అతిథి గృహానికి నోచని ఆమనగల్లు

ABN , First Publish Date - 2022-07-04T05:04:31+05:30 IST

ఆమనగల్లులో అతిథి గృహ నిర్మాణం హామీలకే పరిమితమైంది.

అతిథి గృహానికి నోచని ఆమనగల్లు
పునరుద్ధరణకు నోచుకొని అటవీ శాఖ అతిథి గృహం

  • రెండు దశాబ్దాలుగా ప్రతిపాదనల్లోనే నిర్మాణం
  • పట్టించుకోని నేతలు, అధికారులు


ఆమనగల్లు ,జూలై 3 : ఆమనగల్లులో అతిథి గృహ నిర్మాణం హామీలకే పరిమితమైంది. ప్రతిపాదనల్లోనే నిలిచింది. అతిథిగృహ నిర్మాణ విషయంలో ఎవరూ చొరవ చూపడం లేదు. నాలుగు మండలాలకు కూడలిగా, రాష్ట్ర రాజధానికి చేరువలో ఉన్న ఆమనగల్లులో ఏ ఒక్క శాఖకు అతిథి గృహం లేదు. అతిథి గృహ నిర్మాణం గురించి ఏళ్ల కాలంగా స్థానిక ప్రజాప్రతినిధులు, వివిద పార్టీల నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నా స్పందన లేదు. పలు మార్లు పట్టణానికి వచ్చిన మంత్రులు, కలెక్టర్‌, ఉన్నతాధికారులకు స్థానికులు ఆర్‌అండ్‌బీ అతిథి గృహం నిర్మాణం గురించి విన్నవించినీ ఫలితం లేకపోయింది. ఆమనగల్లుకు తరుచూ మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులు, అతిథులు వస్తుంటారు. కాగా వారు విశ్రాంతి తీసుకోవడానికి, ప్రెస్‌మీట్‌లకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. విధి లేక కొన్నిసార్లు పట్టణ సమీపంలోని కాటన్‌ మిల్లు గెస్ట్‌హౌజ్‌ను ఉపయోగించుకుంటున్నారు. దశాబ్దాల క్రితం అటవీ శాఖ కార్యాలయం ఆవరణలో నిర్మించిన అతిథి గృహాన్ని రెండు దశాబ్దాల క్రితం మావోయిస్టులు పేల్చివేశారు. దానిని నేటికీ పునరుద్ధరించలేదు. ఆర్‌అండ్‌బీ అతిథి గృహ నిర్మాణానికి పలుమార్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అతిథి గృహ నిర్మాణానికి అనువైన స్థలాలు కూడా ఉన్నాయి. అయినప్పటికి ఆ దిశగా ఎవరు చొరవ చూపడం లేదు. ఇప్పటికైన ప్రజాప్రతినిధులు, అధికారులు అతిథిగృహం నిర్మాణానికి కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు. 



Updated Date - 2022-07-04T05:04:31+05:30 IST