Advertisement
Advertisement
Abn logo
Advertisement

నో.. యూనిఫామ్స్‌..


- ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేయని ప్రభుత్వం

- రంగు రంగుల దుస్తుల్లోనే పాఠశాలలకు విద్యార్థులు


(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా అందజేసే యూనిఫామ్‌లను ఇవ్వక పోవడంతో విద్యార్థులు రంగు రంగుల దుస్తులు వేసుకుని పాఠశాలలకు వస్తున్నారు. దీంతో పాఠశాలల్లో ఏక రూపదుస్తులు లేకపోవడంతో ఐక్యత దెబ్బతింటున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఏక రూప దుస్తులను ప్రతి ఏటా ఉచితంగా అందజేస్తున్నది. ఒక్కో విద్యార్థికి రెండు జతల దుస్తులను ఇస్తున్నారు. ఏక రూప దుస్తుల వల్ల విద్యార్థులంతా ఒక్కటేననే భావనతో పాటు తరతమ భేదాలు లేకుండా కనబడతారు. కుటుంబ ఆర్థిక స్థితిగతుల ప్రభావం కూడా విద్యార్థులపై ఏమి లేకుండా పోతుంది. ప్రపంచ వ్యాప్తంగా గత ఏడాది నుంచి కరోనా వ్యాప్తి చెందడంతో మార్చి 22 నుంచి లాక్‌ డౌన్‌ విధించారు. అప్పటి నుంచి పాఠశాలలు తెరుచుకోలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో విద్యాసంస్థలను తెరిచినప్పటికీ, పదిహేను రోజులైనా గడవక ముందే సెకండ్‌ వేవ్‌ కరోనా విజృంభించడంతో విద్యాసంస్థలను మూసి వేశారు. సెకండ్‌ వేవ్‌ తగ్గిన తర్వాత సెప్టెంబరు 1వ తేదీ నుంచి విద్యా సంస్థలను తెరిచారు. గడిచిన విద్యా సంవత్సరానికి గాను ఏకరూప దుస్తులను విద్యార్థులకు అందజేసినప్పటికీ ఈ విద్యా సంవత్సరానికి ప్రభుత్వం సరఫరా చేయలేదు. కరోనా ప్రభావంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. 

- 35,339 మంది విద్యార్థులు

జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 15,535 మంది విద్యార్థులు ఉండగా, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6,570 మంది, ఉన్నత పాఠశాలల్లో 13,234 మంది, మొత్తం 35,339 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ ప్రభుత్వం రెండు జతల దుస్తులను సమకూర్చాల్సి ఉండగా, పాఠశాలలు ఆరంభమై మూడు నెలలు గడుస్తున్నా కూడా ఇంకా సరఫరా చేయలేదు. దీంతో చాలా మంది విద్యార్థులు రంగు రంగు దుస్తులను ధరించి పాఠశాలలకు వస్తుండగా, మరికొందరు గత ఏడాది సరఫరా చేసిన ఏక రూప దుస్తులను ధరించి వస్తున్నారు. కరోనా కారణంగా గత ఏడాది పాఠశాలలు నడవకున్నా ప్రభుత్వం దుస్తులను సరఫరా చేసింది. ఆ దుస్తులను విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులు వినే సమయంలో ధరించారు. ఖాళీ సమయంలో కూడా వాటిని ధరించారు. అవి ప్రస్తుతానికి పాత బడి పోయాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ విద్యా సంవత్సరానికి ఏక రూప దుస్తులను సరపరా చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయమై పెద్దపల్లి జిల్లా విద్యాశాఖాధికారి మాధవిని ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా, ప్రభుత్వానికి ఏక రూప దుస్తుల గురించి ప్రతిపాదనలను పంపించామని తెలిపారు. 

Advertisement
Advertisement