ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల్లేవ్‌!

ABN , First Publish Date - 2022-04-04T06:19:30+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగులకు మరో వారంరోజుల వరకు వేతనాలు వచ్చే పరిస్థితి లేదు. సర్కారు తప్పిదాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది.

ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల్లేవ్‌!

 నూతన సాఫ్ట్‌వేర్‌లో పంపిన బిల్లులు రివర్స్‌

10వతేదీ తర్వాతే అందే అవకాశం

ఒంగోలు(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 3 : ప్రభుత్వ ఉద్యోగులకు మరో వారంరోజుల వరకు వేతనాలు వచ్చే పరిస్థితి లేదు. సర్కారు తప్పిదాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా వేతనాలు చెల్లిస్తుంది. అయితే ఈనెలలో కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి అందులో ఉద్యోగుల వేతనాల బిల్లులు పంపాలని ఆదేశించింది. అందుకు అనుగుణంగా ట్రెజరీ అధికారులు పంపారు. అయితే ఆ బిల్లులు ట్రెజరీలకు వెనక్కు వచ్చాయి. దీంతో ప్రభుత్వం హడావుడిగా మరలా సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారానే జీతాల బిల్లులు పంపాలని ఆదేశించింది. అయితే డ్రాయింగ్‌ ఆఫీసర్లు అందుబాటులో లేకపోవడం, వరుసగా సెలవులు రావడంతో తిరిగి బిల్లులు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. కొన్ని పరిమిత శాఖల నుంచి వచ్చిన బిల్లులను శనివారం ట్రెజరీ అధికారులు సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా పాస్‌ చేసి పంపారు. జిల్లావ్యాప్తంగా 27వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తుండగా అన్ని కార్యాలయాల నుంచి మరలా ట్రెజరీకి బిల్లులు రావాల్సి  ఉంది. వాటిని సీఎఫ్‌ఎంఎస్‌లో పంపాలి. వాటిని అమరావతిలో పరిశీలించిన తర్వాతనే ఉద్యోగులకు వేతనాలు పడే అవకాశం ఉంది. అయితే ఈ ప్రక్రియ జరగాలంటే మరో నాలుగైదురోజులు పడుతుందని ట్రెజరీ అధికారులు చెబుతున్నారు. ఏదిఏమైనా ప్రభుత్వం చేసే త ప్పిదాల వల్ల సామాన్య ప్రజలే కాక ఉద్యోగులు కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 

Updated Date - 2022-04-04T06:19:30+05:30 IST