పంట చేతికొచ్చేదెలా?

ABN , First Publish Date - 2020-03-28T09:03:57+05:30 IST

పొలాల్లో వేసిన పంటలు కోతకొచ్చాయి. తీరా కోయాల్సిన సమయానికి కరోనా వైరస్‌ వచ్చిపడింది. దీని బారిన పడకుండా ఉండేందుకు ప్రజలంతా

పంట చేతికొచ్చేదెలా?

కోతకొచ్చిన పంటలు.. కోసేందుకు రాని కూలీలు

కరోనా భయంతో పనికి వచ్చేందుకు వెనకడుగు

చేలపైనే పంటలు.. ఆందోళనలో రైతులు

వ్యవసాయ సంబంధ పనులు, యంత్రాలకు, 

కూలీలకు మినహాయింపునిస్తున్నాం: కేంద్రం


హైదరాబాద్‌/ఖమ్మం, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): పొలాల్లో వేసిన పంటలు కోతకొచ్చాయి. తీరా కోయాల్సిన సమయానికి కరోనా వైరస్‌ వచ్చిపడింది. దీని బారిన పడకుండా ఉండేందుకు ప్రజలంతా సామాజిక దూరం పాటిస్తూ ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పంటలను కోసేందుకు కూలీలెవరూ ముందుకు రాక.. రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. రైతులు పండించిన పంటలకు ఎలాంటి నష్టం, కష్టం రానివ్వబోమని, మార్కెటింగ్‌ శాఖ అధికారులు గ్రామాల్లోకి వచ్చి పంటలను కొంటారని, రైతులు భయపడాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రకటించినా.. ఎక్కువశాతం పంట ఇంకా పొలాల్లోనే ఉంది. కూలీలను కదిలిస్తే.. తామెక్కడ కరోనా బారిన పడతామోనని రైతులు భయపడుతున్నారు.


ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వెయ్యి హెక్టార్లలో సాగు చేసిన బొప్పాయి పంట పూర్తిగా చేతికొచ్చింది. కానీ, కోసేందుకు కూలీలు రాక, కోసినా రవాణా చేసే వీలులేక.. కాసిన పంటంతా కుళ్లిపోతోంది. మరోవైపు సుమారు లక్ష హెక్టార్లలో సాగుచేసిన వరి కూడా కోత దశలో ఉంది. కొందరు రైతులు యంత్రాలతో పంటను కోస్తు న్నా.. ధాన్యాన్ని బస్తాల్లో నింపి ఇళ్లకు తరలించేందుకు కూలీ లు రావడంలేదు.  మిర్చి రైతులు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మొక్కజొన్న, చెరకు, జామ, పెసర, కంది  పంటలు కూడా కోత దశకు రావడం, వీటిపై లాక్‌డౌన్‌ ప్రభా వం పడటంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. 


అన్ని జిల్లాల్లోనూ ఇంతే..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మిర్చిని కోసేందుకు మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్‌ నుంచి వచ్చిన కూలీలు కరోనా భయంతో స్వరాష్ట్రానికి వెళ్లిపోయారు. కామారెడ్డి జిల్లాల్లో వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో పనిచేయటానికి మహారాష్ట్ర, కర్ణాటక  రాష్ట్రాల నుంచి రావాల్సిన కూలీలు ఇప్పటివరకు రాలేదు. సిద్దిపేట జిల్లాలో మొక్కజొన్న కోసేందుకు, కూరగాయలు తెంపేందుకు స్థానిక వ్యవసాయ కూలీలెవరూ రావటంలేదు. నల్లగొండ జిల్లాలో తమిళనాడు నుంచి వరికోత యంత్రాలు వచ్చి కోస్తాయి. కరోనా నేపథ్యంలో గ్రామాల సరిహద్దుల్లో కంచెలు వేసి హార్వెస్టర్లను రానివ్వడంలేదు.    


కూలీలకు మాస్కులు, శానిటైజర్లు అందించాలి

వాస్తవానికి పంటపొలాల్లో కూలీలు ఎవరికివారు సహజదూరం పాటిస్తూనే పంటలు కోయడం, కలుపులు తీయడం లాంటివి చేస్తుంటారు. ఈ దిశగా వారికి మరింత అవగాహన కల్పించి ఇంకొన్ని చర్యలు తీసుకుంటే వ్యవసాయ పనులు సాధ్యమవుతాయని రైతులు అంటున్నారు. అవసరమైతే కూలీలకు మాస్కులు, శానిటైజర్లు వంటి వాటిని అందించి.. పంట లు కోసేలా చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నా య మార్గాల ద్వారా రైతులను ఆదుకోవాలని కోరుతూ ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.  


వ్యవసాయ పనులకు మినహాయింపు: కేంద్రం

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ నిబంధనల నుంచి వ్యవసాయ సంబంధ పనులకు కేంద్రం మినహాయింపునిచ్చింది. పంటల కోత పనులు, మార్కెట్‌ యార్డులు, పంట సేకరణ సంస్థలు, వ్యవసాయ యంత్రాల అద్దె కేంద్రాలను తెరిచేందుకు, పంట ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు అనుమతినిస్తున్నట్లు పేర్కొంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవయసాయ కూలీలు, ఎరువులు, పురుగుమందులు, విత్తనాత తయారీ యూనిట్లలో పనిచేసే వారికీ మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది.  

Updated Date - 2020-03-28T09:03:57+05:30 IST