Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఓటీఎస్‌ డబ్బులు ఎవరూ కట్టొద్దు

మేం వచ్చిన నెల రోజుల్లో ఉచితంగా పట్టాలిస్తాం

కొత్త ఇళ్లు కట్టకపోగా.. గతంలో కట్టినవాటికి వసూళ్లా?

రేపు మీ పొలాలకు కూడా డబ్బులు కట్టాలంటారు

జగన్‌కు మానవత్వం ఉందా?.. చంద్రబాబు ధ్వజం

గురజాల-దాచేపల్లి ఎన్నికలపై టీడీపీ అధినేత సమీక్ష


అమరావతి, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ‘వన్‌ టైం సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) పేరుతో పేదల నుంచి డబ్బులు బలవంతంగా వసూలు చేస్తున్నారు. ప్రజల ఇళ్లపై మీ పెత్తమేంటి’ అని జగన్‌ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. రేపు మీ పొలాలకు కూడా డబ్బులు కట్టాలంటారని.. ఓటీఎ్‌సకు ఎవ్వరూ డబ్బులు కట్టొద్దని పిలుపిచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఉచితంగా పట్టాలిస్తామని ప్రకటించారు. ఆయన గురువారమిక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురజాల, దాచేపల్లి మున్సిపల్‌ ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్త ఇళ్లు కట్టకపోగా గతంలో కట్టిన ఇళ్లకు డబ్బులు వసూలు చేసే అధికారం మీకెవరిచ్చారని ప్రభుత్వాన్ని నిలదీశారు. ‘అధికారం ఉందని మనుషులను చంపుతారా? జగన్‌కు మానవత్వం ఉందా? అసలు మనిషైతే హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తారా? ఈ ముఖ్యమంత్రికి మానవత్వం ఉంటే పల్నాడులో జరుగుతున్న అరాచకాలకు సమాధానం చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో గూండారాజ్యం నడుస్తోందని, టీడీపీ నాయకులపైనే కాకుండా, ప్రజలపైనా వైసీపీ వారు దాడులు చేస్తున్నారని.. తామేం చేసినా చెల్లుతుందన్నట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సారి టీడీపీ అధికారంలోకి వస్తుందని.. తప్పులు చేసిన వారు ఎక్కడున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ‘వైసీపీ అరాచకాలను ప్రశ్నిస్తే, అసెంబ్లీలో బూతులు తిడుతున్నారు. వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవరూ వేలెత్తి చూపకుండా గౌరవంగా బతికా. కానీ నేడు నా భార్యను కించపరిచేలా మాట్లాడితే తట్టుకోలేకపోయా. నాపై 24 క్లెమోర్‌మైన్లు పేల్చి చంపాలని చూసినా భయపడలేదు. కానీ ముఖ్యమంత్రినైనా, ప్రతిపక్ష నేతనైనా నేనూ మనిషినే. ఇంట్లో మనుషుల్ని అంటే బాధ ఉండదా? అందుకే కౌరవ సభలో శపథం చేసి, ప్రజాక్షేత్రంలో తేల్చుకుని, ముఖ్యమంత్రిగా వస్తానని చెప్పాను’ అని తెలిపారు. ‘ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిగి ఉంటే గురజాల, దాచేపల్లి మున్సిపాలిటీల్లో గెలిచే వాళ్లం. కానీ గెలిచి ఓడాం. గురజాల నియోజకవర్గంలో 8 మంది కార్యకర్తలను చంపారు. సైదా అనే కార్యకర్తను నడిరోడ్డుపై కొట్టారు. వైసీపీ నేతల అక్రమ మైనింగ్‌ వల్ల గుంతల్లో పడి ఏడుగురు చిన్నారులు చనిపోతే.. టీడీపీ కార్యకర్తలపై కేసులు పెడతారా? విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో చనిపోయిన వారికి రూ.కోటి ఇచ్చిన ప్రభుత్వం.. అక్రమ మైనింగ్‌ వల్ల ప్రాణాలు కోల్పోయిన చిన్నారులను పట్టించుకోదా? తురకపాలెంలో 70 ఏళ్ల వృద్ధ ముస్లిం దంపతులపై హత్యాయత్నం కేసు పెట్టారంటే ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నారో ప్రజలు అర్ధం చేసుకోవాలి ’ అని అన్నారు. వరి వేయొద్దని వ్యవసాయ మంత్రి అంటున్నారని.. వరి చేయకుండా గంజాయి పంట పండించాలా అని నిలదీశారు. వైసీపీ దాడుల్లో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు, గాయపడినవారికి పార్టీ తరపున చంద్రబాబు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. గురజాల నియోజకవర్గంలో చనిపోయిన 8 మంది కుటుంబాలకు రూ.లక్ష చొప్పున, గాయపడిన సైదాకు రూ.లక్ష, గుంతల్లో పడి చనిపోయిన చిన్నారుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.50 వేలు చొప్పున ఇస్తున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement