KTR ఏడు వేల కోట్లకు పైగా విజ్ఞప్తులపై కరుణ చూపని నిర్మల..!

ABN , First Publish Date - 2022-02-02T14:08:54+05:30 IST

KTR ఏడు వేల కోట్లకు పైగా విజ్ఞప్తులపై కరుణ చూపని నిర్మల..!

KTR ఏడు వేల కోట్లకు పైగా విజ్ఞప్తులపై కరుణ చూపని నిర్మల..!

  • అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు సహకరించాలన్న కేటీఆర్‌
  • ఎస్‌ఆర్‌డీపీ, లింక్‌ రోడ్లు, మురుగు నీటి నిర్వహణ కోసం లేఖ

హైదరాబాద్‌ సిటీ : మహానగర అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. రహదారుల వ్యవస్థ మెరుగుదల, వంతెనలు, అండర్‌పాస్‌ల నిర్మాణం, మురుగు నీటి నిర్వహణకు నిధుల కేటాయింపులో మొండి చేయి చూపారు. నగరంలో చేపట్టి పలు ప్రాజెక్టులకు కేంద్ర వాటాగా నిధులు కేటాయించాలని కోరుతూ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. మొత్తం ఎంత ఖర్చవుతుంది, కేంద్రం నుంచి ఎంత మేర నిధులు కావాలో వివరించారు. కేటీఆర్‌ విజ్ఞప్తిపై కేంద్ర ఆర్థిక శాఖ కరుణ చూపలేదు. హైదరాబాద్‌కు సంబంధించి ప్రత్యేక కేటాయింపులు బడ్జెట్‌లో లేవు.


నగరంలో సిగ్నల్‌ చిక్కులు లేని ప్రయాణం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఆర్‌డీపీ) రెండో దశ పనులకు రూ.14 వేల కోట్లు, మూసీకి ఇరువైపులా 16 కి.మీల మేర రోడ్ల నిర్మాణానికి రూ.11,500 కోట్లు, ప్యారడైజ్‌ నుంచి శామీర్‌పేట ఓఆర్‌ఆర్‌, ప్యారడైజ్‌ నుంచి కండ్లకోయ జంక్షన్‌ వరకు సికింద్రాబాద్‌లోని నిర్మించ తలపెట్టిన ఎలివేటెడ్‌ కారిడార్లకు రక్షణ శాఖ స్థలాలు అవసరమని, ఆస్తుల సేకరణ మినహా ప్రాజెక్టు వ్యయం రూ.9 వేల కోట్లుగా ఉందని పేర్కొన్నారు. ఎస్‌ఆర్‌డీపీ మొత్తం వ్యయం రూ.34 వేల కోట్లు కాగా, కేంద్రం వాటాగా 10 శాతం (రూ.3450) కోట్లు ఇవ్వాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. 


ప్రధాన రహదారులపై ఒత్తిడి తగ్గించేందుకు ప్రతిపాదించిన మిస్సింగ్‌/లింక్‌ రోడ్ల నిర్మాణానికి 2,400 కోట్లు ఖర్చవుతుందని, ఇందులో ఒక వంతు రూ.800 కోట్లు మంజూరు చేయాలన్నారు. సమగ్ర మురుగు నీటి మాస్టర్‌ ప్లాన్‌ (సీఎ్‌సఎంపీ)లో భాగంగా 62 సివరేజీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు (ఎస్‌టీపీ), డ్రైన్‌ల నిర్మాణానికి రూ.8,684.54 కోట్లు అవసరమని, ఇందులో ఒక వంతుగా కేంద్రం రూ.2,895 కోట్లు కేటాయించాలని కోరారు. నగరానికి పశ్చిమాన శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న కోకాపేటలో మ్యాన్‌ ర్యాపిడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌ (ఎంఆర్‌టీఎస్‌) నిర్మాణానికి రూ.3050 కోట్లు ఖర్చు కానుందని, ఇందులో 15 శాతం 450 కోట్లు మంజూరు చేయాలన్నారు. ఇందులో ఏ ఒక్క ప్రాజెక్టుకూ కేంద్రం నిధులు కేటాయించలేదు.


దరిద్రపుగొట్టు బడ్జెట్‌ 

అన్ని వర్గాల ప్రజలను నిరాశకు గురి చేసిన దరిద్రపుగొట్టు బడ్జెట్‌గా ఇది చరిత్రలో నిలిచిపోతుంది. దేశంలోని ఏ వర్గానికి చెందిన ప్రజలు కూడా ఈ బడ్జెట్‌తో సంతోషంగా లేరు. రైతాంగాన్ని విస్మరించారు. హైదరాబాద్‌ గురించి ఊసే లేదు. రోజూ ప్రగల్భాలు పలికే కేంద్ర మంత్రి, ఇతర బీజేపీ నేతలు రేపటి నుంచి ఏ మొహం పెట్టుకుని ప్రజల్లో తిరుగుతారో చూడాలి. - తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మంత్రి.


బడ్జెట్‌లో హైదరాబాద్‌కు కేంద్రం దగా..

అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధిపథంలో పురోగమిస్తున్న హైదరాబాద్‌కు అండగా నిలవాల్సింది పోయి.. పైసా కేటాయించకుండా కేంద్రంలోని బీజేపీ సర్కారు దగా చేసింది. రహదారులు, రవాణా వ్యవస్థ, మురుగు నీటి నిర్వహణ, మూసీ ప్రక్షాళన వంటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదు. మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తులను పట్టించుకోలేదు. రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి వెళ్తున్న ఆదాయంలో సగం కూడా తెలంగాణకు కేటాయించడం లేదు. - మాగంటి గోపీనాథ్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే.


అభివృద్ధికి నిధులు లేవు..

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ పేదోడిని నిరాశపరిచింది. ఇది కార్పొరేట్‌ కంపెనీల బడ్జెట్‌. ఉపాధి అవకాశాల మెరుగుకు చర్యలు తీసుకోలేదు. హైదరాబాద్‌ అభివృద్ధికి ఎలాంటి నిధు లూ లేవు. అల్లీకి అల్లి.. సున్నకు సున్నాగా ఉంది. రూ.75 లక్షల కోట్ల అప్పులు పెరిగిపోయి దేశ ఆర్థిక వ్యవస్థను నరేంద్ర మోదీ ప్రభుత్వ నాశనం చేసింది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే తానులోని ముక్కలే. - అంజన్‌కుమార్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, గ్రేటర్‌ ఇన్‌చార్జి.


ప్రగతిశీల బడ్జెట్‌..

దేశాభివృద్ధికి దోహదపడేలా బడ్జెట్‌ ఉంది. ఇది ప్రగతిశీల బడ్జె ట్‌. దేశాన్ని ఆర్థిక మాంద్యం నుంచి బయటకు తీసుకురావడానికి బడ్జెట్‌ ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రజలపై భారాలు వేయ లేదు. 25 ఏళ్ల దశ, దిశను చూపించే బడ్జెట్‌ ఇది. రోడ్లు, రహదారులు, డిజిటలైజేషన్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. నదుల అను సంధానం చారిత్రక నిర్ణయం. - ఎన్‌. రామచందర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ.


నిర్మాణ రంగానికి ప్రయోజనం లేదు..

గృహ నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. 60 చదరపు మీటర్ల ఫ్లాట్‌ను రూ.45 లక్షలకు అందించాలని కేంద్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. ప్రస్తుతం దాన్నే కొనసాగింపుగా పేర్కొంటోంది. బడ్జెట్‌లో నిర్మాణ సామగ్రి ధరలు దిగిరాలేదు. 90 చదరపు మీటర్ల ఫ్లాట్‌కు రూ.70 లక్షల ధర నిర్ణయిస్తుందని భావించాం. ఆ దిశగా నిర్ణయం తీసుకోలేదు. - ఎన్‌.ఇంద్రసేనారెడ్డి, క్రెడాయ్‌ తెలంగాణ ప్రధాన కార్యదర్శి.

Updated Date - 2022-02-02T14:08:54+05:30 IST