వైసీపీకి ఓట్లు వేయలేదని..

ABN , First Publish Date - 2021-07-13T06:21:05+05:30 IST

గత ఏడాది..

వైసీపీకి ఓట్లు వేయలేదని..
అధికారులను నిలదీస్తున్న బాధితులు

జగనన్న చేయూత నుంచి తొలగింపు

సచివాలయం వద్ద ధర్నా.. కార్యాలయానికి తాళం


పత్తికొండ(కర్నూలు): గత ఏడాది జగనన్న చేయూత పథకం జాబితాలో పేర్లు ఉన్నాయి. ఈ ఏడాది 33 మంది పేర్లు తొలగించారు. దీంతో బాధిత మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్‌ ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు వేయలేదన్న కారణంగా తమకు అన్యాయం చేశారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో మహిళలు టీడీపీ ఆధ్వర్యంలో సోమవారం సచివాలయానికి తాళం వేసి ఆందోళన చేపట్టారు. పత్తికొండ మండలం పందికోన గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో గత ఏడాది జగనన్న చేయూత పథకం కింద 203 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ ఏడాది జూన్‌ నెలలో మరోసారి లబ్ధిదారుల జాబితాను రెన్యువల్‌ చేయాల్సి ఉంటుంది. వలంటీర్ల ద్వారా సర్వే చేయించి సచివాలయ సిబ్బంది ఎంపీడీవో ఫార్మాట్‌కు జాబితాను పంపితే ఆమోద ముద్ర వేయాలి.


అయితే గత ఏడాది జరిగిన సర్పంచ్‌ ఎన్నికలలో పందికోన గ్రామంలో వైసీపీ మద్దతుదారు సర్పంచ్‌ అభ్యర్థి ఓడిపోవడంతో ఓ అధికార పార్టీ నాయకుడు వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ఎంపీడీవోపై ఒత్తిడి తెచ్చి తమ పేర్లు తొలగించారని బాధిత లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకుని 15రోజుల క్రితమే ఎంపీడీవో పార్థసారథి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీడీవోతో పాటు ఎస్‌ఐ భూపాలుడు గ్రామానికి వచ్చి మహిళలతో చర్చించారు. సమస్య పరిష్కారం చేసేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని మహిళలు స్పష్టం చేశారు. ఎస్‌ఐ అధికారులతో చర్చలు జరిపి జాబితాలో లేని వారు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం మహిళలు ఆందోళన విరమించారు. 


పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం

ఆందోళన చేసిన సమయంలో పంచాయతీ కార్యదర్శి సుధాకర్‌ తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి అన్యాయం చేయడమే కాకుండా దురుసుగా ప్రవర్తిస్తావా అంటూ మండిపడ్డారు. ఎస్‌ఐ జోక్యం చేసుకుని మహిళలకు నచ్చజెప్పారు. 


వలంటీర్‌ ఉద్యోగం తొలగించారు

జగన్‌కు ఎప్పటి నుంచే మా కుటుంబం ఓటు వేస్తోంది. ఇందులో భాగంగానే వలంటీర్‌ ఉద్యోగం మా కోడలికి ఇచ్చారు. కాలనీలో టీడీపీ వారిని లబ్ధిదారుల జిబితా నుంచి తొలగించాలని నా కోడలిపై నాయకులు ఒత్తిడి తెచ్చారు. అలా చేయడం కుదరదని చెప్పడంతో.. నా కోడలును వలంటీర్‌ ఉద్యోగం నుంచి తొలగించారు. జగనన్న చేయూత పథకం నుంచి నన్ను కూడా ఏకపక్షంగా తొలగించారు. అధికార పార్టీ నాయకులు ప్రజలకు ఇబ్బందులు గురి చేస్తున్నారు.          

-లక్ష్మి, పందికోన 


ఓటు వేయలేదని తొలగించారు

జగనన్న చేయూత పథకంలో ఈ ఏడాది నా పేరు లేకపోవడంతో సచివాలయం అధికారులను అడిగాను. నాయకులు చెప్పిన వారిని ఎంపిక చేశామని వారు చెప్పారు. అనంతరం అధికార పార్టీ నాయకుడి ఇంటికి వెళ్లి నా పేరు ఎందుకు తొలగించారని అడిగితే.. సర్పంచ్‌ ఎన్నికలలో రూ.40లక్షలు ఖర్చు పెట్టి ఓడిపోయామని, డబ్బులు అందకపోతే బాధ ఎలా ఉంటుందో మీకు తెలవాలన్న ఉద్దేశంతో పేర్లను తొలగించానని చెప్పారు.                             

  -పుష్పావతి, పందికోన 

Updated Date - 2021-07-13T06:21:05+05:30 IST