సొమ్ములున్నా.. పనులు సున్నా..

ABN , First Publish Date - 2021-08-02T05:56:00+05:30 IST

గడచిన ఫిబ్రవరి, మార్చి నెలల్లో చేపట్టిన పనులకు ఇప్పటిదాకా ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో పాలకవర్గాలు గగ్గోలు పెడుతున్నాయి.

సొమ్ములున్నా.. పనులు సున్నా..

ఆర్థిక సంఘం నిధులపైనా పెత్తనం

బిల్లులు మంజూరు చేయని ప్రభుత్వం

పంచాయతీల్లో పడకేసిన అభివృద్ధి  

పనులు చేసేందుకు వెనకడుగు


(తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి)

పంచాయతీలకు కేంద్రం మంజూరు చేస్తున్న ఆర్థిక సంఘం నిధులపై రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం చలాయిస్తోంది. అభివృద్ధి పనుల బిల్లులు చెల్లించకుండా తాత్సారం చేస్తోంది. ఆర్థిక సంఘం నిధులను వేరే అవసరాలకు మళ్లించవద్దంటూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయినా సరే పల్లెల్లో పనులు చేసేందుకు పంచాయతీలు వెనుకాడుతున్నాయి. గడచిన ఫిబ్రవరి, మార్చి నెలల్లో  చేపట్టిన పనులకు ఇప్పటిదాకా ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో పాలకవర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. జిల్లాలో కేటాయించిన 14వ ఆర్థిక సంఘం నిధులు మురిగి పోతాయన్న ఉద్దేశంతో సర్పంచ్‌లు చేతి చమురు వదిలించుకుని పనులు పూర్తిచేశారు. ఇంత వరకు బిల్లులు రాలేదు. ఆర్థికంగా ఇబ్బందులు ఉండే పంచాయతీలు పనులు చేసేందుకు సాహసించ లేదు. రాష్ట్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి మరో ఏడాది గడువు కోరడంతో కేంద్రం సానుకూలంగా స్పందిం చింది. ఏడాది గడువు పెంచింది. దాంతో 14వ ఆర్థిక సంఘం నిధులు బతికే ఉన్నాయి. అయినా పంచాయతీలు పనులు నిర్వహించే సాహసం చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించదన్న భయం పంచాయతీలను వెంటాడు తోంది. జిల్లాలో దాదాపు రూ. 90 కోట్ల మేర  14వ ఆర్థిక సంఘం నిధులు ఉన్నాయి. అలాగే 15వ ఆర్థిక సంఘం తొలి త్రైమాసికంలో మరో రూ.39 కోట్లు నిధులు మంజూరయ్యాయి.పంచాయతీలు ఈ నిధులను భూత ద్దంలో చూసుకునే పరిస్థితి దాపురించింది. ఖర్చు పెడదా మంటే ప్రభుత్వం నుంచి బిల్లులు రావేమోనన్న గుబులు నెల కొంది. విద్యుత్‌ బిల్లులు మాత్రమే చెల్లిస్తున్నారు. అవి కూడా మూడు నెలల తర్వాత ప్రభుత్వం సర్దుబాటు చేస్తోంది. ఫిబ్రవరి నెలలో కొత్తగా ఎన్నికైన పలువురు సర్పంచ్‌లు జిల్లాలో 14వ ఆర్థిక సంఘం నిధులకు సంబం ధించి హుటాహుటిన పనులు చేపట్టారు. వాటి విలువ దాదాపు రూ.25 కోట్లు ఉంటుంది. ఆ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. బిల్లులు పెట్టేశారు. ప్రభుత్వం మంజూరు చేయకపోవడంతో అప్పులపాలయ్యామంటూ సర్పంచ్‌లు గగ్గోలు పెడుతున్నారు.వారి అవస్థలను చూసి మిగిలిన పంచాయతీలు చేతులు ముడుచుకు కూర్చున్నాయి. బిల్లులు రాకపోతే ఇబ్బందులు పడతామంటూ సర్పంచ్‌లు వెనుకంజ వేస్తున్నారు. కాంట్రాక్టర్‌లు కూడా ముందుకు రావడం లేదు.ఇలా పంచాయతీల్లో అభివృద్ధి పడకేసింది. ఉన్న కొద్దిపాటి నిధులను కూడా వెచ్చించుకోలేని దుస్థితిలో పంచా యతీలు ఉన్నాయి.  


పంచాయతీ నిధులు మళ్లింపా..!

పోతుల అన్నవరం, సర్పంచ్‌, పెదతాడేపల్లి 

పంచాయతీకి కేటాయించే ఆర్థిక సంఘం నిధులు వేరే అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వం మళ్లించ కూడదు. ఇదే విష యాన్ని కేంద్రం స్పష్టం చేసింది. పంచాయతీలకు ఉన్న కొద్దిపాటి నిధులు సకాలంలో వెచ్చించుకోకపోతే అభివృద్ధి ఎలా సాగుతుంది. ఇప్పటికే  కొన్ని పంచాయతీల్లో పనులు పూర్తిచేసి దాదాపు 5 నెలలు కావస్తోంది. ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయలేదు.

.

Updated Date - 2021-08-02T05:56:00+05:30 IST