Abn logo
Sep 2 2021 @ 00:55AM

ప్చ్‌.. ఒక్కటీ లేదు

  • తొమ్మిదోరోజు పతకాలు నిల్‌ 
  • బ్యాడ్మింటన్‌లో మిశ్రమ ఫలితాలు
  • స్విమ్మర్‌ జాదవ్‌పై అనర్హత వేటు 
  • పారాలింపిక్స్‌లో భారత్‌

టోక్యో:  వరుసగా మూడు రోజులు పతకాల పంట పండించిన భారత అథ్లెట్లు..బుధవారం కాస్తంత వెనుకపడ్డారు. తొమ్మిదిరోజు పోటీల్లో ఒక్క పతకమూ గెలవలేకపోయారు. ఏస్‌ షూటర్‌ అవని లేఖార మిక్స్‌డ్‌ 10 మీ. ఎయిర్‌ రైఫిల్‌ ప్రోన్‌ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. త్రో విభాగంలో ఎన్నో ఆశలుపెట్టుకున్న భారత ద్వయం అమిత్‌ కుమార్‌, ధరంవీర్‌ విఫలమయ్యారు. 


త్రోబాల్‌లో అమిత్‌కు నిరాశ: ఎఫ్‌-51 పురుషుల త్రోబాల్‌ ఫైనల్లో ఆసియా పారా గేమ్స్‌ చాంపియన్‌, 36ఏళ్ల అమిత్‌ 27.77 మీ. దూరమే విసిరి ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. రియో గేమ్స్‌లో (26.63 మీ.) అతడు నాలుగో స్థానంలో నిలవడం గమనార్హం. ఇక..2018 ఆసియా పారా గేమ్స్‌లో రజతం దక్కించుకున్న 32 ఏళ్ల ధరంవీర్‌ 25.59 మీ. సీజన్‌ బెస్ట్‌తో 8వ స్థానంలో నిలిచాడు. 


ప్రమోద్‌ ఒక్కడే: బ్యాడ్మింటన్‌లో మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్‌ గ్రూప్‌ ‘ఎ’ ఎస్‌ఎల్‌-3లో వరల్డ్‌ నెం.1 ప్రమోద్‌ భగవత్‌ 21-10, 21-23, 21-19తో సహచరుడు మనోజ్‌ సర్కార్‌పై గెలిచాడు. 33 ఏళ్ల వరల్డ్‌ చాంపియన్‌ భగవత్‌ గురువారం జరిగే తదుపరి రౌండ్‌లో ఒలెక్సాండర్‌ చిర్కోవ్‌ (ఉక్రెయిన్‌)తో తలపడతాడు. ఇక మనోజ్‌ సర్కార్‌ శుక్రవారం జరిగే పోరులో చిర్కోవ్‌నే ఢీకొంటాడు. మహిళల విభాగంలో పాలక్‌ కోహ్లీకి సింగిల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌ రెండింటిలోనూ నిరాశే ఎదురైంది. మహిళల సింగిల్స్‌ గ్రూప్‌ ‘ఎ’ ఎస్‌యూ-5 పోరులో 19 ఏళ్ల పాలక్‌ 4-21, 7-21తో 2009 వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప స్వర్ణ పతక విజేత అయాకొ సుజుకి (జపాన్‌) చేతిలో ఓడింది. రెండో రౌండ్‌లో జెహ్రా బగ్లర్‌ (టర్కీ)తో పాలక్‌ అమీతుమీ తేల్చుకుంది. అంతకుముందు మిక్స్‌డ్‌లో ప్రమోద్‌ /పాలక్‌ జోడీ తొలి రౌండ్‌లోనే ఓటమి చవిచూసింది. 


స్విమ్మర్‌ జాదవ్‌ డిస్‌క్వాలిఫై: పురుషుల 100 మీటర్ల బెస్ట్‌స్ట్రోక్‌ ఎస్‌బీ-7 ఫైనల్లో సుయాష్‌ జాదవ్‌ డిస్‌క్వాలిఫై అయ్యాడు. అంతర్జాతీయ స్విమ్మింగ్‌ సమాఖ్య నిబంధనల ప్రకారం..ఒక రౌండ్‌ ఈదిన తర్వాత ఒక బటర్‌ఫ్లై కిక్‌కు మాత్రమే అనుమతిస్తారు. జాదవ్‌ ఒక్కసారి కంటే ఎక్కువ బటర్‌ఫ్లై కిక్‌ తీసుకోవడంతో అతడిపై అనర్హత వేటు వేశారు. 

లేఖార క్వాలిఫయింగ్‌లోనే..: రెండు రోజుల కిందట స్వర్ణ పతకంతో అదరగొట్టిన అవని లేఖార అదే జోరు కొనసాగించలేకపోయింది. మిక్స్‌డ్‌ 10 మీ. ఎయిర్‌ రైఫిల్‌ ప్రోన్‌ ఎస్‌హెచ్‌-1 విభాగంలో క్వాలిఫికేషన్‌ రౌండ్‌లోనే తిరుగుముఖం పట్టింది.

క్రైమ్ మరిన్ని...