుకున్న వెన్నెలంతా పక్షుల పాటకు ఇనామైపోయింది...

శూన్యం తాలుకు శబ్దం

పూవులు రాల్చుకొని రాల్చుకొని

గాలి ముసల్ది అయ్యింది

కూడబెట్టుకున్న వెన్నెలంతా

పక్షుల పాటకు ఇనామైపోయింది


చెరువు వొడ్డున గరక మంచు పూలు పూసి

మాయమై పోతుంటే

ఏ ఋతువు తెచ్చిన వేదనో కానీ 

లోపల కురిసిన వానని

దుఃఖం అనడం ఇష్టం లేదు


దిగాలు దిగి

శిగాలు ఊగి

గద్యమై వచ్చి పద్యమైపోయిన 

వలపోతలు దించుకోని

వలపుల తలుపులు 

తెరిచిన తటాకం మీది

ఎల్లలు లేని ఏకాంతానికి

భారం లేని కిరీటం

పచ్చలు మెరిసిన నిశ్చల నిధి 


ఇంక ఎంత కాలమైనా 

ఈ చెరువు వొడ్డునే నిద్రిస్తా

నా కల చాపలతో పాటు

ఈదుతూనే ఉంటుంది


శూన్యం తాలుకు శబ్దం

నా గుండెల మీద దిగే వరకు

ఇక్కడే ఉంటా


మబ్బులు వాయిద్యాల్లాగా ఉరుముతుంటే

వాన నాట్యంలా ఆడుతుంది

కాలువలో చాపలు పొర్లుతున్నట్టు

నాలో నీ జాసలు పొర్లుతున్నయి

నన్ను ఎవరేమనుకున్నా సరే

వెన్నెలకు చేతబడి జేసి

నా వెంటే తిప్పుకుంటా


రోగం తిరగబడ్డది అనుకున్నారు

కాదు వయసు మర్ల బడ్డది

చెరువులో చాపలు

కొత్త నీరును మీటుతుంటే

చెట్లు ఆకుల్ని చెవుల్ని  జేసుకున్నాయి


నువు రాకముందు....

పొద్దు ఆకాశాన్ని దున్ని పోయాక 

నక్షత్రాలు మొలకెత్తినయి 

మళ్ళీ 

గిట్టల సప్పుడు

పక్షుల కిల కిలలు

పొద్దు లేపుతుంటే

వొడ్డు వొరగ మంటుంది

ఇగం ఇగిలిస్తుంటే

కలను కౌగిలించుకొనే ఉన్నా 

కొమ్మలు చాపుకొని

ప్రవహిస్తూ ఎగిరి పోతున్నా

అనంత ఆనందంలోకి


బోయీల్లారా మీరు ఎవరు 

ఇటువైపుకు రాకండి

ఈ బోరకు అతనే ప్రేమదూత

చెట్లు చెరువు పచ్చులు

పూల మీది తేనెటీగలు

సందేశాన్ని పంపినాయి

చాపలు వింటుంటే

తాబేలు తల ఆడిస్తుంది


ఇంతలో....

ఎవో పాత నీడలు

నిలదీసి అడుగుతున్నయి

ఏండ్ల నించి

ఎదురు జూస్తున్నవు సరే

ఇంతకు ఈ విషయం ఆమెకు తెలుసా...

మునాసు వెంకట్‌

99481 58163

Updated Date - 2021-08-23T08:36:01+05:30 IST