ఆకలితో అటవీశాఖ ఉద్యోగులు.. నాలుగు నెలలుగా అందని జీతాలు

ABN , First Publish Date - 2020-07-07T20:16:44+05:30 IST

ఒకవైపు క్రూరమృగాలు.. మరోవైపు అడవిదొంగల మధ్య భయంభయంగా విధులు నిర్వహిస్తూ బతుకుబండి లాగిస్తున్న ఆ చిరుద్యోగులకు సకాలంలో వేతనాలు అందడం లేదు. దీంతో ఆకలితోనే అడవుల్లో

ఆకలితో అటవీశాఖ ఉద్యోగులు.. నాలుగు నెలలుగా అందని జీతాలు

నిధులు రాకనే ఆలస్యం


ప్రొద్దుటూరు (కడప): ఒకవైపు క్రూరమృగాలు.. మరోవైపు అడవిదొంగల మధ్య భయంభయంగా విధులు నిర్వహిస్తూ బతుకుబండి లాగిస్తున్న ఆ చిరుద్యోగులకు సకాలంలో వేతనాలు అందడం లేదు. దీంతో ఆకలితోనే అడవుల్లో ఉద్యోగాలు నిర్వహిస్తూ వేతనాల కోసం ఎదురుచూడడం వీరి వంతైంది. ఆ వివరాల్లోకి వెళ్లితే.. అటవీశాఖలో జిల్లాలో దాదాపు వెయ్యి మంది వరకు ప్రొటెక్షన్‌ వాచర్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు కింద పనిచేస్తున్నారు. నెలకు రూ.8,054 వేతనం వస్తుందని, అందులో ఈఎ్‌సఐ, పీఎఫ్‌ పోగా రూ.7,027 ఆ ఉద్యోగుల ఖాతాలో జమ చేయనున్నట్లు తెలుస్తోంది. కడప, ప్రొద్దుటూరు, రాజంపేట అటవీ డివిజన్లలో ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు అడవుల్లో పలుచోట్ల బేస్‌ క్యాంప్‌లు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క అటవీ రేంజ్‌ పరిధిలో సుమారు అయిదు వరకు బేస్‌క్యాంపులు ఉన్నాయి. ఇందులో ఒక్కొక్క క్యాంపులో 25 మంది పనిచేస్తున్నట్లు సమాచారం. వీరు 24 గంటలు వంతుల వారీగా విధులు నిర్వహిస్తూ అడవికి కాపలాగా ఉంటున్నారు. గస్తీ సమయంలో మృగాలు కానీ, చెట్లు నరికేవారు కానీ వీరిపై దాడికి తెగబడ్డా ప్రాణరక్షణ కోసం లాఠీ మినహా ఎటువంటి ఆయుధాలు ఉండవు.


అయినప్పటికీ కుటుంబ పోషణకు తెగింపు చేసి అడవుల్లో విధులకు వెళుతున్నారు. ఒకసారి విధులకు వెళితే రోజుల తరబడి అడవుల్లోనే ఉండడం వలన కుటుంబానికి కూడా దూరంగా ఉంటున్నారు. ఇంతచేసినా సకాలంలో వేతనాలు రాకపోవడం వలన కుటుంబ పోషణ భారం కావడంతో ఇబ్బందులు పడుతున్నామని బాధిత సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతనానికి సంబంధించిన వివరాలు అడిగితే అధికారులు పలకడం లేదని చెబుతున్నారు. వీరు కాకుండా మరికొంతమందిని సైక్లింగ్‌ ఫోర్స్‌గా వినియోగించుకుంటున్నారు. ఎర్రచందనం, అటవీ సంపద అక్రమంగా తరలిపోతుందనే సమాచారం వస్తే వెంటాడి పట్టుకునే బాధ్యతను కూడా సైక్లింగ్‌ ఫోర్స్‌ను ప్రొటెక్షన్‌ వాచర్లు చేపడుతున్నారు. విధుల్లో ఎక్కడైనా జంతువులు దాడి చేస్తే తగిన సాయం చేసే పరిస్థితి కూడా లేదని కొంతమంది సిబ్బంది వాపోతున్నారు. 

 

బడ్జెట్‌ కేటాయించకపోవడంతోనే..: రవికుమార్‌, ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌, ప్రొద్దుటూరు

ప్రొటెక్షన్‌ వాచర్లకు నాలుగు నెలలుగా వేతనాలు అందని మాట వాస్తవమే. ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయించకపోవడంతో ఆలస్యం జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. బడ్జెట్‌ రాగానే వేతనాలు చెల్లింపులు ఉంటుంది. 

Updated Date - 2020-07-07T20:16:44+05:30 IST