అయ్యో...ర్లు

ABN , First Publish Date - 2022-09-05T05:14:46+05:30 IST

గురు పూజోత్సవ వేడుకలకు ఈదఫా గురువుల్లోనే ఉత్సాహం ఒకింత కరవైంది.

అయ్యో...ర్లు

గురు పూజోత్సవాలపై అయోమయం

ఉత్తమ పురస్కారాలను తిరస్కరించే గురువులెందరు ?

వేడుకలకు రమ్మని విద్యాశాఖ..వద్దని పలు ఉపాధ్యాయ సంఘాలు

మండలాలు, పాఠశాలల్లోనూ ఎవరి దారి వారిదే 


ఏలూరు ఎడ్యుకేషన్‌, సెప్టెంబరు 4 :  గురు పూజోత్సవ వేడుకలకు ఈదఫా గురువుల్లోనే ఉత్సాహం ఒకింత కరవైంది. కొంతకాలంగా ప్రభుత్వం అనుసరిస్తోన్న అణచివేత వైఖరితో విసిగిపోయిన ఉపాధ్యాయుల్లో ఆగ్రహావేశాలే కారణమని చెప్పాలి. ఈనేపథ్యంలో సోమవారం నిర్వహించనున్న టీచర్స్‌ డే జిల్లాలో ఆనవాయితీకి భిన్నంగా జరుగనున్నాయి. ఇప్పటికే గురుపూజోత్సవ వేడుకలతో పాటు, ఉత్తమ ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ ఇచ్చే పురస్కారాల కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు పలు ఉపాధ్యాయ సంఘాలు డీఈవో గంగాభవానికి నోటీసు అందజేసిన విషయం విధితమే. దీనికి అనుగుణంగానే బహిష్కరణకు కట్టుబడి ఉండాల్సిందిగా టీచర్లను సమాయత్తం చేసేపనిలో వివిధ సంఘాల నేతలు నిమగ్నమయ్యారు. ఇటీవల జరిగిన సీపీఎస్‌ ఆందోళన సందర్బంగా ప్రభుత్వం, పోలీసులు ఉపాధ్యాయుల పట్ల అనుసరించిన నిర్బందపు చర్యలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్ళి, ప్రభుత్వ వ్యతిరేకతను స్పష్టంగా అందరికీ తెలియజేయడానికి గురుపూజోత్సవ వేడుకలను బహిష్కరించాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో టీచర్‌ యూనియన్‌ నాయకుల ఆదేశాలను ఎంతమంది ఉపాధ్యాయులు పాటిస్తారన్నది సోమవారం తెలిసిపోతుంది.

వస్తున్నారు కదా.. ఫోన్లలో ఆరా

ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను తిరస్కరించడం ద్వారా ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయాలన్నది పలు ఉపాధ్యాయ సంఘాల వ్యూహంగా ఉంది. ఆ మేరకు ఏలూరు జిల్లాలో ఉత్తమ పురస్కారాలకు ఎంపికైన 12 మంది టీచర్లను ఫోన్‌ ద్వారా లేదా నేరుగా కలుసుకుని కౌన్సెలింగ్‌ చేయడం ద్వారా అవార్డులను తిరస్కరించాల్సిందిగా కొన్నిసంఘాల నాయకులు ఆదివారం ప్రయత్నాలు చేశారు. అదేసమయంలో ప్రభుత్వ కార్యక్రమాన్ని ఎలాగైనా నిర్వహించాలన్న పట్టుదలతో జిల్లా విద్యాశాఖ యంత్రాంగం తన ప్రయత్నాలను చేసింది. ఈ క్రమంలో నేరుగా 12 మంది అవార్డు గ్రహీతలకు ఆదివారం ఫోన్లు చేసి గురుపూజోత్సవ అవార్డులకు వస్తున్నదీ, లేనిదీ నిర్దారించుకుంది. అంతా ఓకే అన్నట్టుగా భరోసా లభించడంతో జిల్లా అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఉపాధ్యాయ సంఘాల నుంచి గాని, మరోవిధంగా గాని గురు పూజోత్సవంలో అకస్మాత్తుగా ఏవైనా ఆటంకాలు రావచ్చునన్న అనుమానంతో అవార్డులు అందజేసే ఏలూరు జడ్పీ మీటింగ్‌హాలు వద్ద ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే అవార్డు గ్రహీతలతో పాటు,వారి బంధువులు, పరిమిత సంఖ్యలో టీచర్లను మాత్రమే అనుమతించే అవకాశాలున్నాయి. మొత్తంమీద హాలు సామర్థ్యం 170 మందివరకు మాత్రమే అనుమతిస్తారు. ఇక పోలీసు తనిఖీలు, వేడుకలు జరిగే ప్రాంగణం వద్ద విస్తృత పోలీసు పహారా ఎలాగూ ఉంటుంది. ఈ విధంగా గురుపూజోత్సవాన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ముగించాలన్నది విద్యాశాఖ వ్యూహంగా ఉంది.

మండల, పాఠశాలస్థాయిల్లోనూ అయోమయమే

జిల్లాస్థాయి అవార్డుల కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు తేల్చిచెప్పిన ఉపాధ్యాయ సంఘాలు మండలస్థాయిలో స్కూల్‌ కాంప్లెక్సులలో నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఈసారి జరపవద్దని తమకేడర్‌కు సూచించాయి. దీనికనుగుణంగానే పలువురు ఎంఈవోలకు బహిష్కరణ నిర్ణయాన్ని ఇప్పటికే తెలియజేశాయి. వాస్తవానికి ఏటా మండలస్థాయిలో స్కూల్‌ కాంప్లెక్సులలో నిర్వహించుకునే వేడుకలకు టీచర్లే డబ్బులు వేసుకుని కాంప్లెక్స్‌లో ఉత్తమ పనితీరు కనబరచిన ఇద్దరు ఉపాధ్యాయులు చొప్పున ఎంపిక చేసుకుని స్థానిక ప్రజాప్రతినిదులు, ఎంఈవోలను ఆహ్వానించి సత్కార కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటాయి. అయితే ఈ ఏడాది పరిస్థితులు భిన్నంగా ఉండటంతో నిర్వహించడం లేదని కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు చెబుతున్నారు. ఇదే పరిస్థితి పాఠశాలల్లోనూ ఉంది. స్కూలుపిల్లలే తమ గురువులను సత్కరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ దఫామాత్రం ఆ పరిస్థితులు చాలాచోట్ల కనిపించడం లేదని ఓ ఎంఈవో చెప్పారు.  రాష్ట్ర, జిల్లా, మండలస్థాయిల్లో గురుపూజోత్సవ వేడుకలను బహిష్కరిస్తున్నందున పాఠశాలస్థాయిలో మాత్రం జరుపుకునేందుకు కొందరు ప్రధానోపాద్యాయులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

కొందరు డ్రాప్‌ అవడం ఖాయం ? 

జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఎంపికైన 12 మందిలో ముగ్గురు అవార్డులను తిరస్కరించేందుకు అంగీకరించినట్టు ఓ ఉపాధ్యాయ సంఘనాయకుడు వెల్లడించారు. తటస్థంగా వున్న మరికొందరిని కూడా ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్టు వివరించారు. వాస్తవానికి అవార్డుల బహిష్కరణ పిలుపును దరఖాస్తులను విద్యాశాఖ ఆహ్వానించినపుడే ఇచ్చిఉంటే ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకునేవారు కాదని విశ్లేషించారు. కాగా సోమవారం నాడు అవార్డుల స్వీకరణకు ఎవరినీ వెళ్లవద్దని తాము బలవంతం చేయబోమని, సంఘాలుగా మాత్రమే తాము హాజరు కాబోమని ప్రధాన ఉపాధ్యాయ సంఘనాయకులు తెలిపారు. అలాగే నిరసన ప్రదర్శనలపై ఇంకా నిర్ణయమేదీ తీసుకోలేదని స్పష్టం చేశారు. గురుపూజోత్సవ వేడుకలకు యూనియన్లతో కనెక్ట్‌ అయినవారెవ్వరూ హాజరుకాబోరని వివరించారు.


Updated Date - 2022-09-05T05:14:46+05:30 IST