Noida Twin Towers Demolition : అంతా రెడీ.. 9 సెకన్లలో 40 అంతస్థుల భవంతి మటాష్.. ఎలాగో తెలుసా..

ABN , First Publish Date - 2022-08-23T22:09:32+05:30 IST

సొంతింటి కల కోసం జీవితాంతం చెమటోడ్చేవారు ఎందరో. తినో తినకో రూపాయి రూపాయి కూడబెట్టుకుని సొంత గూడు కోసం పరితపిస్తారు.

Noida Twin Towers Demolition : అంతా రెడీ.. 9 సెకన్లలో 40 అంతస్థుల భవంతి మటాష్.. ఎలాగో తెలుసా..

నోయిడా : సొంతింటి కల కోసం జీవితాంతం చెమటోడ్చేవారు ఎందరో. తినో తినకో రూపాయి రూపాయి కూడబెట్టుకుని సొంత గూటి కోసం పరితపిస్తారు. ఇలా కలలుగన్న వాళ్ల నుంచి సేకరించిన సొమ్ముతో ‘సూపర్ టెక్ లిమిటెడ్’(Super Tech Limited) అనే రియల్ ఎస్టేట్ కంపెనీ నోయిడాలో అక్రమంగా నిర్మించిన ట్విన్ టవర్(జంట భవనం) (Noida Twin Towers Demolition) కూల్చివేతకు రంగం సిద్ధమవుతోంది. సుప్రీంకోర్ట్ ఆదేశాలకు అనుగుణంగా.. 100 మీటర్లకుపైగా ఎత్తున్న ఈ టవర్‌ను ఆగస్టు 28న కూల్చివేయబోతున్నట్టు ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ఇందుకోసం 3700 కేజీల పేలుడు పదార్థాలను ఉపయోగిస్తామన్నారు. నియంత్రిత పేలుడు సాంకేతికత విధానంలో నేలమట్టం చేయనున్నామని తెలిపారు. ఈ ప్రక్రియలో కేవలం 9 - 10 సెకన్లలోనే భవంతి పేకమేడలా నేల కూలుతుందన్నారు. 55,000 టన్నుల శిథిలాలు పేరుకుపోతాయని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.




70 కోట్లతో మూడేళ్లు నిర్మాణం.. కూల్చడానికి సెకన్లు

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా సిటీ సెక్టార్ 93ఏలో ఉన్న ఈ 40 అంతస్థుల భవంతిని నిర్మించడానికి 3 ఏళ్ల సమయం పట్టింది. కానీ కేవలం సెకన్ల వ్యవధిలోనే కూలిపోనుంది. నిర్మాణానికి మొత్తం రూ.70 కోట్లు ఖర్చయ్యింది. అంటే ఒక్కో చదరపు అడుగుని రూ.933 ఖర్చుతో కట్టారు. కాగా భవంతి కూల్చివేతకు రూ.20 కోట్లు ఖర్చవనుంది. ఒక్కో చదరపు అడుగును రూ.237 ఖర్చుతో కూల్చబోతున్నారు. ఈ టవర్‌లో మొత్తం 915 అపార్ట్‌మెంట్లు, 21 కమర్షియల్ షాప్స్, 2 బేస్‌మెంట్లు ఉన్నాయి. 


5 వేల మంది తరలింపు..

కూల్చివేత నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లు, పరిసర ప్రాంతాలను స్థానిక అధికారులు ఇప్పటికే పరిశీలించారు. సమీపంలో నివసిస్తున్నవారిని టాస్క్ ఫోర్స్ బృందం అప్రమత్తం చేస్తోంది. ఏటీఎస్ గ్రీన్ విలేజ్, సూపర్‌టెక్ ఎమరాల్డ్ కోర్ట్‌లలో నివసిస్తున్న దాదాపు 5 వేల మందిని కూల్చివేత సమయంలో సురక్షిత ప్రాంతానికి వెళ్లాల్సిందిగా సూచించారు. ముంబై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎడిఫైస్ ఇంజనీరింగ్ కంపెనీతోపాటు సౌత్ ఆఫ్రికన్ పార్టనర్ సంస్థ ‘జెట్ డిమోలిషన్స్’ ఉమ్మడిగా చేపట్టనున్నాయి. కూల్చివేతను వీక్షించేందుకు పెద్ద ఎత్తున జనాలు అక్కడికి వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కూల్చివేత తర్వాత 35 వేల క్యూబిక్ మీటర్ల శిథిలాలు అక్కడ పేరుకుపోనున్నాయి. పెద్ద ఎత్తున దుమ్ము-ధూళీ  మేఘాలు అలుముకోనున్నాయి. 255 టన్నులకుపైగా ఐరన్ అల్లికతో కూడిన వైర్డ్ మెష్, దాదాపు 110 కిలోమీటర్ల పొడవుండే జియో-టెక్స్‌టైల్‌ను వాడనున్నామని ప్రాజెక్ట్ వివరించారు.


ఒక్కో అపార్ట్‌మెంట్ ఖరీదు రూ.1.13 కోట్లు

ఈ టవర్‌లోని అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఒక 3 బీహెచ్‌కే విలువ రూ.1.13 కోట్లుగా ఉంది. టవర్‌లో ఇదే తక్కువ రేటు. మొత్తం 915 ప్లాట్ల విక్రయం ద్వారా సూపర్‌టెక్ కంపెనీకి రూ.1198 కోట్లకుపైగా ఆదాయం సమకూరుతుందని ప్రాజెక్ట్ ప్రణాళికలో కంపెనీ అంచనా వేసింది. కానీ కూల్చివేతతో కలలన్నీ కల్లలు కానున్నాయి. 


కూల్చివేత డబ్బులు చెల్లించలేని స్థితిలో కంపెనీ..

ఈ భవనం శిథిలాలు(ఐరన్, ఇటుకలు వంటివి..) విక్రయం ద్వారా కంపెనీకి రూ.13.35 కోట్ల ఆదాయం సమకూరనుంది. కాగా ఈ టవర్‌కు రూ.100 ఇన్సూరెన్స్ కవర్ ఉంది. ఇప్పటికే దివాళా తీసిన సూపర్ టెక్ లిమిటెడ్ కంపెనీ భవంతి కూల్చివేతకు డబ్బులు చెల్లించలేని పరిస్థితులో ఉంది. రూ.4.5 కోట్ల నుంచి రూ.5.55 కోట్ల మధ్య చెల్లిస్తుండగా.. మిగతా మొత్తాన్ని శిథిలాల విక్రయం ద్వారా రూ.14.5 కోట్ల నుంచి రూ.15.5 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనాగా ఉంది. కాగా ఈ మొత్తం నిర్మాణానికి రూ.70 కోట్లు ఖర్చయ్యింది. గృహ కొనుగోలుదారుల నుంచి రూ.180 కోట్ల వరకు కంపెనీ వసూలు చేసింది. 633 ప్లాట్లు బుక్ కూడా అవ్వడం గమనార్హం. దీంతో 12 శాతం వడ్డీతో సహా మొత్తాన్ని బయ్యర్లకు చెల్లించాలని ఇప్పటికే కోర్ట్ ఆదేశాలు కూడా ఉన్నాయి.

Updated Date - 2022-08-23T22:09:32+05:30 IST