అతీగతీ లేని స్పైన్‌ సెంటర్‌

ABN , First Publish Date - 2022-05-20T06:25:27+05:30 IST

రాష్ట్రంలో స్పైనల్‌ ఇన్‌జ్యూరీ సెంటర్‌ ఏర్పాటు ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.

అతీగతీ లేని స్పైన్‌ సెంటర్‌

ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లో సెంటర్‌

నవ్యాంధ్రలో అందుబాటులో లేని వైనం

నాలుగేళ్ల కిందట మంజూరుకు ముందుకొచ్చిన కేంద్రం 

కేజీహెచ్‌లో ఏర్పాటుకు గత టీడీపీ ప్రభుత్వం ఏర్పాట్లు

విడుదల కాని నిధులు

ఏళ్లు గడుస్తున్నా కార్యరూపం దాల్చని పరిస్థితి 

ఆ కేంద్ర ఏర్పాటైతే వెన్ను సంబంధిత సమస్యలతో బాధపడే వారికి మెరుగైన చికిత్సకు అవకాశం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


రాష్ట్రంలో స్పైనల్‌ ఇన్‌జ్యూరీ సెంటర్‌ ఏర్పాటు ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లో స్పైనల్‌ ఇన్‌జ్యూరీ సెంటర్‌ ఉండేది. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో ఈ సెంటర్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ముందుకువచ్చింది. నాలుగేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వెన్ను సంబంధిత సమస్యలతో బాధపడే వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అవకాశం ఉండడంతో నాటి ప్రభుత్వం సెంటర్‌ ఏర్పాటుకు సంసిద్ధత తెలిపింది. కేజీహెచ్‌లోని ఎముకల విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఓ డాక్టర్‌ను నోడల్‌ అధికారిగా నియమించింది. అయితే అనంతరం ప్రభుత్వం మారడం, కేంద్రం కూడా నిధులు విడుదల చేయకపోవడంతో ఈ పనులు ముందుకుసాగలేదు.


ప్రతి రాష్ట్రానికీ ఒక కేంద్రం 

ప్రమాదంలో గాయపడడం, పుట్టుకతో లేదా ఇతర కారణాల వల్ల వెన్ను సంబంధిత సమస్యల బారిన పడిన వారికి మెరుగైన వైద్యాన్ని అందించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికో స్పైనల్‌ సెంటర్‌ను మంజూరు చేస్తోంది. అడ్వాన్స్‌డ్‌ కేర్‌ స్పైనల్‌ ఇన్‌జ్యూరీస్‌ అండ్‌ స్పైన్‌ కరక్షన్‌, రీహాబిలిటేషన్‌ సెంటర్‌ పేరుతో కేంద్రంలోని మినిస్ర్టీ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌ అండ్‌ ఎంపవర్‌మెంట్‌ వీటిని ఏర్పాటుచేస్తోంది. నాలుగేళ్ల కిందట సెంటర్‌ ఏర్పాటు కోసం కేజీహెచ్‌ అధికారులు ఓల్డ్‌ న్యూరో సర్జరీ విభాగంలో సౌ కర్యాలను కల్పించారు. ఆరు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వార్డును ఏర్పాటుచేశారు. వార్డు లేఅవుట్‌, ఆపరేషన్‌ థియేటర్‌ వివరాలను కేంద్రానికి పంపించారు. 


మెరుగైన వైద్య సేవలు

ఈ సెంటర్‌ ఏర్పాటైతే 12 పడకలతో ప్రత్యేకంగా ఓ వార్డు అందుబాటులోకి వస్తుంది. ఇందులో పది పడకల్లో రోగులకు అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరించనుంది. మిగిలిన రెండు పడకల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. మొదటి దశలో ప్రాజెక్టుకు అవసరమైన పరికరాలు, ఇతర మౌలిక వసతులు ఏర్పాటుచేస్తామని పేర్కొంది. సీ-ఆర్మ్‌, వెంటిలేటర్స్‌, స్పైన్‌ శస్త్ర చికిత్సలు నిర్వహించడానికి అవసరమైన పరికరాల కొనుగోలుకు అవసరమైన మొత్తాన్ని కేంద్రం విడుదల చేయాల్సి ఉంది.  నాలుగేళ్ల క్రితమే ఈ సెంటర్‌ ఏర్పాటుకు తొలి అడుగు పడినా ఇప్పటివరకూ కార్యరూపం దాల్చకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

Updated Date - 2022-05-20T06:25:27+05:30 IST