నోబెల్ రేంజ్ చీటింగ్: పోలీసు పరీక్షలో సరికొత్త కాపీయింగ్

ABN , First Publish Date - 2021-12-22T21:51:16+05:30 IST

అతడు నోబెల్‌కు అర్హుడంటూ ఒక వ్యక్తి అనగా.. ఎస్ఐ ఎందుకు ఏకంగా సీబీఐకి పంపండంటూ ఇంకొకరు కామెంట్ చేశారు. కాగా, ఇంకొందరు ఇలాంటి చర్యలు దేశంలోని నిరుద్యోగ పరిస్థితిని, పేదరికాన్ని వెల్లడిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు...

నోబెల్ రేంజ్ చీటింగ్: పోలీసు పరీక్షలో సరికొత్త కాపీయింగ్

లఖ్‌నవూ: ఇండియాలో ప్రభుత్వ ఉద్యోగానికి ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగానికి ఉండే పోటీ అంతకంటే చర్చనీయాంశం ఇక్కడ. వంద పోస్టులకు వేలల్లో లక్షల్లో అభ్యర్థులు పరీక్షలు రాస్తుంటారు. అందుకే ప్రభుత్వ ఉద్యోగ వేటలో అభ్యర్థులు లంచాల వైపు మొగ్గు చూపడం, చీటింగ్‌లకు పాల్పడడం సర్వసాధారణం అయిపోయింది. మారుతున్న కాలానికి అనుగుణంగా చీటింగ్‌లలో కూడా కొత్తదారులు వెతుకుతుంటారు అభ్యర్థులు. బ్లూటూత్‌లు, వైర్‌లెస్ డివైల్‌ల వంటివి ఉపయోగిస్తుంటారు. అయితే ఇలా చేస్తూ దొరికిపోవడం కూడా సహజమే అయిపోయింది.


తాజాగా వెలుగు చూసిన ఓ చీటింగ్.. చీటింగ్‌లో ఇంకో లెవెల్ అంటున్నారు. కొందరైతే నోబెల్ ప్రైజ్ ఇచ్చే రేంజ్‌లో చీటింగ్ ఉందని అంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్ అర్హత పరీక్షకు ఓ అభ్యర్థి విగ్గులో బ్లూటూత్ అమర్చుకుని హాజరయ్యాడు. కాస్త ఏమరపాటుగా ఉంటే సక్సెస్‌ఫుల్‌గా పరీక్ష రాసేవాడే కావొచ్చు. కానీ, అభ్యర్థిపై అనుమానంతో తనికీ చేయగా విగ్గులో దాగిన బ్లూటూత్ బయటపడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


అయితే చీటింగ్‌కు పాల్పడ్డ అభ్యర్థిపై అతడి టాలెంట్‌ను గుర్తించండి అంటూ నెటిజెన్లు సెటైర్లు, జోకులు వేస్తున్నారు. అతడు నోబెల్‌కు అర్హుడంటూ ఒక వ్యక్తి అనగా.. ఎస్ఐ ఎందుకు ఏకంగా సీబీఐకి పంపండంటూ ఇంకొకరు కామెంట్ చేశారు. కాగా, ఇంకొందరు ఇలాంటి చర్యలు దేశంలోని నిరుద్యోగ పరిస్థితిని, పేదరికాన్ని వెల్లడిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



Updated Date - 2021-12-22T21:51:16+05:30 IST