మూడు రాజధానులు వద్దు..

ABN , First Publish Date - 2020-08-02T11:09:04+05:30 IST

రాజధాని వికేంద్రీకరణ తగదని, మూడు రాజధానులు వద్దని టీడీపీ శ్రేణలు నిరసన వ్యక్తం చేశాయి. ప్రతిపక్షంలో ఉండగా రాజధానిగా అమరావతిని ...

మూడు రాజధానులు వద్దు..

రాజధాని వికేంద్రీకరణ సరికాదు 

ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడమే 

టీడీపీ నిరసన ప్రదర్శనలు


రాజధాని వికేంద్రీకరణ తగదని, మూడు రాజధానులు వద్దని టీడీపీ శ్రేణలు నిరసన వ్యక్తం చేశాయి. ప్రతిపక్షంలో ఉండగా రాజధానిగా అమరావతిని స్వాగతించిన వారు ఇప్పుడు ఎందుకు మూడు ముక్కలు చేస్తున్నారని ప్రశ్నించారు. మాట తప్పం, మడమ తిప్పం అంటూ ప్రగల్భాలు పలికిన అధికార పార్టీ నేతలు స్వప్రయోజనాల కోసం ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ కబ్జాలకు అనువుగా మూడు రాజధానులను తెరపైకి తెచ్చారని టీడీపీ నేతలు ఆరోపించారు. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లుకు గవర్నర్‌ ఆమోద ముద్ర వేయడం విచారకరమన్నారు.


పాలకొల్లు టౌన్‌, ఆగస్టు 1: రాజధాని వికేంద్రీకరణపై పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నిరసన వ్యక్తం చేశారు. రైతులతో కలిసి కాటన్‌ విగ్రహం వద్దకు పాదయాత్రగా వెళ్లి సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాటన్‌ విగ్రహం వద్దకు వెళుతున్న ఎమ్మెల్యేను పట్టణ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కలెక్టర్‌, ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడిన అనంతరం ఆయనను అనుమతించారు.


భీమడోలు: సీఆర్‌డీఏ చట్టం రద్దు, మూడు రాజధానుల బిల్లు ఆమో దం తెలపడానికి నిరసనగా కళ్లకు నల్లరిబ్బన్లు కట్టుకుని ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం ఈ అంశంపై జోక్యం చేసుకోవాలని కోరారు. 


దేవరపల్లి: మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు శనివారం దేవర పల్లిలో తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. విశాఖలో భూ కబ్జాల కోసమే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. 


భీమవరం టౌన్‌ : వికేంద్రీకరణ బిల్లు ఆమోదం రాష్ట్ర చరిత్రలో చీకటి రోజని కోళ్ల నాగేశ్వరరావు అన్నారు. బిల్లు ఆమోదానికి నిరశనగా నియోజకవర్గ నాయకులతో కలసి నిరసన వ్యక్తం చేశారు.


జీలుగుమిల్లి : అమరావతి రాజధానిగా ప్రతిపక్ష నేతగా ఒప్పుకున్న సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చడం దారుణమని టీడీపీ నాయకులు అన్నారు. జీలుగుమిల్లిలో సుంకవల్లి సాయి ఇంటి వద్ద శనివారం టీడీపీ నాయకులు నిరసన తెలిపారు.


పోలవరం: విభజించు పాలించు అనే బ్రిటిష్‌ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అవలంభించడం తగదని టీడీపీ నియోజకవర్గ కన్వీనర్‌ గొరగం శ్రీనివాస్‌ హితవు పలికారు. శనివారం మూడు రాజధానుల బిల్లు ఆమో దానికి నిరసనగా ఏటిగట్టు సెంటర్‌లో ఆందోళన నిర్వహించారు.


కామవరపుకోట: అమరావతిలో స్వచ్ఛందంగా భూమిలిచ్చిన రైతుల పరిస్థితి పరిగణలోకి తీసుకోకుండా మరణశాసనం రాసిన పాలకుల వైఖరి గర్హణీయమని మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ అన్నారు. 


టి.నరసాపురం: మూడు రాజధానుల బిల్లుపై గవర్నర్‌ నిర్ణయం చారిత్రక తప్పిదమని టీడీపీ నాయకులు పిన్నమనేని మధుసూదన, మాజీ ఎంపీపీ శీలం వెంకటేశ్వరరావు అన్నారు. 


గోపాలపురం: మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా చదలవాడ ప్రసాద్‌ నివాసం వద్ద మేని సుధాకర్‌ ఆధ్వర్యంలో కళ్లకు నల్లరిబ్బన్లు కట్టుకు ని శనివారం నిరసన వ్యక్తం చేశారు.


కొవ్వూరు: మూడు రాజధానుల బిల్లుపై గవర్నర్‌ ఆమోదముద్ర వేయడం బాధాకరమని కొవ్వూరు మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ సూరపనేని చిన్ని అన్నారు. శనివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు.


చింతలపూడి: రాజధాని రైతులను, రాష్ట్ర ప్రజలను జగన్‌ ప్రభుత్వం నట్టేట ముంచిందని నియోజకవర్గ టీడీపీ కన్వీనర్‌ కర్రా రాజారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం పార్టీ శ్రేణులతో నిరసన ప్రదర్శన జరిపారు. 


జంగారెడ్డిగూడెం: రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుతో రాష్ట్ర భవిష్యత్‌కు తీవ్ర నష్టం జరుగుతుందని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండవ లక్ష్మణరావు అన్నారు. శనివారం జంగారెడ్డిగూడెంలో తన ఇంటి వద్ద మూడు రాజధానుల నిర్ణయాన్ని నిరసిస్తూ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. 


పెనుగొండ : మూడు రాజధానుల బిల్లుపై గవర్నర్‌ ఆమోద ముద్ర బాధాకరమని టీడీపీ నాయకుడు ఉప్పలపాటి చంటి అన్నారు. పెనుగొండ మండలం వడలిలో టీడీపీ కార్యాలయంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. 


ఏలూరు రూరల్‌ : మూడు రాజధానుల బిల్లును గవర్నర్‌ ఆమోదించ డం అన్యాయమని టీడీపీ నియోజకవర్గ కన్వీనర్‌ బడేటి చంటి అన్నారు. రాజధాని వికేంద్రీకరణపై నిరసన వ్యక్తం చేశారు.

Updated Date - 2020-08-02T11:09:04+05:30 IST