అత్యవసరం కాని ప్రయాణాలు మానుకోండి

ABN , First Publish Date - 2021-12-18T07:26:04+05:30 IST

దేశంలో ఒమైక్రాన్‌ కేసులు రోజురోజుకు పెరుగుతుండడం.. ప్రపంచవ్యాప్తంగానూ వ్యాప్తి ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది....

అత్యవసరం కాని ప్రయాణాలు మానుకోండి

కొత్త సంవత్సర వేడుకలను తక్కువ మందితో జరుపుకోండి

113కి ఒమైక్రాన్‌ కేసులు.. యూపీలో తొలిసారి రెండు

ఒకేచోట గుంపులుగా చేరొద్దు.. కేంద్రం సూచనలు

మిస్‌ ఇండియాకు కరోనా.. మిస్‌ వరల్డ్‌ ఫైనల్స్‌ వాయిదా

యూకే పరిస్థితి మనకొస్తే రోజూ 14 లక్షల కేసులు: వీకే పాల్‌


న్యూఢిల్లీ, డిసెంబరు 17: దేశంలో ఒమైక్రాన్‌ కేసులు రోజురోజుకు పెరుగుతుండడం.. ప్రపంచవ్యాప్తంగానూ వ్యాప్తి ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అత్యవసరం కాని ప్రయాణాలను మానుకోవాలని, కొత్త సంవత్సర వేడుకలను నిరాడంబరంగా జరుపుకోవాలని, గుంపులుగా చేరొద్దని ప్రజలకు సూచించింది. గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌, నీతీ ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ మీడియాతో మాట్లాడారు. యూర్‌పలో, మరికొన్ని దేశాల్లో ఒమైక్రాన్‌ అతి వేగంగా వ్యాపిస్తోందని వివరించారు. దక్షిణాఫ్రికాలో డెల్టా ప్రభావం తగ్గిందని.. ఒమైక్రాన్‌ విస్తరిస్తోందని డబ్ల్యూహెచ్‌వో చేసిన హెచ్చరికలను ప్రస్తావించారు. ఒమైక్రాన్‌ సామాజిక వ్యాప్తి ప్రారంభమైతే డెల్టాను మించిపోతుందని  చెప్పిన సంగతిని గుర్తుచేశారు. ఇప్పటివరకైతే దేశంలో ఒమైక్రాన్‌ సామాజిక వ్యాప్తి లేదని లవ్‌ అగర్వాల్‌ స్పష్టం చేశారు. కొవిడ్‌కు మాత్రను అందుబాటులోకి తెచ్చే అంశమై చర్యలు కొనసాగుతున్నాయన్నారు.


యూకే, ఫ్రాన్స్‌ పరిస్థితి మనకొస్తే..

యూకే, ఫ్రాన్స్‌లో ఒమైక్రాన్‌, కరోనా రెండూ విజృంభిస్తున్నాయని.. ఆ పరిస్థితి భారత్‌లో వస్తే రోజుకు లక్షలాది కేసులు నమోదవుతాయని పాల్‌ పేర్కొన్నారు. యూర్‌పలో 80 శాతం ప్రజలకు వ్యాక్సిన్‌ వేసిన విషయాన్ని గుర్తుచేశారు. యూకేలో రోజుకు 90 వేల కేసులు వస్తున్నాయని అదే తరహాలో మనదగ్గర వ్యాప్తి ఉంటే రోజుకు 14 లక్షల కేసులు నమోదవుతాయని హెచ్చరించారు. ఫ్రాన్స్‌లో రోజుకు 65 వేల పాజిటివ్‌లు వస్తున్నాయని.. భారత్‌లో వ్యాప్తి ఇలానే ఉంటే రోజుకు 13 లక్షల కేసులు వస్తాయని పాల్‌ అన్నారు. దేశంలో ఒమైక్రాన్‌ కేసుల సంఖ్య 113కి పెరిగింది. శుక్రవారం ఒక్క రోజే 26 నమోదయ్యాయి. ఢిల్లీలో 12, మహారాష్ట్రలో 8, యూపీ ఘజియాబాద్‌లో తొలిసారి 2 కేసులు నమోదయ్యాయి. మిస్‌ వరల్డ్‌ ఫైనల్స్‌లో పాల్గొంటున్న మిస్‌ ఇండియా- 2021 మానసి వారాణసితో పాటు పలువురికి కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. పోటీలను 3 నెలలు వాయిదా వేశారు. 


 తమ స్పుత్నిక్‌-వి టీకా ఒమైక్రాన్‌పై సమర్థంగా పనిచేస్తోందని రష్యా ప్రభుత్వం ప్రకటించింది. ఇతర టీకాల కంటే 3 రెట్ల నుంచి 7 రెట్లు బాగా పనిచేస్తుందని పేర్కొంది. ఎంఆర్‌ఎన్‌ఏ టీకాల కంటే మెరుగైన ప్రభావం చూపుతోందని చెప్పింది. కాగా, జాన్సన్‌ టీకా వేసుకున్నవారిలో రక్తం గడ్డకట్టి 9 మంది చనిపోవడంతో.. దాని స్థానంలో ఫైజర్‌, మోడెర్నా టీకాలు ఇవ్వాలని అమెరికా సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (సీడీసీ) ప్రతిపాదించింది.

Updated Date - 2021-12-18T07:26:04+05:30 IST