Abn logo
Sep 19 2020 @ 00:09AM

సందడి షురూ!

Kaakateeya

లాక్‌డౌన్‌ సడలింపు, ప్రభుత్వ అనుమతులతో సినిమా షూటింగ్‌లు ఒక్కొక్కటిగా మొదలవుతున్నాయి. అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో పెద్ద సినిమాలు కూడా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో చిత్ర బృందాలు కొత్త లుక్‌లను, టీజర్‌లను

విడుదల చేసి సందడి సృష్టిస్తున్నాయి.


నెట్టింట్లో ‘నిశ్శబ్దం’ 

అనుష్క కథానాయికగా తెరకెక్కిన ‘నిశ్శబ్దం’ ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. కొద్దిరోజులుగా ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు అక్టోబర్‌ 2న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర బృందం, ప్రైమ్‌ సంస్థ అధికారికంగా ప్రకటించాయి. ఓటీటీ వేదికగా విడుదలవుతున్న అనుష్క తొలి సినిమా ఇదే.

విష్ణు ‘మోసగాళ్లు’..

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ‘మోసగాళ్లు’ చిత్రం మోషన్‌ పోస్టర్‌ను వెంకటేశ్‌ విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 

శైలపుత్రి దేవిగా నిత్యామీనన్‌! 

శ్రియ కీలక పాత్రలో మహిళా దర్శకులు సుజానారావు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘గమనం’. ఇందులో నిత్యామీనన్‌ ‘గాయని శైలపుత్రి దేవి’గా ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ నిత్యా లుక్‌ను శర్వానంద్‌ సోషల్‌ మీడియాలో విడుదల చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రియ మూగ యువతిగా నటిస్తున్నారు.

బ్యాచిలర్‌ బొమ్మ..

అఖిల్‌, పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్న ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ షూటింగ్‌ తిరిగి ప్రారంభమైంది. సెట్‌లో పూజాతో దిగిన ఫొటోను అఖిల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసి ‘మళ్లీ సెట్‌లో అడుగుపెట్టి పనిలో పడడంతో జీవితం ముందుకు వెళ్తున్నట్లుగా అనిపిస్తోంది. నేను, పూజ షూటింగ్‌ సమయంలో మాస్క్‌లు ధరించడం లేదు. మాస్క్‌ పెట్టుకుంటే తెరపై మమ్మల్ని గుర్తించలేరు కదా’’ అని తెలిపారు.

సిద్ధార్థ్‌ ఈజ్‌ బ్యాక్‌..

సుదీర్ఘ విరామం తర్వాత సిద్ధార్థ్‌ తెలుగుతెరపై మళ్లీ సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. శర్వానంద్‌ హీరోగా అజయ్‌ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మహా సముద్రం’ చిత్రంలో ఆయన కీలక పాత్ర పోషించనున్నారు. ‘‘సముద్రమంత ప్రతిభ కలిగి, మరోసారి తెలుగు ప్రేక్షకుల్ని అలరించడానికి వస్తున్న సిద్ధూకి స్వాగతం’ అంటూ ఎ.కె ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ట్విట్టర్‌లో పేర్కొంది.

అదా శర్మ సస్పెన్స్‌ థ్రిల్లర్‌!

‘క్వశ్యన్‌మార్క్‌’ సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నారు అదాశర్మ. విప్రా దర్శకత్వంలో సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా గౌరీకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

వ్యాపారవేత్తగా రాజేంద్రప్రసాద్‌...

రాజేంద్రప్రసాద్‌ వ్యాపారవేత్తగా కనిపించనున్న చిత్రం ‘క్లైమాక్స్‌’. శివశంకర్‌ మాస్టర్‌, పృథ్వీ, శ్రీరెడ్డి ఇతర పాత్రధారులు. లవ్‌, కామెడీ, ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మోషన్‌ పోస్టర్‌ను హైదరాబాద్‌లో రాజేంద్రప్రసాద్‌ విడుదల చేశారు. భవానీ శంకర్‌ దర్శకత్వంలో పి.రాజేశ్వర్‌రెడ్డి, కె.కరుణాకరరెడ్డి నిర్మిస్తున్నారు.

Advertisement
Advertisement