సచివాలయమూ లేదు....సిబ్బందీ లేరు..!

ABN , First Publish Date - 2022-04-24T04:52:11+05:30 IST

ప్రభుత్వం తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ ఇక్కడ అమలు కావడం లేదు. ఇక్కడ సచివాలయమూ లేదు...సచివాలయ సిబ్బందీ లేరు.

సచివాలయమూ లేదు....సిబ్బందీ లేరు..!
సచివాలయం లేని పర్తికోట గ్రామం

సచివాలయమే లేని గ్రామంగా పర్తికోట 

12 గ్రామాల ప్రజలకు తప్పని అవస్థలు

ములకలచెరువు, ఏప్రిల్‌ 23: ప్రభుత్వం తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ ఇక్కడ అమలు కావడం లేదు. ఇక్కడ సచివాలయమూ లేదు...సచివాలయ సిబ్బందీ లేరు. ప్రభుత్వ సేవలు పొందడానికి, సమస్యల పరిష్కారానికి 12 గ్రామాల ప్రజలు పడుతున్న అవస్థలు వర్ణణాతీతం. ములకలచెరువు మండలంలోని దేవళచెరువు గ్రామ పంచాయతీని గత ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వం రెండుగా విభజించింది. పర్తికోట గ్రామం కేంద్రంగా కొత్తగా పంచాయతీ ఏర్పడింది. పర్తికోట పంచాయతీ పరిధిలో పర్తికోట, ఆవులవారిపల్లె, చిటికివారిపల్లె, కన్నెమడుగువారిపల్లె, దుగుసానివారిపల్లె, వసంతరాయనిపల్లె, గుడిసెవారిపల్లె, నీరుగట్టువారిపల్లె, గోళ్ళవారిపల్లె, ఎర్రంరెడ్డిగారిపల్లె, మావిళ్ళవారిపల్లె, మామిడిగుంపులవారిపల్లె ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఏర్పడి 14 నెలలు కావస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు ఇక్కడ సచివాలయం ఏర్పాటు చేయలేదు.. సిబ్బందిని కూడా నియమించలేదు. సచివాలయమూ లేక...సిబ్బంది లేక 12 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనులు, సమస్యల పరిష్కారం కోసం కిలో మీటర్ల దూరంలో ఉన్న దేవళచెరువు సచివాలయానికి వెళ్ళాల్సి వస్తోంది. ఎర్రరెడ్డిగారిపల్లె, మావిళ్ళవారిపల్లె గ్రామస్థులు 9 కిలోమీటర్ల దూరంలోని దేవళచెరువు సచివాలయానికి వెళ్ళాలి. మిగిలిన గ్రామాల ప్రజలు నాలుగు నుంచి ఆరు కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సి వస్తోంది. సొంత గ్రామాల నుంచి కాలినడకన పర్తికోటకు వచ్చి అక్కడి నుంచి బస్సు, ఆటోల్లో వెళ్తున్నారు. పర్తికోట నుంచి దేవళచెరువుకు వెళ్లేందుకు ఉదయం, సాయంత్రం రోజుకు రెండుసార్లు మాత్రమే ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. దీంతో దేవళచెరువుకు వెళ్లేందుకు ప్రజలు ఆటోల్లో ప్రయాణించాల్సి వస్తోంది. పనుల కోసం ఉదయం వెళితే తిరిగి ఇంటికి రావడానికి సాయంత్రం అవుతోందని గ్రామస్థులు వాపోతున్నారు. ఇక వృద్ధులు, వికలాంగులు సచివాలయం వెళ్లేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పర్తికోటలో సచివాలయం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.


ప్రభుత్వానికి ప్రతిపాదనలు

- రమే్‌షబాబు, ఎంపీడీవో, ములకలచెరువు

పర్తికోటలో సచివాలయం ఏర్పాటుకు, సిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాము. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 2021 జనాభా లెక్కల ప్రకారం రెండు వేల కంటే తక్కువగా జనాభా ఉండడంతో పర్తికోటలో సచివాలయం ఏర్పాటు కాలేదు. 2022 జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుత జనాభా 2200కు చేరడంతో సచివాలయం ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాము. 

Updated Date - 2022-04-24T04:52:11+05:30 IST