ఈ-శ్రమ్‌లో నోఎంట్రీ!

ABN , First Publish Date - 2022-07-06T05:29:18+05:30 IST

అసంఘటిత కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తింపజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ-శ్రమ్‌ పోర్టల్‌ను ప్రవేశపెట్టి సంవత్సరం గడుస్తున్నది.

ఈ-శ్రమ్‌లో నోఎంట్రీ!
మెదక్‌లో ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో కార్మికుల పేర్లను నమోదు చేస్తున్న లేబర్‌ అధికారి

ఏడాది గడిచినా నమోదు కాని  లక్ష మంది కార్మికుల వివరాలు 

మెదక్‌ జిల్లాలో అసంఘటిత కార్మికులు 2,40,000 మంది 

ఇప్పటి వరకు పోర్టల్‌లో  71 వేల మంది వివరాలు మాత్రమే నమోదు

కార్మికులకు అవగాహన లేకపోవడంతో రికార్డుల్లో నమోదు కాని వైనం

ఫలితంగా ప్రయోజనాలను కోల్పోతున్న కార్మికులు


మెదక్‌, జూలై 5: అసంఘటిత కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తింపజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ-శ్రమ్‌ పోర్టల్‌ను ప్రవేశపెట్టి సంవత్సరం గడుస్తున్నది. వ్యవసాయ కూలీలు, అడ్డాకూలీలు, మత్స్య కారులు, భవన నిర్మాణ రంగాల్లో పనిచేసే వారు, వడ్డెరలు, సెంట్రింగ్‌, ఫ్లంబింగ్‌, శానిటరీ, పెయింటింగ్‌, ఎలక్ర్టీషన్‌, వెల్డింగ్‌, ఇటుక, సున్నం బట్టీలు, బావుల తవ్వకం తదితర రంగాలకు సంబంధించిన అసంఘటిత కార్మికులకు సామాజికభద్రత, సంక్షేమ పథకాలు వర్తింపజేసేందుకు కేంద్రం ఈ-శ్రమ్‌ పోర్టల్‌ను ప్రారంభించింది. 16-59 ఏళ్ల లోపు వయస్సు గల వారు ఈ పథకానికి అర్హులు. ఆదాయ పన్ను చెల్లించని వారై ఉండటంతో పాటు ఎంప్లాయిస్‌ ప్రొవడెంట్‌ ఫండ్‌(ఈపీఎఫ్‌), ఎంప్లాయిస్టేట్‌ ఇన్సూరెన్స్‌(ఈఎ్‌సఈ) లేని వారై, అసంఘటిత రంగ కార్మికులై ఉండాలి. కార్మిక, వలస కార్మికులకు సంబంధించిన పూర్తి సమాచారం ప్రభుత్వాల వద్ద డేటాబేస్‌ రూపంలో నిక్షిప్తం చేయడం ద్వారా పూర్తి ప్రయోజనాలు పొందగలగుతారు. ఈ మేరకు కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ గత సంవత్సరం  ఆగస్టు 26న ఈ-శ్రమ్‌ పోర్టల్‌ను ప్రారంభించింది. 


అవగాహన లేమితో నమోదులో జాప్యం

మెదక్‌ జిల్లాలో మొత్తం 2,40,000 మంది అసంఘటిత కార్మికులు ఉన్నారని అంచనా. వీరిలో 71 వేల మంది మాత్రం పోర్టల్‌లో వివరాలు పొందుపరిచారు. ఈ-శ్రమ్‌లో దరఖాస్తు చేసుకోవడానికి నిరక్ష్యరాస్యులైన కార్మికులకు అవగాహన కొరవడడంతో వారు రికార్డుల్లో నమోదు కావడం లేదు. లేబర్‌ కార్యాలయ అధికారులు, సిబ్బంది కొరతతో ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో నమోదు ద్వారా కార్మికులకు చేకూరే ప్రయోజనాలను వివరించడం లేదు. దీంతో ఇంకా 60 శాతానికి పైగా కార్మికుల పేర్లను నమోదు చేయాల్సి ఉంది.


ఈ-శ్రమ్‌లో నమోదు ద్వారా ప్రయోజనాలు

ఈ-శ్రమ్‌లో దరఖాస్తు చేసుకున్న కార్మికులకు ప్రీమియం డబ్బు చెల్లించకుండానే ప్రధానమంత్రి సురక్షా భీమా యోజన కింద రూ2 లక్షల ఇన్సూరెన్స్‌ వర్తిస్తుంది. అయితే ఆధార్‌, బ్యాంకు పాసుబుక్‌, సెల్‌ఫోన్‌ నంబర్‌, నామినీ వివరాలతో మీ సేవా, కామన్‌ సర్వీస్‌ సెంటర్‌లో వారు నమోదు చేయించుకోవచ్చు. సొంతంగా ఆన్‌లైన్‌పై అవగాహన ఉంటే పోర్టల్‌లో వివరాలు వారికి వారే నమోదు చేసుకోవచ్చు.


ఈ-శ్రమ్‌లో దరఖాస్తు చేసుకోండి 

- యాదయ్య, ఇన్‌చార్జి సహాయ కార్మిక అధికారి, మెదక్‌

ఈ-శ్రమ్‌లో దరఖాస్తు చేసుకున్న అసంఘటిత, వలస కార్మికులు బహుళ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. పైగా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతాయి. దీనికి తోడు ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన పథకం కింద ఎలాంటి ప్రీమియం  లేకుండా  రూ.2 లక్షల బీమా వర్తిస్తుంది. ఆధార్‌, బ్యాంకు ఖాతా, సెల్‌ఫోన్‌ నెంబర్‌, నామినీ వివరాలతో మీసేవా సెంటర్లలో అప్లై చేసుకోవచ్చు. అయితే 16-59 ఏళ్ల వయస్సు ఉన్న కార్మికులను అర్హులుగా పరిగణిస్తున్నారు. మెదక్‌ జిల్లాలో ఈ-శ్రమ్‌ పోర్టల్‌పై కార్మికులకు అవగాహన కల్పిస్తున్నాం. 

Updated Date - 2022-07-06T05:29:18+05:30 IST