సెలవుల్లో సరుకు నిల్‌

ABN , First Publish Date - 2021-04-17T04:58:47+05:30 IST

రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ వచ్చినప్పటి నుంచి మందుబాబులకు అవస్థలు తప్పడం లేదు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో రోజుకో రకంగా అమ్మకపు వేళలు ఉంటున్నాయి.

సెలవుల్లో సరుకు నిల్‌

ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నో స్టాక్‌ 

బార్లలో మాత్రం ఫుల్‌...

మందు బాబులపై అదనపు బాదుడు


నెల్లూరు(క్రైం), ఏప్రిల్‌ 16 :

రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ వచ్చినప్పటి నుంచి మందుబాబులకు అవస్థలు తప్పడం లేదు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో రోజుకో రకంగా అమ్మకపు వేళలు ఉంటున్నాయి. తక్కువ ధర ఉన్న మద్యానికి ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తున్నారు.  శనివారం, ఆదివారాల్లో మద్యం ఉండటం లేదు. ఇక పండుగలు, సెలవు దినాల్లోనూ ప్రభుత్వ దుకాణాల్లో మద్యం ఉండదన్న భావన మందుబాబుల్లో ఏర్పడిపోయింది. దీనికి తగ్గట్లుగానే వారాంతాల్లో, సెలవు రోజుల్లో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సరుకు ఉండటం లేదు. సామాన్యులు కొనలేని ధర ఉన్న టీచర్స్‌, 100 పైపర్స్‌, మార్పియస్‌ వంటి ఖరీదైన బ్రాండ్లు మాత్రం కనిపిస్తున్నాయి. మందుబాబులు అంత రేటు పెట్టి మద్యం కొనుగోలు చేయలేక బార్లకు వెళుతున్నారు. కొందరు బ్లాక్‌లో మద్యం అమ్మే వారిని ఆశ్రయిస్తున్నారు.


వీకెండ్‌లో జోష్‌

సెలవు రోజులు, శని, ఆదివారాల్లో బార్ల వద్ద పండుగ వాతావరణం కనిపిస్తోంది.   ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారే వరకు బార్లలో అమ్మకాలు సాగుతున్నాయి. దూరప్రాంతాల నుంచి కూడా మందుబాబులు తరలివస్తున్నారు. ఇదే అదనుగా బార్ల నిర్వాహకులు ఎమ్మార్పీ కన్నా రూ.60 నుంచి 100 వరకు అధికంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అదే సెలవురోజుల్లో ప్రభుత్వ మద్యం దుకాణాలు మాత్రం ఖాళీగా కనిపిస్తున్నాయి. మందు కోసం వచ్చిన వారికి స్టాక్‌ లేదనే సమాధానంతోపాటు దగ్గరలోని బార్‌ అడ్రస్‌ కూడా షాపు సిబ్బందే చెబుతుండటం గమనార్హం. వ్యాపారం ఎక్కవ జరిగే రోజుల్లో ప్రభుత్వ దుకాణాల్లో మద్యం ఎందుకు ఉండటం లేదో, బార్లలో మాత్రం ఎందుకు నిండుగా ఉంటోందో అధికారులకే తెలియాలి.

Updated Date - 2021-04-17T04:58:47+05:30 IST