కార్మికుల క్యాంపులకు నోడల్‌ ఆఫీసర్లు..!

ABN , First Publish Date - 2020-03-29T10:43:56+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో గ్రేటర్‌లో సకలం బంద్‌ అయ్యింది.

కార్మికుల క్యాంపులకు నోడల్‌ ఆఫీసర్లు..!

హైదరాబాద్‌ సిటీ, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ నేపథ్యంలో గ్రేటర్‌లో సకలం బంద్‌ అయ్యింది. భవన నిర్మాణ పనులూ నిలిచిపోయాయి. అత్యవసరం మినహా... ఇతరత్రా సేవలు స్తంభించాయి. ముఖ్యంగా నిర్మాణ రంగ కార్మికులపై లాక్‌డౌన్‌ ప్రభావం ఎక్కువగా ఉంది. పనులు నిలిచిపోయాయి. సొంతూళ్లకు వెళ్లే పరిస్థితి లేదు. రెక్కాడితే గానీ.. డొక్కాడని ఆ జీవితాలకు ఇది కష్టకాలం.


ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ స్పందించింది. లాక్‌డౌన్‌ పీరియడ్‌లో కార్మికులకు నిర్మాణ స ంస్థలే భోజనం, ఇతరత్రా సదుపాయాలు కల్పించేలా చర్యలకు శ్రీకారం చుట్టింది. పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు ఆదేశాలతో ఏరియాల వారీగా ప్రత్యేక అధికారులకు పర్యవేక్షణా బాధ్యతలు అప్పగించింది. జోన్లు, సర్కిళ్ల వారీగా సిటీ ప్లానర్లు, అసిస్టెంట్‌ సిటీ ప్లానర్లను నోడల్‌ ఆఫీసర్లుగా నియమించింది. తమ ఏరియా పరిధుల్లోని భవన నిర్మాణ సైట్లలో ఉన్న క్యాంపుల్లో కూలీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత వారికి అప్పగించారు. నిర్మాణ సంస్థలు కార్మికులకు నిత్యావసర సరుకులు / భోజనం అందించాలి. ఇందులో భాగంగా వాహనాల రాకపోకల అనుమతి కోసం ఆయా సంస్థలకు పోలీస్‌ అధికారుల ద్వారా పాస్‌లు జారీ చేస్తున్నారు.


సైట్‌ను బట్టి.. ఒక్కో చోట 20 నుంచి 1000 మంది వర కు కార్మికులు ఉంటున్నారు. మొత్తం 168 ప్రాంతాల్లో ప్రస్తుతం బడా నిర్మాణ సంస్థ ల ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని గుర్తించారు. ఆ సైట్లలో ఉన్న కార్మికులకు అవసరమైన సదుపాయం కల్పిస్తున్నారా..? లేదా..? అన్నది అధికారులు పర్యవేక్షిస్తారు. 

Updated Date - 2020-03-29T10:43:56+05:30 IST