నీళ్లకు ఢోకా లేదు

ABN , First Publish Date - 2020-03-28T12:08:10+05:30 IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే వనపర్తి జిల్లాలో

నీళ్లకు ఢోకా లేదు

ఏప్రిల్‌ 10 వరకు జూరాల ఆయకట్టుకు నీరు

కేఎల్‌ఐ, భీమా పథకాల కింద కూడా పంటలకు


వనపర్తి, మార్చి 27 (ఆంధ్రజ్యోతి) : కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే వనపర్తి జిల్లాలో పంటలు చివరి దశలో ఉండటం, ఈ దశలో పంటలకు నీరు అందకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని రైతులు ఆందోళన చెందారు. ఈ ఆందోళన తొలగించేందుకు సీఎం కేసీఆర్‌ నీళ్లకు ఢోకా లేదని హామీనిచ్చారు.వనపర్తి జిల్లాలో మెజారిటీ ఆయకట్టు జూరాల ఎడమ కాలువ, భీమా ఫేజ్‌-2, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల ద్వారా సాగవుతోంది. రబీలో ప్రధాన పంటలైన వేరుశనగ ఇప్పటికే పూర్తికాగా, వరి మాత్రమే ఉంది. అది కూడా మరో వారం రోజులపాటు తడులు ఇస్తే సరిపోతుంది. ఈ క్రమంలో సీఎం శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో స్పష్టమైన హామీ ఇచ్చారు.


ఏప్రిల్‌ 10వ తేదీ వరకు అవసరాన్ని బట్టి, నీటి నిల్వను బట్టి పూర్తిస్థాయిలో, లేదా ఆన్‌అండ్‌ఆఫ్‌ పద్ధతిలో కాలువలకు నీటిని సరఫరా చేయనున్నారు. ప్రస్తుతం జిల్లాలో భీమా, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల కింద దాదాపు వరి చివరి దశకు వచ్చింది. ఏప్రిల్‌ మొదటివారం నుంచి కోతలు ప్రారంభం కానున్నాయి. గోపాల్‌పేట, వనపర్తి, ఖిల్లాఘణపురం, పెద్దమందడి, పాన్‌గల్‌ మండలాల్లో సాగైన వరి, ఏప్రిల్‌ 10 వరకు మెజారిటీ కోతలు పూర్తికానున్నాయి. ఈ మండలాల్లో దాదాపు 40 వేల ఎకరాల్లో వరిసాగు జరిగింది.


ఇందులో మెజారిటీ పూర్తయితే.. ఇక మిగిలేది జూరాల ఎడమ కాలువ, వాటి ఆధారంగా ఉన్న చెరువుల కింద ఉన్న దాదాపు 55 వేల ఎకరాలో వరికి మరికొద్దిరోజులు తడులు అందాలి. ఏప్రిల్‌ రెండో వారం నుంచి కోతలు వీటికింద ప్రారంభంకానున్న నేపథ్యంలో ఏప్రిల్‌ మొదటి వారం వరకు నీళ్లు అందాల్సి ఉంటుంది. సీఎం హామీ నేపథ్యంలో జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేదు. 


Updated Date - 2020-03-28T12:08:10+05:30 IST