Abn logo
Apr 8 2021 @ 01:15AM

నో స్టాక్‌..!

టీకా కొరతతో కొన్ని వ్యాక్సిన్‌ కేంద్రాలు మూసేయాల్సి రావచ్చు: మహారాష్ట్ర

మా దగ్గరా అయిపోయాయి..అత్యవసరంగా కోటి డోసులు కావాలి: ఏపీ

తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, హరియాణా రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి

టీకాల కొరతేమీ లేదు: కేంద్ర ఆరోగ్యశాఖ

ఒత్తిడికి గురవుతున్నాం: కొవిషీల్డ్‌

ఉత్పత్తి పెంచడానికి 3వేల కోట్లు కావాలి

అదర్‌ పూనావాలా వెల్లడి

11 నుంచి ఆఫీసుల్లోనూ టీకాలు


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 7 : దేశంలో కరోనా కేసులు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. టీకా తీసుకునేందుకు మరిన్ని వర్గాల ప్రజలకు అవకాశం కల్పించిన నేపథ్యంలో.. వ్యాక్సినేషన్‌ రేటు గణనీయంగా పెరిగింది. తాజాగా గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 33.37 లక్షల మందికి వ్యాక్సినేషన్‌ చేయడం గమనార్హం. ఈనేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీ్‌సగఢ్‌, హరియాణా రాష్ట్రాల్లో టీకా డోసుల స్టాక్‌ పూర్తి కావచ్చింది. తమకు సరిపడా డోసులను సరఫరా చేయడం లేదంటూ ఈ రాష్ట్రాలు పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి మొరపెట్టుకున్నాయి. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలైతే ఈవిషయమై కేంద్ర ఆరోగ్యశాఖకు ఎస్‌ఓఎస్‌ అలర్ట్‌ను కూడా పంపాయి. గురువారంకల్లా రాష్ట్రంలో టీకా స్టాక్‌ అయిపోతుందని ఏపీ సర్కారు కేంద్రానికి తెలిపింది. ఇప్పటికే పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో ఒక్క డోసు కూడా అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది. అత్యవసర ప్రాతిపదికన వెంటనే రాష్ట్రానికి కోటి వ్యాక్సిన్‌ డోసులను పంపాలని కోరింది. ‘‘ప్రస్తుతం రాష్ట్రంలో 3.7 లక్షల టీకా డోసులే ఉన్నాయి. ప్రతిరోజు వ్యాక్సినేషన్‌కు 1.3 లక్షల డోసులు అవసరమవుతాయి.


కేసులు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో డోసుల అవసరం మరింత పెరగొచ్చు’’ అని ఏపీ వైద్యశాఖ అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇక మూడు రోజుల్లోగా రాష్ట్రంలో టీకా స్టాక్‌ అంతా అయిపోతుందని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్‌ తోపే వెల్లడించారు. ‘‘ప్రస్తుతం మా వద్ద 14 లక్షల టీకా డోసులే ఉన్నాయి. ఇవి మూడు రోజులకే సరిపోతాయి. ప్రతివారం మాకు 40 లక్షల డోసులు అవసరం. అవి అందకుంటే కొన్ని టీకా కేంద్రాలను మూసేయాల్సి రావచ్చు’’ అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రస్తుతం ఉన్న టీకాల స్టాక్‌ మూడు రోజులకు మించి రాకపోవచ్చని తెలుస్తోంది. దీంతో రాష్ట్రానికి ప్రతిరోజు 10 లక్షల మందికి వ్యాక్సినేషన్‌ చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ, కేవలం 60-70వేల మందికే టీకాలు ఇస్తున్నట్లు సమాచారం. కాగా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నగరంలో మొత్తం 66 టీకా కేంద్రాలుండగా 41 మూతపడటం గమనార్హం.


వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ‘మహా’ వ్యాఖ్యలు : హర్షవర్ధన్‌

దేశంలో టీకాలకు కొరత లేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ స్పష్టంచేశారు. అన్ని రాష్ట్రాలకు వాటి అవసరాల మేరకు డోసులను అందిస్తామని తెలిపారు. ఏ రాష్ట్రంలోనూ టీకాల కొరత రాకుండా చూస్తామన్నారు. వ్యాక్సినేషన్‌ విషయమై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాలపై హర్షవర్ధన్‌ మండిపడ్డారు. అందుబాటులో ఉన్న టీకా డోసులతో అర్హులైన ప్రాధాన్య వర్గాల ప్రజలకు టీకాలు వేయడంపై దృష్టిపెట్టకుండా.. 18 ఏళ్లకు పైబడిన వారందరికీ టీకాలు వేయాలని డిమాండ్‌ చేయడం సమంజసం కాదన్నారు. టీకాల కొరత ఉందంటూ తరుచూ ప్రకటనలు చేయడం ద్వారా.. కరోనా కట్టడిలో తన వైఫల్యాలను కప్పి పుచ్చుకునే ప్రయత్నంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆయన ఆరోపించారు. మహారాష్ట్ర అధికార యంత్రాంగం లంచాల కోసం ఆశపడి.. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఇన్‌స్టిట్యూషనల్‌ క్వారంటైన్‌ నుంచి మినహాయింపు కల్పిస్తుండటాన్ని ఆందోళన కలిగించే పరిణామంగా అభివర్ణించారు. 


అత్యవసర వినియోగ అనుమతులు లభించిన కొవాగ్జిన్‌ను వాడేందుకు ఛత్తీ్‌సగఢ్‌ సర్కారు తిరస్కరించడం ద్వారా.. ప్రజల్లోకి అభద్రతా భావాన్ని, తప్పుడు సమాచారాన్ని పంపిందని హర్షవర్ధన్‌ విమర్శించారు. కాగా, ప్రస్తుతం తమ కంపెనీ కొవిషీల్డ్‌ టీకా ఉత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉండటంతో.. దేశ అవసరాలకు సరిపడా డోసులను అందించే విషయంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అదర్‌ పూనావాలా తెలిపారు. ప్రస్తుతం ప్రతినెలా 6.5 కోట్ల కొవిషీల్డ్‌ డోసులనే ఉత్పత్తి చేస్తున్నామని, జూన్‌కల్లా దీన్ని 11 కోట్లకు పెంచేందుకు కేంద్రం నుంచి రూ.3వేల కోట్లు అవసరమవుతాయన్నారు. ఇక టీకా కావాలనే వారి కంటే.. అవసరమైన వారికి ఇచ్చేందుకే ప్రాధాన్యమిస్తామంటూ కేంద్రం చేసిన ప్రకటనపై కాంగ్రెస్‌ ముఖ్య నేత రాహుల్‌గాంధీ ఘాటుగా స్పం దించారు. అందరికీ టీకాలు అందాలని.. ప్రతి భారతీయుడికి ప్రాణాలను రక్షించుకునే అవకాశం లభించి తీరాలన్నారు. 

Advertisement
Advertisement
Advertisement